Idream media
Idream media
టీవీ సీరియల్ లా నెలల తరబడి కొనసాగుతున్న తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపికలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు కొనసాగుతున్నాయే ఉన్నాయి. దీనికి ముగింపు ఎప్పుడు పడుతుందో కానీ… రోజుకో వార్త తెరపైకి వస్తూనే ఉంది. ఇప్పటికీ ఆశావహుల్లో కొందరు ఢిల్లీలోనే పడిగాపులు కాస్తున్నారు. మరి కొందరు రాష్ట్రంలోనే ఉండి లేఖాయనాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మరో లేఖ ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.
లెటర్ హెడ్ లేఖలు
ఏడాది కాలంగా ఇదిగో పీసీసీ అదిగో పీసీసీ అంటూ ప్రచారం జరుగుతోంది. ప్రచారం మొదలైన ప్రతీసారి కాంగ్రెస్ నేతలు తమదైన మార్క్ రాజకీయాన్ని చూపిస్తున్నారు. తాజాగా నేడో రేపో పీసీసీ అధ్యక్షుడిని ప్రకటిస్తారనుకుంటున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ లో ఊహించని ట్విస్ట్ నెలకొంది. దీంతో పీసీసీ ఎంపిక మళ్లీ రసకందాయంలో పడినట్లయింది. తాజా సంఘటనతో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఏంటనేది మిలియన్ డాలర్ల ప్రశ్న గా మారింది. పీసీసీ అధ్యక్షుడి విషయంలో కొంత మంది నేతలు తమ లెటర్ హెడ్ మీద కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కి లేఖ రాశారు. భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్య లెటర్ హెడ్ మీద రాసిన లేఖపై .. ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు తూర్పు జగ్గారెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లు సంతకాలు చేశారు. ఆ లేఖలో అత్యంత కీలకమైన అంశాలను ప్రస్తావించారు.
సగం మందే సంతకాలు
కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక లో అభ్యర్థి ట్రాక్ రికార్డ్ పరిశీలించాలని కాంగ్రెస్ పార్టీ కి గాంధీ కుటుంబానికి లాయలిస్ట్ నమ్మకస్తుడు అయ్యుండాలని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ లేఖ తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ లేఖ ఎవరిని ఉద్దేశించి రాశారనేది కాంగ్రెస్లో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు
ఈ లేఖలో మొత్తం ఎమ్మెల్యేలు కూడా సంతకాలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఆరుగురే ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఈ లెటర్ పై ముగ్గురు మాత్రమే సంతకాలు చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీతక్క కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లు చేయలేదు. వీరిలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఎమ్మెల్యే సీతక్క మాత్రం మొదటి నుంచి ఎంపీ రేవంత్ రెడ్డి వర్గంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ లేఖ ఎంపీ రేవంత్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొనే రాశారనే టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదిలాఉంటే టీపీసీసీ అధ్యక్ష పదవిపై తనకు ఎలాంటి ఆసక్తి లేదని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి డి.శ్రీధర్ బాబు ప్రకటించారు. ఆ పదవి రేసులో తాను లేనని అన్నారు.