Idream media
Idream media
కొవిడ్ రాజకీయ వివాదాలకు కారణం అవుతోంది. కరోనా కట్టడిలో బీజేపీ విఫలం అయిందంటూ కాంగ్రెస్ విమర్శలు చేస్తూనే ఉంది. కాంగ్రెస్ విమర్శలకు కౌంటర్ గా బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర చేసిన ఓట్వీట్ ఇరు పార్టీల మధ్య తీవ్ర దుమారం రేపుతోంది. మోదీ ఇమేజ్‌కి భంగం కలిగించేలా విదేశీ మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తూ కాంగ్రెస్ కుట్ర పన్నుతోందంటూ కొన్ని డాక్యుమెంట్స్‌తో ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ టూల్‌కిట్ ఎక్స్‌పోస్డ్ అంటూ కామెంట్ చేశారు. బీజేపీ శ్రేణులు ఈ ట్వీట్‌ని విపరీతంగా వైరల్ చేశాయి. ఇక అక్కడి నుంచి ఈ కాంగ్రెస్ టూల్‌కిట్ వివాదంపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల మంటలు రేగుతున్నాయి.
సంబిత్ పాత్ర టూల్‌కిట్ పోస్ట్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండి పడింది. అంతటితో ఆగకుండా సంబిత్ పాత్రతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో పాటు మరికొందరు బీజేపీ నేతలను అరెస్ట్ చేయాలంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. ప్రస్తుతం ఈ కేసు విచారణ సాగుతోంది. సంబిత్ పాత్ర టూల్‌కిట్ పోస్ట్‌పై ట్విట్టర్‌కి కూడా ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్స్‌తో కాంగ్రెస్‌ని ఇబ్బంది పెట్టేందుకే సంబిత్ పాత్ర ఈ పోస్ట్ చేశారంటూ ట్విట్టర్‌కి వివరించింది. కాంగ్రెస్ ఫిర్యాదుపై ట్విట్టర్ స్పందించింది. సంబిత్ పాత్ర ట్వీట్‌కి మానిప్యులేటెడ్ మీడియా అంటూ లేబుల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ లేబుల్ పైనే కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
టూల్‌కిట్ వివాదం ట్విట్టర్, కేంద్ర ప్రభుత్వాల మధ్య కూడా అగ్గి రాజేసింది. ఒక అంశంపై విచారణ కొనసాగుతుండగా ట్విట్టర్ తీర్పులు చెప్పడం సరికాదంటూ కేంద్రం అభిప్రాయపడింది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర చేసిన ట్వీట్‌ని మానిప్యులేటెడ్ మీడియాగా ట్విట్టర్ లేబుల్ వేయడాన్ని తప్పుపట్టింది మోదీ సర్కార్. మానిప్యులేటెడ్ మీడియా లేబుల్ తొలగించాలని ట్విట్టర్‌ని కోరింది. అంతటితో ఈ గొడవ సమసిపోతుంది అనుకుంటున్న సమయంలో టూల్‌కిట్ వివాదాన్ని తిరగదోడారు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా. ఆయన భోపాల్‌లో మాట్లాడుతూ ‘‘ఇండియన్ వేరియంట్ అనే వైరస్ లేకున్నా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్… ఇండియన్ వేరియంట్, సింగపూర్ వేరియంట్ అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నేత కమల్ నాథ్ కూడా ఇలాగే చెప్పారు. టూల్‌కిట్‌తో కమల్‌నాథ్‌కి సంబంధం ఉందని చెప్పడానికి ఇంతకంటే వేరే ఆధారం లేదు’’ అంటూ విమర్శించారు.
నరోత్తం మిశ్రా ప్రకటనపై ఘాటుగా స్పందించారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కమల్ నాథ్. ఈ వైరస్‌ని మొదట చైనా వైరస్ అన్నారు. ఇప్పుడు ఇండియన్ వేరియంట్ వంతు వచ్చింది. మన శాస్త్రవేత్తలు, డాక్టర్లు కూడా న్యూ స్ట్రెయిన్‌ని ఇండియన్ వేరియంట్ అనే పిలుస్తున్నారు. కేవలం బీజేపీనే దీన్ని అంగీకరించడం లేదు. మన ప్రధానికయితే ఇండియన్ వేరియంట్ అంటేనే భయం పట్టుకుంది. అందుకే టూల్‌కిట్ అంటూ అర్థం లేని విమర్శలు చేస్తున్నారంటూ’’ బీజేపీకి కౌంటర్ ఇచ్చారు కమల్‌నాథ్. మొత్తానికి ఓ ట్వీట్ చినికి చినికి గాలివానలా మారి రాజకీయ యుద్ధానికి దారితీసింది.