iDreamPost
iDreamPost
మన దగ్గర కథలు లేక వెనకబడుతున్నామా లేక నిజంగా పక్క రాష్ట్రాల వారు అద్భుతంగా తీస్తున్నారా ఖచ్చితంగా చెప్పలేం కానీ ఎప్పుడూ లేనంత రీతిలో టాలీవుడ్ లో మలయాళ రీమేకుల ప్రహసనం కొనసాగుతోంది. తాజాగా ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చి సోషల్ మీడియా ప్రశంసల్లో మునిగి తేలిన ‘కప్పేలా’ హక్కులను సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ కొనుగోలు చేసిందన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇది అధికారికంగా ఎవరూ చెప్పకపోయినా ప్రచారం మాత్రం మీడియాలో ఊపందుకుంది. హీరో హీరోయిన్ల మధ్య ఓ సున్నితమైన ప్రేమకథను డిఫరెంట్ యాంగిల్ లో ప్రెజెంట్ చేసిన తీరు భాషతో సంబంధం లేకుండా మెప్పించింది. ముస్తఫా దర్శకత్వం మీద కాంప్లిమెంట్స్ వెల్లువలా వచ్చి పడ్డాయి.
అందుకే ఎక్కువ ఆలస్యం చేయకుండా నాగ వంశీ వెంటనే కప్పేలా రైట్స్ సొంతం చేసుకున్నట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే సితార చేతిలో ‘అయ్యప్పనుమ్ కొశీయుమ్’ రీమేక్ సెట్ పైకి వెళ్లేందుకు రెడి అవుతోంది. దర్శకుడు సాగర్ చంద్ర స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. వీటి సంగతలా ఉంచితే పెద్దా చిన్నా భేదం లేకుండా అందరూ కేరళ సినిమాల వైపు మొగ్గు చూపుతుండటం గమనార్హం. చిరంజీవి అంతటి వారే ఆల్రెడీ తెలుగులో డబ్బింగ్ అయిన ‘లూసిఫర్’ని సుజిత్ డైరెక్షన్ లో చేసేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సత్య దేవ్ నటించిన ఉమామహేష్వర ఉగ్రరూపస్య కూడా అక్కడి సరుకే. నెట్ ఫ్లిక్స్ లో ఈ 15న నేరుగా రాబోతోంది. ‘మహేషింటే ప్రతీకారం’కి ఆఫీషియల్ రీమేక్.
ఇవి కాకుండా మరో బ్లాక్ బస్టర్ ‘డ్రైవింగ్ లైసెన్స్’ హక్కుల కోసం కూడా పోటీ నెలకొందట. రాజశేఖర్ సైతం ‘జోసెఫ్’ అనే మరో మలయాళం మూవీ మీద మనసు పారేసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్ ఉంది. ఈ ట్రెండ్ ఇప్పటిది కాదు. ప్రేమమ్ నుంచి కొనసాగుతోంది. అయితే ఒరిజినల్ వెర్షన్స్ స్థాయిలో ఇవన్నీ ఘన విజయం సాధిస్తాయనే గ్యారెంటీ లేకపోయినా కొత్త కథల మీద రిస్క్ చేయలేక మనవాళ్లు సేఫ్ గేమ్ కోసం రీమేకుల మీద ఆధారపడుతున్నారు. అందుకే మహా అయితే 25 లక్షలు కూడా దాటని మలయాళం రీమేక్ హక్కుల ధరలు ఇప్పుడు కోటిన్నర దాకా పలుకుతున్నాయట. అవును మరి దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి కదా. అందుకే మన అవసరానికి తగ్గట్టు అక్కడి ప్రొడ్యూసర్లు రేట్లని ఫిక్స్ చేస్తున్నారట.