iDreamPost
android-app
ios-app

రైతుల ట్రాక్టర్ల పరేడ్‌… ఉద్యమాన్ని మలుపుతిప్పనుందా..?

రైతుల ట్రాక్టర్ల పరేడ్‌… ఉద్యమాన్ని మలుపుతిప్పనుందా..?

ఈ రెండు నెలలూ ఓ ఎత్తు.. ఈరోజు ఓ ఎత్తు.. అన్నట్లుగా రైతు ఉద్యమం మారింది. ఉద్యమంలో భాగంగా గణతంత్ర దినోత్సవం రోజున ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తామని రైతు సంఘాలు ప్రకటించినప్పటి నుంచీ కేంద్రం అలర్ట్‌ అయింది. ఆ ర్యాలీని ఆపేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. తాజాగా రైతులకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన 11వ రౌండు చర్చల సందర్భంగా కూడా ర్యాలీని విరమించుకోవాలని కేంద్ర పెద్దలు రైతులను కోరారు. ఆ చర్చలు అసంపూర్తిగా ముగియడంతో ర్యాలీపై సందిగ్ధత ఏర్పడింది. అంతకు ముందే ర్యాలీని ఆపాలని కేంద్రం సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది. ప్రభుత్వ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఇది శాంతిభద్రతలకు సంబంధించిన విషయమని, నిర్ణయం తీసుకోవాల్సింది పోలీసులేనని పేర్కొంది. దీంతో పోలీసులు అనుమతి ఇస్తారా..? లేదా..? అనే సందిగ్ధం కొనసాగింది. సుప్రీంకోర్టులోనూ, బయటా కేంద్రం దీన్ని వ్యతిరేకించినా చివరకు అంగీకరించక తప్పలేదు. అయితే పోలీసులు 36 ఆంక్షలు విధించారు.

5000 ట్రాక్టర్లు, 5000 మంది మాత్రమే…

ట్రాక్టర్ల ర్యాలీని సక్సెస్‌ చేసి తమ డిమాండ్లకు కేంద్రం తలొగ్గేలా ఉద్యమ రూపాన్ని మరింత ఉధృత చేయాలని రైతు సంఘాలు భావించాయి. సుమారు 50 వేల నుంచి లక్ష ట్రాక్టర్లతో పరేడ్‌ నిర్వహించాలని సన్నాహాలు చేశాయి. వారం రోజులుగా రైతులు ట్రాక్టర్లతో రాజధానికి వస్తూనే ఉన్నారు. శివారులో వేచి ఉంటున్నారు. అయితే.. ట్రాక్టర్లతో పరేడ్‌కు అనుమతి ఇచ్చిన పోలీసులు చాలా షరతులు పెట్టారు. ఢిల్లీలో నాలుగు సరిహద్దుల సమీపంలో మార్గాల్ని అనుమతించారు. కేవలం 5000 ట్రాక్టర్లు, 5000 మంది మాత్రమే రైతులు, వారికి తోడు 2500 మంది వలంటీర్లను మాత్రమే ఢిల్లీలోకి అనుమతిస్తామని చెప్పారు. ర్యాలీ కూడా నిర్దేశిత మార్గాల్లోనే సాగాలి. ఎక్కడా ఆగడం, ధర్నా చేయడం, ప్రసంగాలు… ఇలాంటివేవీ కుదరవు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ముగిసిపోవాలి.

యాంత్రిక సమస్య వల్ల మధ్యలో ఏ ట్రాక్టర్‌ నిలిచిపోయినా వేరే ట్రాక్టర్‌ను సరిహద్దుల నుంచి తీసుకురావడానికి వీల్లేదు. ప్రజా రవాణాకు, ట్రాఫిక్‌కు అంరాయం కలిగించకుండా రోడ్డుకు ఓ పక్కగా ట్రాక్టర్లు వెళ్లాలి. మంచినీళ్లు ఫస్ట్‌ ఎయిడ్‌ లాంటివి రైతులే తెచ్చుకోవాలి. ఇలాంటి ఎన్నో షరతులు విధించారు. చివరకు జెండా కర్రల విషయంలో కూడా ఆంక్షలు పెట్టారు. 36 షరతుల్లో ఒక్కటి ఉల్లంఘించినా ర్యాలీకి అనుమతి నిరాకరిస్తామని చెప్పారు.

