Idream media
Idream media
తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్‌లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఆ జోష్ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగి.. ప్రస్తుతం వివిధ పార్టీలలో ఉన్న నేతలు తిరిగి సొంత గూటికి వస్తున్నారు. రేవంత్‌ను చూసే తాము వస్తున్నామని, రేవంత్ ద్వారా కాంగ్రెస్‌కు పూర్వ వైభవం వస్తుందనే నమ్మకాన్ని వారు వ్యక్తం చేస్తుండడం రేవంత్ రెడ్డికి కొండంత బలం చేకూరుతోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ అధ్యక్షుడుగా పని చేసి, ప్రస్తుతం టీఆర్‌ఎస్ పార్టీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న డి.శ్రీనివాస్ పెద్ద కుమారుడు, నిజమాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ సొంత గూటికి వస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. రేవంత్ నాయకత్వాన్ని బలపరిచేందుకు తిరిగి తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అదే రోజు చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించిన విశ్వేశ్వర రెడ్డి.. తాజాగా రేవంత్ మంత్రాంగం తర్వాత కాంగ్రెస్‌లో తిరిగి చేరుతానని ప్రకటించారు.
ఈ రోజు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామితో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. వివేక్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి.. అతనితో రెండు గంటల పాటు మంతనాలు జరిపారు. ఈ భేటీ తర్వాత వివేక్ మాట్లాడుతూ.. బీజేపీలోభవిష్యత్ లేదని, రేవంత్ రెడ్డి వచ్చాక కాంగ్రెస్‌కు పూర్వ వైభవం వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా తాను కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు వివేక్ సంకేతాలిచ్చారు.
Also Read : నాడు తండ్రి కోసం తెరాస నేడు రేవంత్ కోసం కాంగ్రెస్ అంటున్న డి.శ్రీనివాస్ కొడుకు
దివంగత కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వెంకటస్వామి (కాకా) చిన్న కుమారుడే వివేక్. తన తండ్రి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన పెద్దపల్లి నుంచే వివేక్ కూడా 2009లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014లోనూ కాంగ్రెస్ తరఫున పోటీ చేసినా.. టీఆర్‌ఎస్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్ నుంచి పెద్దపల్లి లోక్‌సభ లేదా చెన్నూరు అసెంబ్లీ సీటును ఆశించారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు టిక్కెట్‌ను పెద్దపల్లి ఎంపీగా ఉన్న బాల్క సుమన్‌కు దక్కింది. దీంతో పెద్దపల్లి లోక్‌సభ టిక్కెట్ తనకు వస్తుందని వివేక్ ఆశించినా.. అది నెరవేరలేదు. టీఆర్‌ఎస్‌లో టిక్కెట్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్, అక్కడ నుంచి బీజేపీలోకి వచ్చిన వివేక్.. తిరిగి తన సొంత గూటికి చేరబోతున్నారు.
వివేక్ కాంగ్రెస్‌లో చేరడం వల్ల కాంగ్రెస్‌కు అదనపు బలం చేకూరనుంది. తెలంగాణలో ప్రముఖ ఛానెల్ వీ6, వెలుగు న్యూస్ పేపర్‌లను వివేక్ నడిపిస్తున్నారు. టీఆర్‌ఎస్‌కు టీ న్యూస్, నమస్తే తెలంగాణ రూపంతో సొంత మీడియా ఉంది. కాంగ్రెస్ నేతలు కూడా సొంత మీడియా సంస్థను ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనను ఇటీవల చేశారు. అయితే వివేక్ చేరడం ద్వారా ఆ లోటు తీరనుంది. కాంగ్రెస్ గొంతును వీ6, వెలుగు న్యూస్ పేపర్ ద్వారా వినిపించేందుకు అవకాశం ఏర్పడనుంది.
Also Read : రేవంత్ మంత్రాంగం.. కొండా ఘర్ వాపసీ