iDreamPost
android-app
ios-app

మంత్రి నుంచి ప్రాణహాని ఉందంటున్న టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌.. అసలేం జరిగిందంటే..

మంత్రి నుంచి ప్రాణహాని ఉందంటున్న టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌.. అసలేం జరిగిందంటే..

ఆయన అధికార పార్టీకి టీఆర్‌ఎస్‌కు చెందిన మంత్రి. ఈయన కూడా అదే పార్టీకి చెందిన ఓ వార్డు కౌన్సిలర్‌. కానీ.. ఆ మంత్రి నుంచి తనకు ప్రాణహాని ఉందని మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ 43వ వార్డు కౌన్సిలర్‌ బురుజు సుధాకర్‌ రెడ్డి మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్సీ)ను ఆశ్రయించారు. స్థానికంగా జరుగుతున్న అక్రమ కట్టడాలపై మంత్రి కేటీఆర్‌, జిల్లా కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్ లకు ఫిర్యాదు చేసినందుకు తనపై మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తప్పుడు కేసులు పెట్టించారని ఆయన ఆరోపించారు.

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌తో పాటు.. టీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు రౌడీలు, వన్‌టౌన్‌ సీఐ రాజేశ్వర్‌ గౌడ్‌ల నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు. తనకు రక్షణ కల్పించడంతో పాటు విచారణ జరిపించి సంబంధిత వ్యక్తులు, అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా.. అవినీతికి పాల్పడుతూ పలు కేసుల్లో జైలుకు వెళ్లి పార్టీ ప్రతిష్ఠను దిగజారుస్తున్న కౌన్సిలర్‌ సుధాకర్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌ నుంచి బహిష్కరిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు బాద్మి శివకుమార్‌ మంగళవారం మహబూబ్‌నగర్‌ లో తెలిపారు.

కాగా, రాంనగర్‌ ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కౌన్సిలర్‌ సుధాకర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్‌ రామాంజనేయులు ఆక్రమించారని తమ విచారణలో తేలిందని తహసీల్దార్‌ పార్థసారధి పేర్కొన్నారు. వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Also Read :  తెలంగాణ‌కు జేపీ న‌డ్డా.. సికింద్రాబాద్ లో హైటెన్ష‌న్‌.. చివ‌ర‌కు..