iDreamPost
android-app
ios-app
Live Now

మార్పు దిశగా టాలీవుడ్ నిర్మాతల అడుగులు

  • Published Aug 24, 2022 | 11:09 AM Updated Updated Aug 24, 2022 | 11:09 AM
మార్పు దిశగా టాలీవుడ్ నిర్మాతల అడుగులు

ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి షూటింగులు ఆపేసి మరీ నిరవధికంగా చర్చలు జరుపుతున్న టాలీవుడ్ నిర్మాతలు ఎట్టకేలకు వాటినో కొలిక్కి తెచ్చారు. సెప్టెంబర్ 1 నుంచి చిత్రీకరణలు మొదలుపెట్టుకోవచ్చని ప్రకటించారు. ఒకవేళ అంతకన్నా అత్యవసరం ఉంటే ఫిలిం ఛాంబర్ ని 25న సంప్రదించి అనుమతులు తీసుకోవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలను ఈ నెల 30న మీడియాకు వెల్లడించబోతున్నారు. దిల్ రాజు అధ్యక్షతన జరిగిన ప్రెస్ మీట్ లో ఇకపై తనతో పాటు అల్లు అరవింద్, యువి, ఎన్వి ప్రసాద్ ఆధ్వర్యంలో నడిచే థియేటర్లలో విపిఎఫ్ (వర్చువల్ ప్రింట్ ఫీజు) వసూలు చేయబోవడం లేదని చెప్పారు. ఇది ఎగ్జిబిటర్లకు గొప్ప మేలు చేసే పరిణామం.

మల్టీ ప్లెక్సుల్లో తినుబండారాల ధరలను తగ్గించే దిశగా ఆయా యాజమాన్యాలతో చర్చించడం జరిగిందని వాటి పట్ల కూడా సానుకూల ఫలితాలు ఉంటాయని చెప్పారు. కార్మికుల వేతన సవరణ మీద ఏకాభిప్రాయం వచ్చినట్టు కనిపిస్తోంది. ఓటిటికి ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలని ఆల్రెడీ డిసైడ్ అయ్యారు కానీ అది అన్ని సినిమాలకు వర్తిస్తుందా లేక చిన్న చిత్రాలకు ఏమైనా మినహాయింపు ఇస్తారా అనేది వేచి చూడాలి. స్టార్ల రెమ్యునరేషన్ల గురించి ఇందులో ప్రస్తావించలేదు. ఆర్టిస్టుల ఖర్చులకు సంబంధించి మేనేజర్లు ఈ డిస్కషన్లో భాగమయ్యారని ఇకపై ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించే విషయంలో వాళ్ళ నుంచి కూడా మద్దతు లభించినట్టుగా ఇన్ సైడ్ టాక్.

మొత్తానికి ఇవన్నీ మంచి పరిణామాలే. ఏదో రెండు మూడు నెలలకు కాకుండా సుదీర్ఘ కాలం కట్టుబడితే మంచి ఫలితాలను అందుకోవచ్చు. ముఖ్యంగా జనం సినిమా హాళ్లకు వస్తున్న తరుణంలో వీటితో పాటు క్వాలిటీ కంటెంట్ మీద దృష్టి పెట్టడం చాలా కీలకం. బింబిసార, సీతారామం, కార్తికేయ 2 మూడూ బ్లాక్ బస్టర్ కావడం శుభ సంకేతం. దీన్ని నిలబెట్టుకునే దిశగా లైగర్ అడ్వాన్స్ బుకింగ్స్ మంచి స్పీడ్ మీద ఉన్నాయి. వచ్చే వారం విక్రమ్ కోబ్రా, ఆపై వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగా లాంటి మూవీస్ క్యూ కడుతున్న తరుణంలో పైన చెప్పినవి పక్కాగా అమలు చేస్తే బాలీవుడ్ కుళ్ళుకునేలా టాలీవుడ్ లో మరిన్ని మంచి రోజులు చూడొచ్చు

No liveblog updates yet.

LIVE NEWS & UPDATES