iDreamPost
android-app
ios-app

టీకాంగ్రెస్ లో పీసీసీ క‌ల్లోలం.. చెక్ ప‌డేదెన్న‌డు..?

టీకాంగ్రెస్ లో పీసీసీ క‌ల్లోలం.. చెక్ ప‌డేదెన్న‌డు..?

అస‌లే తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి ప్ర‌స్తుతం అంతంత మాత్ర‌మే. అన్ని ఎన్నిక‌ల్లోనూ ఘోర‌ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకుంటోంది. కాంగ్రెస్ విధేయులు మిన‌హా.. చాలా మంది నేత‌లు ఇత‌ర పార్టీల వైపు చూస్తున్నారు. కొంద‌రు ఇప్ప‌టికే బీజేపీ గూటికి చేరారు కూడా. ఇదే క్ర‌మంలో పీసీసీ చీఫ్ ప‌ద‌వికి ఉత్త‌మ్ రాజీనామా చేయడం.. ఆ ప‌దవి కోసం ప్ర‌ముఖులంద‌రూ రంగంలోకి దిగ‌డంతో ర‌చ్చ మొద‌లైంది. పోస్టుల కోసం పోటీ సాధార‌ణ‌మే అయినా.. పీసీసీ చీఫ్‌‌ ఎంపికపై కాంగ్రెస్‌లో రగడ మ‌రింత రచ్చకెక్క‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అదీ ప్ర‌స్తుతం రాష్ట్రంలో పార్టీ ఉన్న‌ప‌రిస్థితి తెలిసి కూడా సీనియ‌ర్లంద‌రూ ఇలా ఒక‌రిపైఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డంతో అధిష్ఠానానికి త‌ల‌నొప్పిగా మారింది. సీనియర్ల అసంతృప్తితో కాంగ్రెస్‌ అధిష్టానం పునరాలోచనలో పడింది.

టీపీసీసీ చీఫ్ ప‌ద‌వి రేవంత్‌కు ఖరారైరందని వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ కాంగ్రెస్ లో పెద్ద క‌ల్లోలం రేగుతోంది. సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి హనుమంతారావు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌కు కీలక బాధ్యతలు కట్టబెట్టడం సరికాదంటూ ఆయన విమర్శించారు. ప్యాకేజీకి అమ్ముడు పోయారని ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ పై కూడా తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవిపై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. వీహెచ్‌ వ్యాఖ్యలపై మల్లు రవి తాజాగా స్పందించారు. మాణిక్యం ఠాగూర్‌ సహా ఇతర కాంగ్రెస్‌ నేతలపై హనుమంతారావు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. వైద్య విద్యలో ఉన్నత చదువులు చదివి సమాజంలో మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చానని, తనకు ఎవరికీ చెంచాగిరీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తమ ప్రాంతవాసుడైన రేవంత్‌రెడ్డి పార్టీ ఎంపీ, వర్కింగ్ ప్రసిడెంట్‌గా ఉన్నారని, ఆయనకు పీసీసీ పదవి ఇవ్వాలని తాను బహిరంగంగానే మీడియాకు చెప్పినట్లు పేర్కొన్నారు.

అధిష్ఠానంపై ఆరోప‌ణ‌లా..?

పీసీసీ చీఫ్‌ ఎంపిక అంశం గురించి కూడా మ‌ల్లు మాట్లాడుతూ.. ‘‘165 మంది నాయకులతో పాటు నా అభిప్రాయాన్ని కూడా అధిష్టానం తీసుకుంది. ఏఐసీసీ దూతగా వచ్చిన ఇంచార్జి మాణిక్యం ఠాగూర్‌పై ఆరోపణలు చేస్తే అది అధిష్టానం పైన చేసినట్టే. గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని స్థాయిల్లోని నాయకులతో ఏఐసీసీ ఇంఛార్జీలు, 4 రోజులపాటు సుదీర్ఘంగా చర్చించి అభిప్రాయ సేకరణ చేశారు. ఆ తర్వాత ఏఐసీసీ కార్యదర్శులు మరి కొంత మంది ముఖ్యనేతలతో మరో దఫా చర్చలు జరిపారు. ఇంతలోతుగా సమీక్ష చేసి అన్ని వర్గాల నాయకుల అభిప్రాయాలతో మాణిక్యం ఠాగూర్, కేసీ వేణుగోపాల్ సోనియా గాంధీకి నివేదిక ఇచ్చారు. నిజానికి ఇంత ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నడూ చర్చలు జరగలేదు. క్రమశిక్షణ గల నాయకులు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పని చేయాలి.

6 కమిటీలు.. అందరికీ పదవులు

ప్ర‌స్తుతం పార్టీలో రేగుతున్న క‌ల్లోలం నేప‌థ్యంలో పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్లాల‌ని అధిష్ఠానం ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా రెండు దఫాలు రాష్ట్ర ప్రజల మన్ననలు పొందలేక పోయిన కాంగ్రెస్‌ పార్టీ 2023 ఎన్నికలను జీవన్మరణ సమస్యగా భావిస్తోంది. ఆ ఎన్నికల్లో వచ్చే ఫలితాల ఆధారంగానే పార్టీకి తెలంగాణలో మనుగడ ఉంటుందనే ఆలోచనలో ఉన్న ఢిల్లీ పెద్దలు.. పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్లాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే 162 మంది నాయకుల అభిప్రాయాన్ని అధిష్టానం సేకరించింది. అయితే ఇందులో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం, ఫలానా నాయకుడికే పీసీసీ పగ్గాలు ఇవ్వాలనే వాదనలు పెరుగుతుండడంతో పార్టీకి నష్టం జరగకుండా ప్రత్యామ్నాయాలవైపు హైకమాండ్‌ దృష్టి పెట్టిందనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి సాఫీగా పదవుల పందేరాన్ని పూర్తి చేయాలన్నది కాంగ్రెస్‌ అధిష్టానం ఆలోచన. అందులో భాగంగానే టీపీసీసీ అధ్యక్ష పదవితోపాటు పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ, వ్యూహ, మేనిఫెస్టో, కార్యక్రమాల అమలు, మీడియా పబ్లిసిటీ, సమన్వయ సలహా కమిటీలను ఏర్పాటు చేసే దిశలో కసరత్తు చేస్తోంది. సలహా కమిటీ చైర్మన్‌గా పొన్నాల లక్ష్మయ్య, కో చైర్మన్‌గా జానారెడ్డిల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇందులో దామోదర రాజనర్సింహ, వీహెచ్, షబ్బీర్‌ అలీ, గీతారెడ్డిలను నియమించనున్నట్టు తెలుస్తోంది. ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలకు కీలక పదవులు కట్టబెట్టాలన్నది సోనియా ఆలోచన అని చర్చ జరుగుతోంది. ఒకరికి టీపీసీసీ పగ్గాలు ఇచ్చి మిగిలిన ఇద్దరికి ప్రచార కమిటీ చైర్మన్, ఏఐసీసీ పదవులు ఇస్తారనే చర్చ జరుగుతోంది. మధు యాష్కీగౌడ్, సంపత్‌లను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా నియమించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది.