iDreamPost
iDreamPost
నిన్న 2022 కొత్త సంవత్సరంలో మొదటి శుక్రవారం పూర్తయ్యింది. అన్నీ బాగుంటే ఆర్ఆర్ఆర్ విడుదలై రికార్డుల మోతతో థియేటర్ల దగ్గర అభిమానుల సందడితో సోషల్ మీడియా మొత్తం ఉర్రూతలూగిపోయేది. కానీ జరిగింది వేరు. సరే అది తప్పుకుంది కదాని బరిలో దిగిన చిన్న సినిమాలు ప్రేక్షకులతో ఓ రేంజ్ లో ఫుట్ బాల్ ఆడేసుకున్నాయి. నిన్న వచ్చిన వాటిలో ఏదీ కనీస స్థాయిలో మెప్పించలేకపోవడం డిస్ట్రిబ్యూషన్ వర్గాలను నిరాశపరిచింది. రానా ఎప్పుడో నాకు సంబంధం లేదని తప్పుకున్న ‘1945’ ఉడికీ ఉడకని రుచితో కనీసం అభిమానులను కూడా సంతృప్తి పరచలేక తోక ముడిచింది. చాలా చోట్ల డబుల్ డిజిట్ ఆక్యుపెన్సీ కూడా రాలేదు.
ఇక ఆది సాయికుమార్ ‘అతిథిదేవోభవ’ ట్రైలర్, పాటలు చూసి అంతో ఇంతో నమ్మకం పెట్టుకున్న కాసిన్ని ఆడియన్స్ ని కూడా ఈ సినిమా కనీస స్థాయిలో మెప్పించలేదు. యునానిమస్ గా డిజాస్టర్ టాక్ వచ్చేసింది. శివరాజా తనయుడు విజయ్ రాజాను హీరోగా పరిచయం చేస్తూ తీసిన ‘వేయి శుభములు కలుగు నీకు’ ఎప్పుడో అరిగిపోయిన పాత హారర్ ఫార్ములాను తీసుకుని శాయశక్తులా విసిగించేసింది. థియేటర్ కు వచ్చిన నలుగురైదుగురిని పారిపోయేలా చేసింది. ఇక ఎప్పుడో రావాల్సిన ‘హాఫ్ స్టోరీస్’ కూడా నిన్నే అదృష్టాన్ని పరీక్షించుకుంది. దీని గురించి కనీసం మాట్లాడుకునే నాథుడు లేడు. ఏదో మొక్కుబడి రిలీజ్ వ్యవహారంలా జరిగింది.
ఇలా మొదటివారం బోణీ చేసిన నాలుగు సినిమాలు తీవ్రంగా నిరాశపరచడంతో ఎగ్జిబిషన్ వర్గాల్లో కనీస ఉత్సాహం లేదు. ఇప్పుడు అందరి కన్ను సంక్రాంతి మీద ఉంది. అసలే కరోనా థర్డ్ వేవ్ ఆందోళన మెల్లగా పెరుగుతోంది.ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రాకపోతే పండగ వసూళ్ల మీద పెద్ద దెబ్బ పడుతుంది. అసలే ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్, భీమ్లా నాయక్, వలిమైలు తప్పుకుని కళ తగ్గిపోయింది. బంగార్రాజు ఒక్కడే ఆశలు రేకెత్తిస్తున్నాడు. రౌడీ బాయ్స్, హీరో, డీజే టిల్లు, సూపర్ మచ్చి ఇవన్నీ టాక్ మీద ఆధారపడాల్సిందే. 14 దాకా అంటే ఇంకో ఆరు రోజుల పాటు థియేటర్లకు మళ్ళీ అఖండ, పుష్ప, శ్యామ్ సింగ రాయ్ లే రక్షకులుగా నిలబడాలి మరి.
Also Read : Omicron : అందరినీ టెన్షన్ పెడుతున్న మహమ్మారి