iDreamPost
android-app
ios-app

వీడియో: ఘోర రైలు ప్రమాదం.. బోల్తా పడిన 10 రైలు బోగీలు!

వీడియో: ఘోర రైలు ప్రమాదం.. బోల్తా పడిన 10 రైలు బోగీలు!

తరచూ ఏదో ఒక ప్రాంతంలో రైలు ప్రమాదాల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పట్టాలు తప్పడం, సిగ్నలింగ్ లో పొరపాటు, కొందరు డ్రైవర్ల నిర్లక్ష్యం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. రైలు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ నష్టం భారీగా ఉంటుంది. ఇటీవలే ఒరిస్సాలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం యావత్తు దేశాన్ని దిగ్ర్భాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో దాదాపు 300 మంది మృతి చెందారు. వందల మందికి తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా పొరుగు దేశమైన పాకిస్థాన్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 33 మంది దుర్మరణం చెందగా.. 100 మందికి గాయాలయ్యాయి. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం…

పాకిస్థాన్ లోని కరాచీ నుంచి రావల్పిండికి హజారా ఎక్స్ ప్రెస్ రైలు ఆదివారం బయలుదేరింది. సింధ్ ప్రావిన్స్ నవాబ్ షా జిల్లాలోని సర్హరి  రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 33 మంది మృతి చెందారు. అలానే 100 మందికి  తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పాక్ రైల్వే మంత్రి సాద్ రఫిక్  తెలిపారు. ప్రమాదానికి గురైన  హజారా ఎక్స్ ప్రెస్ రైలులోని మొత్తం 10 బోగీలు పట్టాలు తప్పాయని మంత్రి సాద్ రపిక్  అన్నారు. సమాచారం అందుకున్న వెంటే  అధికారులు, ఇతర సహాయ బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి.

అంతేకాక ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో రైల్లో 1000 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదానికి సాంకేతిక లోపం కారణంగా కనిపిస్తోందని మంత్రి అన్నారు.  కాలం చెల్లిన రైలు పట్టాలు, నిర్వహణ లోపం, సిగ్నళ్ల వ్యవస్థ వైఫల్యం, సాంకేతిక సమస్యలు, పాత రైలు ఇంజిన్ల వల్ల పాకిస్థాన్ లో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదం కరాచికి 275 కిలోమీటర్ల  దూరంలో జరిగింది.  హజారా ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో  అటుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేశారు. మృతుల కుటుంబాలకు పాక్ ప్రధాని, రైల్వే మంత్రి… తమ సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని  వారు ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: ఫ్రెండ్​షిప్ డే నాడే తీవ్ర విషాదం.. ముగ్గురు స్నేహితులు మృతి!