iDreamPost

ఫ్రెండ్​షిప్ డే నాడే తీవ్ర విషాదం.. ముగ్గురు స్నేహితులు మృతి!

  • Author singhj Updated - 12:49 PM, Sun - 6 August 23
  • Author singhj Updated - 12:49 PM, Sun - 6 August 23
ఫ్రెండ్​షిప్ డే నాడే తీవ్ర విషాదం.. ముగ్గురు స్నేహితులు మృతి!

చిరకాలం నిలిచిపోయే బంధాల్లో స్నేహ బంధం ఒకటి. మంచి మిత్రులు ఓ నలుగురు ఉంటే చాలు.. జీవితం మొత్తం సాఫీగా సాగిపోతుంది. ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు వచ్చినా నిలబడేవారు ఫ్రెండ్సే. అందుకే ఎవరినైనా అంచనా వేయాలంటే ముందు అతడి ఫ్రెండ్స్​ను చూపించమని పెద్దలు చెబుతుంటారు. అలాంటి ఫ్రెండ్స్​కు గుర్తుగా ప్రతి ఏడాది జులై 30న అధికారికంగా అంతర్జాతీయ స్నేహ దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే భారత్, బంగ్లాదేశ్​తో పాటు మరికొన్ని దేశాల్లో ఆగస్టు మొదటి ఆదివారం నాడు ఫ్రెండ్​షిప్​ డేను సెలబ్రేట్ చేసుకుంటారు. అలాంటి ఫ్రెండ్​షిప్​ డే రోజే తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒక కారు పంట కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు మిత్రులు ప్రాణాలు కోల్పోయారు.

కారు పంట కాలువలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరారు. ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా, కోరుకొండ మండలం, బూరుగుపూడి దగ్గర ఒక కారు అదుపు తప్పింది. అది కాస్తా వంతెన నుంచి కాలువలోకి దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. ఏలూరు రామచంద్ర ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన స్టూడెంట్స్ విహార యాత్రకు ప్లాన్ చేసుకున్నారు. థర్డ్ ఇయర్ చదువుతున్న 10 మంది విద్యార్థులు రెండు కార్లలో మారేడుమిల్లికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఒక డ్రైవర్​ను కూడా వెంటబెట్టుకొని విద్యార్థులు మారేడుమిల్లికి శనివారం నాడు బయల్దేరారు. అక్కడి టూరిజం ప్లేసెస్​ను ఆస్వాదించిన తర్వాత అదేరోజు రాత్రి తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో బూరుగుపాడు దగ్గరకు వచ్చేసరికి అర్ధరాత్రి దాటింది.

బూరుగుపాడు వద్ద రెండు కార్లలో ఒక కారు పంట కాలువలోకి దూసుకొని వెళ్లింది. యాక్సిడెంట్ జరిగిన సమయంలో కారులో మొత్తం ఆరుగురు ఉన్నారు. ప్రమాదాన్ని గుర్తించిన మరో కారులోని స్టూడెంట్స్.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు క్రేన్ల సాయంతో కారును వెలికితీయగా.. అందులోని ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను ఉదయ్ కిరణ్, హర్షవర్దన్, హేమంత్​లుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో మరో ముగ్గుర్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఓవర్​ స్పీడ్ కారణంగానే కారు ప్రమాదానికి గురైందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కారు మీద తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో ఓవర్ స్పీడ్​కు సంబంధించిన చలాన్లు ఉన్నట్లు గుర్తించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి