Idream media
Idream media
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం మొదలైంది. తొలిరోజు ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు కూడా వేశారు. కానీ ఇప్పటి వరకూ టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థుల ప్రకటన వెలువడలేదు. ఇరు పార్టీలూ తమ అభ్యర్థుల ఎంపిక కోసం మల్లగుల్లాలు పడుతున్నాయి. విచిత్రం ఏంటంటే ఆ రెండూ ఒకే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముందు బీజేపీ ప్రకటిస్తే ఆ అభ్యర్థి సామాజిక వర్గం, స్థాయిని బట్టి తమ అభ్యర్థిని ప్రకటించాలని టీఆర్‌ఎస్ భావిస్తుండగా, బీజేపీ కూడా వేచి చూసే ధోరణిలోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, టీడీపీలు అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ మాత్రం తమ అభ్యర్థి కె.జానారెడ్డి ఇప్పటికే ప్రచారపర్వంలో ముందంజలో ఉన్నారు. ఈ నెల 29న నామినేషన్ వేసేందుకు కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టీడీపీ నుంచి మువ్వా అరుణ్‌కుమార్ పోటీ చేస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థిని కూడా పోటీలో నిలుపుతున్నట్లు మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రకటించారు. మరోవైపు బీఎల్‌ఎఫ్ అభ్యర్థిగా కాశీ పేరును ఖరారు చేశారు. అయితే అభ్యర్థుల ఎంపికతో సంబంధం లేకుండా అన్ని పార్టీలూ అక్కడ చాలా కాలంగా ప్రచారం సాగిస్తున్నాయి. కాగా ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థిత్వాలు ఎవరికి దక్కుతాయనే చర్చ రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతోంది. వీరిలో అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎంపికే కీలకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంలో ఉన్న ఆ పార్టీ అధిష్ఠానం ‘సాగర్’లోనూ విజయం సాధిస్తామనే ధీమాతో ఉంది. సిటింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలనే పట్టుదలతో అభ్యర్థి ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది.
హైదరాబాద్ తరహాలోనే..
ఇటీవల మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్‌ఎస్ పోటీకే దూరంగా ఉంటుందనే ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో సురభి వాణీదేవి అభ్యర్థిత్వాన్ని సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఆమె విపక్షాలకు ధీటైన అభ్యర్థిగా గుర్తింపు పొంది విజేతగా నిలిచారు. అలాగే సాగర్ అభ్యర్థి విషయంలో కూడా జరుగుతుందనే చర్చ జరుగుతోంది. స్థానికేతరుడుడా ప్రచారం జోరందుకున్న నోముల నర్సింహయ్య తనయుడు భగత్ యాదవ్‌కు కాకుండా, పార్టీలోని స్థానిక యాదవ నాయకుల్లో ఒకరికి టికెట్ ఇవ్వాలనే విజ్ఞప్తులు నియోజకవర్గం నుంచి అధినాయకత్వానికి పెద్ద ఎత్తున అందుతున్నాయి. ఎస్టీల తర్వాత ఆ నియోజకవర్గంలో యాదవుల జనాభా అత్యధికంగా ఉండటమే అందుకు కారణం. అన్ని సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని రెండు, మూడు రోజుల్లోనే అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉందని పార్టీ ముఖ్యులు భావిస్తున్నారు.
టికెట్ దక్కక ఎవరైనా వస్తే…
బీజేపీ మాత్రం తమ అభ్యర్థి ఎంపిక విషయంలో వేచిచూసే ధోరణి అవలంబిస్తోంది. టీఆర్‌ఎస్ అభ్యర్థి ఖరారయ్యాక తమ అభ్యర్థిని నిర్ణయించాలనే వ్యూహంతో కమలనాథులు ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్ ఆశావహుల్లో డాక్టర్ రవికుమార్ నాయక్, ఇంద్రసేనారెడ్డి, కంకణాల నివేదితారెడ్డి, కడారి అంజయ్యయాదవ్ పేర్లు ప్రధానంగా ఉన్నాయి. అయితే నియోజకవర్గంలో పార్టీ బలం పెద్దగా లేకపోవడంతో అభ్యర్థి ద్వారా హల్‌చల్ చేయాలనేది బీజేపీ ఆలోచనగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో బీజేపీలో చేరతానని ప్రకటించిన తనను.. ‘సాగర్’ ఉప ఎన్నికలో ఆ పార్టీ తరఫున పోటీ చేయాల్సిందిగా అడుగుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రకటించడం చర్చనీయాంశమైంది. దీనిని బట్టే సరైన అభ్యర్థి వెతుకులాటలో బీజేపీ ఉందని స్పష్టమవుతోంది. అయితే టీఆర్‌ఎస్ టికెట్ దక్కని నేతల్లో ఎవరైనా తమ పార్టీలోకి వస్తే టికెట్ ఇవ్వాలనే ఉద్దేశం కూడా బీజేపీ ముఖ్య నాయకత్వానికి ఉండవచ్చని అంటున్నారు.
బీజేపీ అడగడం నిజమే : మల్లన్న
నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పోటీ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. దీనిపై మల్లన్న స్పందించారు. తాను ఏ పార్టీలోనూ చేరేది లేదని స్పష్టం చేశారు. అయితే, పార్టీలో చేరాలని బీజేపీ అడిగింది మాత్రం వాస్తవమేనని చెప్పారు. టీఆర్‌ఎస్‌కు తప్పా ఏ పార్టీకి ఓటేసినా పర్వాలేదని ప్రజలకు చెబుతానని అన్నారు. త్వరలోనే పాదయాత్ర చేస్తానని చెప్పారు.