iDreamPost
android-app
ios-app

OTT విడుదలకు అగ్రనిర్మాత మద్దతు

  • Published Aug 27, 2020 | 9:00 AM Updated Updated Aug 27, 2020 | 9:00 AM
OTT విడుదలకు అగ్రనిర్మాత మద్దతు

ఇక్కడ నాని ‘వి’ డిజిటల్ రిలీజ్ మీద నిరసనేమీ వ్యక్తం కాలేదు కానీ పక్కరాష్ట్రంలో స్టార్ హీరో సూర్య తన ‘ఆకాశం నీ హద్దురా’కు ఇదే నిర్ణయం తీసుకుంటే మాత్రం విమర్శలు వ్యక్తమవుతున్నాయి . సింగం సిరీస్ తో కలిపి సూర్యతో మొత్తం ఐదు సినిమాలు రూపొందించిన దర్శకుడు హరి ఈ విషయంలో తన అసంతృప్తిని లేఖ రూపంలో బహిర్గతం చేయడం అక్కడ హాట్ టాపిక్ గా మారింది. థియేటర్ల వ్యవస్థను చంపొద్దని ఇంకొద్ది రోజులు వేచి చూడమని అందులో చాలా అంశాలే పొందుపరిచారు. ఈయనొక్కరే కాదు కొందరు డిస్ట్రిబ్యూటర్లు సైతం సూర్య పట్ల ఆగ్రహంతో ఉన్నారు.

ఈ నేపధ్యంలో అగ్ర నిర్మాత అశ్వినిదత్ తన మద్దతుని నాని,సూర్యలకు ప్రకటించారు. కరోనా మహమ్మారి ఇంతగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో జనాన్ని థియేటర్లకు రమ్మని చెప్పడం భావ్యం కాదని, అందులోనూ సూర్య లాంటి హీరో అయితే ఓపెనింగ్ రోజే విపరీతమైన రద్దీ ఏర్పడుతుందని ఇది ఒకరకంగా ప్రాణాలను రిస్క్ పెట్టడమే అవుతుందని స్పష్టం చేశారు. సినిమా థియేటర్లో విడుదల చేయాలన్న ఉద్దేశంతో పబ్లిక్ జీవితాలను పణంగా పెట్టే హక్కు లేదని తేల్చేశారు. జనవరి దాకా పరిస్థితి ఇలాగే ఉండొచ్చన్న హింట్ కూడా ఇచ్చేశారు. నాని, సూర్యలు తీసుకున్న నిర్ణయం పట్ల అశ్వినిదత్ ఇలా సపోర్ట్ చేయడం విశేషమే. ఇప్పటిదాకా ఈ పరిణామాల గురించి ఏ ప్రొడ్యూసర్ బయటికి మాట్లాడలేదు. ఈయన చెప్పినదాంట్లోనూ నిజాలు ఉన్నాయి. థియేటర్లు తెరిచినా చుట్టూ ఉన్న భయాల వల్ల ఆడియన్స్ హాలు దాకా రావడం అనుమానమే.

ఒకవేళ వచ్చినా అందులో ఒకరో ఇద్దరికో పాజిటివ్ ఉన్నా అందరూ రిస్క్ లో పడతారు. అందుకే ప్రభుత్వాలు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయి. దసరాకు తెరుచుకోవచ్చన్న ఆశాభావం ఉన్నప్పటికీ అది అంత సులభం కాదు. అందుకే అక్టోబర్ దాకా ఓటిటి రిలీజులకు షెడ్యూల్ జరిగిపోతోంది. ముఖ్యంగా తమిళ్ లో 10కి పైగా సినిమాలు క్యులో ఉన్నాయి. వాటికీ సంబంధించిన ప్రకటనను అతి త్వరలో రాబోతున్నాయి. తెలుగులోనూ ఈ పోకడ మెల్లగా వేగమందుకునేలా ఉంది. ఒకటి రెండు తప్ప దాదాపు ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉన్న సినిమాలన్నీ ఈ ఏడాది డిజిటల్ లోనే రావడం ఖాయమని విశ్లేషకుల అంచనా. అశ్వినిదత్ ప్రస్తుతం నాగ అశ్విన్ దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనికి తాలుకు స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి.