Idream media
Idream media
తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితికి తిరుగులేదని తెలుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక గెలుపు అనంతరం బీజేపీ దూకుడు.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాస్త పెరిగినప్పటికీ ఆ తర్వాత క్రమేణా తగ్గుతూ వస్తోంది. మొత్తంగా ఎటుచూసినా గులాబీ పార్టీ హవా కొనసాగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికలో కూడా కేవలం వేయి ఓట్లతో తేడాతోనే బీజేపీ గెలిచింది. కానీ, టీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చోటుచేసుకోవడం, తొలిసారిగా అధికారీ పార్టీ ఓడిపోవడంతో అది సంచలనంగా మారింది. ఆ తర్వాత వెంటనే వచ్చిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తన బలాన్ని భారీగా పెంచుకున్నా పీఠాన్ని కైవసం చేసుకోలేకపోయింది.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల అనంతరం వరుసగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, తాజాగా జరిగిన మినీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ చతికిలపడింది. నాగార్జునసాగర్‌లో అయితే డిపాజిట్ ఓట్లలో సగం కూడా పొందలేకపోయింది. అలాగే ఇటీవల ఎన్నికలు జరిగిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ గులాబీమయం అయ్యాయి. రెండు కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లతోపాటు ఐదు మునిసిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్ పదవులన్నీ అధికార టీఆర్‌ఎస్‌కే దక్కాయి. శుక్రవారం నిర్వహించిన ఎన్నికలు అన్ని చోట్లా ఏకగ్రీవమయ్యాయి. అధిష్ఠానం సీల్డ్ కవర్‌లో పేర్లు పంపించిన వారినే ఎన్నుకున్నారు. ప్రతి చోటా అత్యధిక స్థానాలను టీఆర్‌ఎస్ గెలుచుకున్నా.. పాలకమండళ్ల ఎన్నికకు ముందుజాగ్రత్తగా కొన్ని చోట్ల ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా హాజరయ్యారు. కొవిడ్ నిబంధనల మేరకు ఎన్నికలు నిర్వహించారు.
గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యుఎంసీ) మేయర్‌గా గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్‌గా రిజ్వానా షమీమ్ ఎన్నికయ్యారు. ఇక్కడ 66 డివిజన్లకుగాను టీఆర్‌ఎస్ 48 డివిజన్లను గెలుచుకోవడంతో పాలకమండలి ఎన్నికలో బీజేపీ (10), కాంగ్రెస్(4) పాల్గొనలేదు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ పసునూరి దయాకర్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, టి.రాజయ్య హాజరయ్యారు. అంతకుముందు ఉదయం హన్మకొండలోని ఓ హోటల్‌లో టీఆర్‌ఎస్ కార్పొరేటర్లతో మంత్రులు గంగుల కమలాకర్, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు పార్టీ సూచించిన వారికి ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించాలని చెప్పారు. అనంతరం జీడబ్ల్యూఎంసీ కార్యాలయం వద్దకు బస్సులో చేరుకున్నారు.
ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు రెండూ మహిళలకే దక్కాయి. మేయర్‌గా పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్‌గా ఫాతిమా జొహారా ఎన్నికయ్యారు. వీరిద్దరి పేర్లను సీఎం కేసీఆర్.. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడి చర్చించిన అనంతరం సీల్డ్ కవర్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో ఖమ్మం పంపించారు. హోటల్‌లో సమావేశం అనంతరం ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి కార్పొరేటర్లు ప్రత్యేక బస్సులో కార్యాలయానికి చేరుకున్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మునిపాలిటీలో 20 వార్డులకుగాను 11 వార్డులు గెలుచుకున్న టీఆర్‌ఎస్ తరఫున చైర్మన్‌గా రాచకొండ శ్రీనివాస్, వైస్ చైర్మన్‌గా మురారిశెట్టి ఉమారాణి ఎన్నికయ్యారు. అవసరమైతే ఎక్స్ అఫీషియా ఓట్లు వేసేందుకు ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, ఎంపీ లక్ష్మీకాంతారావు హాజరయ్యారు. అయితే లక్ష్మీనారాయణ, లక్ష్మీకాంతారావు ఇద్దరూ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియా ఓట్ల కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నందున ఈ ఎన్నికల్లో వారి ఓటు చెల్లదని కాంగ్రెస్ కౌన్సిలర్లు అభ్యంతరం చెప్పారు. దీంతో వారిద్దరినీ ఎక్స్ అఫీషియో ఓటు వేయకుండా నిలుపుదల చేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు.