Idream media
Idream media
రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ బొక్కబోర్లాపడిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తెచ్చేందుకు ఇటీవల పీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్‌కి పీసీసీ ఇచ్చిన తర్వాత.. కాంగ్రెస్‌లో ఓ జోష్ కనిపిస్తోంది. దాన్ని కొనసాగించేలా రేవంత్ రెడ్డి కూడా దూకుడుగా రాజకీయాలు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేస్తూనే.. మరో వైపు పార్టీని బలోపేతం చేసేలా అడుగులు వేస్తున్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలను తిరిగి తీసుకువచ్చేందుకు రేవంత్ మంతనాలు జరుపుతున్నారు. ఈ రోజు టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ అధ్యక్షుడుగా పని చేసిన డి.శ్రీనివాస్ పెద్ద కుమారుడు, నిజమాబాద్ మాజీ మేయర్ డి. సంజయ్ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సాయంత్రం రేవంత్ రెడ్డి.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంటికి వెళ్లారు. పార్టీలో చేరాలని ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని కొండా విశ్వేశ్వరరెడ్డి స్వాగతించారు. తిరిగి కాంగ్రెస్‌లో చేరుతానని ప్రకటించారు. ఎప్పుడు చేరేది త్వరలోనే వెల్లడిస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ చేస్తున్న నిరుద్యోగ దీక్షల్లో పాల్గొంటానని తెలిపారు.
కేవీ రంగారెడ్డి మనుమడు అయిన కొండా విశ్వేశ్వరరెడ్డి టీఆర్‌ఎస్ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేశారు. 2014 ఎన్నికల్లో చేవెళ్ల లోక్‌సభ నుంచి పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ తరఫున మళ్లీ పోటీ చేసి ఓడిపోయారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. బీజేపీలో చేరాల్సిందిగా ఆయనకు ఆహ్వానాలు అందాయనే ప్రచారం సాగింది. అదే సమయంలో కొత్త పార్టీ పెడతారనే చర్చ జోరుగా సాగింది. కాంగ్రెస్‌లోకే తిరిగి వస్తారనే ప్రచారం జరిగింది. రేవంత్ రెడ్డి పీసీసీ అయిన తర్వాత.. కొండా ఘర్ వాపసీ జరగబోతోంది.