అంగీకరించారు కానీ…?

పోలీసుల షరతులకు రైతు సంఘాలు సరేనన్నాయి. అయినప్పటికీ ఇది ఏ మలుపు తీసుకుంటుందోనన్న అనుమానం పోలీసులను వెంటాడుతోంది. ముందు జాగ్రత్తగా ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు. రిపబ్లిక్‌ డే పరేడ్‌ భద్రతకు నియమించిన కేంద్ర రిజర్వు పోలీసుసిబ్బంది, ఇతర అధికారులు అతితక్కువ వ్యవధిలో సిద్దంగా ఉండాలని ఢిల్లీ పోలీసు కమిషనర్‌ ఎస్‌ ఎస్‌ శ్రీవాత్సవ ఇప్పటికే ప్రకటించారు. సింఘూ, చిల్లా, టిక్రీ, గాజీపూర్‌ ప్రాంతాల్లో ఏ మార్గంలో ట్రాక్టర్ల పరేడ్‌ నిర్వహించాలని పోలీసులు నిర్దేశించారు. అయితే ఈ మార్గాల్లో ట్రాక్టర్లు ఢిల్లీలోకి ప్రవేశించిన తర్వాత వెనక్కి వెళ్లకపోతే ఏం జరుగుతుందోనన్న ఆందోళన నలు వ్యక్తమవుతున్నాయి. ఈ మార్గాలను దిగ్బంధనం చేస్తే ఢిల్లీలో జన జీవనం స్తంభించిపోయే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ఏర్పడింది.

‘ఢిల్లీ రైతుల ర్యాలీ’కి మద్దతు గా..

ఇదిలా ఉండ‌గా.. ఢిల్లీ రైతుల ర్యాలీకి మ‌ద్ద‌తుగా ఇత‌ర రాష్ట్రాల‌లో కూడా నేడు ర్యాలీ లు నిర్వ‌హించ‌నున్నారు. మంగళవారం బెంగళూరులో ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టాలని కర్ణాటక రైతులు సంఘాల నేతలు నిర్ణయించారు. ఢిల్లీ వీధుల్లో ట్రాక్టర్ల ర్యాలీకి పంజాబ్‌ రైతులు సిద్ధం కాగా అదే తరహాలోనే బెంగళూరులోనూ ర్యాలీకి సిద్ధమవుతున్నట్టు రాష్ట్ర రైతు సంఘం కన్వీనర్‌ వీరసంగయ్య ఆదివారం తెలిపారు. రాష్ట్ర రైతు సంఘం, హసిరుసేన, చెరుకు రైతుల సంఘం, ప్రాంతీయ రైతు సంఘం, ఐక్య పోరాట సమితితోపాటు నాలుగు రైతు పోరాట కమిటీలు, దళిత, కార్మిక, మహిళా సంఘాలు ఈ ర్యాలీలో పాల్గొంటున్నట్టు చెప్పారు.

మరో 20 సంఘాలు కూడా మద్దతు ఇస్తున్నాయన్నారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావంగా తెలుగురాష్ట్రాలలో కూడా ర్యాలీలకు సిద్ధమవుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ స్టేడియంలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ర్యాలీ ప్రారంభం కానుంది. ఉప్పల్‌ సర్కిల్‌ వరకూ కార్లు, బైక్‌లు, ఆటోలతో ర్యాలీ నిర్వహించనున్నట్టు అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌ పశ్య పద్మ తెలిపారు. రాష్ట్రంలో మంగళవారం నిర్వహించే ర్యాలీలకు వామపక్షాలు, పార్టీ శ్రేణులు, అన్ని వర్గాలూ మద్దతు తెలపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి కోరారు.