ఇది.. అది.. ఒక్కటి కాదు యనమల

తనకున్న రాజకీయ అనుభవంతో తిమ్మిని బమ్మిని చేయాలని మాజీ స్పీకర్, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు చాలా కష్టపడుతుంటారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత ఆయనే అనే రేంజ్‌లో ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పని చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, పథకాలుపై విమర్శలు, ఆరోపణలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. అందులో భాగంగానే తాజాగా యనమల.. జగనన్న వసతి దీవెన పథకంపై తనదైన శైలిలో విమర్శలు చేశారు.

పాత పథకాలకే కొత్త మసుగు వేస్తున్నారు. నాలుగుస్కీములు కలిపి జగనన్న వసతి దీవెన అంటున్నారు. గతంలో ఇచ్చినదాని కన్నా వెయ్యి రూపాయలే ఎక్కువ. మా ప్రభుత్వం విద్యార్ధులకు డైట్‌ ఛార్జీల కింద నెలకు 1400 చొప్పున 10 నెలలకు14 వేలు ఇచ్చాం. కాస్మొటిక్‌ చార్జీల కింద మరో 5 వేలు ఇచ్చాం. దీనికి అదనంగా మరో వెయ్యి కలిపి జగన్‌ 20 వేలు ఇస్తున్నారంటూ.. యనమల ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ చేశారు. క్లుప్తంగా చెప్పాలంటే.. జగనన్న వసతి దీవెన అనేది పేరు మాత్రమే మార్చారని.. తాము ముందే అమలు చేశామంటూ యనమల చెప్పుకొచ్చారు. సీనియర్‌ రాజకీయవేత్త అయిన యనమల ప్రజలకు నిజాలు చెప్పకపోయినా ఫర్వాలేదు కానీ అసత్యాలు చెప్పకూడదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

డైట్‌ చార్జీలు, కాస్మొటిక్‌ చార్జీలు సాంఘీక సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు మాత్రమే ఇస్తారన్న విషయం యనమలకు తెలియందేమీ కాదు. ఎస్టీ, ఎస్సీ, బీసీలకు మాత్రమే ఆయా హాస్టళ్లు ఉంటాయి. జగన్‌ సర్కార్‌ ప్రారంభించిన జగనన్న వసతి దీవెన పథకం కులాలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్క విద్యార్థికి అందిస్తున్నారు. ఏడాదికి 2.50 లక్షల ఆదాయం ఉన్న కుటుంబంలోని విద్యార్థి ఈ పథకానికి అర్హులు. వారు ఏ కాలేజీ (ప్రభుత్వ, ప్రైవేటు)లో చదువుతున్నారు..? ఎక్కడ (రూం, హాస్టల్‌) ఉంటున్నారు..? అనేవి అప్రస్తుతం.

ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులందరూ ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఫీజురియంబర్స్‌మెంట్‌ వస్తున్న ప్రతి విద్యార్థికి జగనన్న వసతి దీవెన పథకం ద్వారా వసతి, భోజన ఖర్చుకు నగదు లభిస్తుంది. ఐటీఐ చదివే వారికి 10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు 15 వేలు, డిగ్రీ ఆపై చదువులభ్యసిస్తున్న వారికి 20 వేలు చొప్పున ఏడాదిలో రెండు దఫాలుగా ఇస్తారు. మొదటి దఫా నిన్న ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి.. డైట్, కాస్మొటిక్‌ చార్జీలకు.. జగనన్న వసతి దీవెనకు మధ్య తేడా ఉందా..? లేదా..?.

Show comments