Idream media
Idream media
టోనీ.. అంతర్జాతీయ డ్రగ్ మాఫియా డాన్. తెలంగాణలో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు. సుదీర్ఘకాలంగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరిగాడు. కానీ అతన్ని చివరకు ముంబైలో పట్టుకున్నారు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు. న్యాయస్థానం అనుమతితో అతడిని కస్టడీకి తీసుకున్నారు. శనివారం నుంచి అతడిని విచారిస్తున్నారు. బడా బడా వ్యాపారులకు, రాజకీయ నాయకులకు ఈ కేసుతో సంబంధం ఉందన్న వార్తల నేపథ్యంలో ఈ విచారణ ఆసక్తిగా మారింది. టోనీ నోట ఎవరి పేర్లు వినిపిస్తాయోనన్నది ఉత్కంఠగా మారింది. దీని వెనుక పెద్దల హస్తం ఉందన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రంగంలోకి దిగారు. టోనీ వెనుక ఎవరున్నా వదిలిపెట్టొద్దని ఆదేశాలు ఇవ్వడంతో అధికారులకు బలం పెరిగింది.
విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. టోనీ పూర్తి పేరు చుకువు డేవిడ్ అలియాస్ మార్ష్ టోనీ. తండ్రి పేరు అభియా మార్ష టోనీ..తల్లి పేరు రోజ్ మేరీ చుకువు. బర్త్ ప్లేస్ షాగాము విలేజ్, నైజీరియా. అనంతరం నైజీరియాలోని ఒక్ పంక్ విలేజ్‌కి మకాం మార్చాడు. 2013 నుంచి దుస్తుల వ్యాపారం ముసుగులో ముంబైలో డ్రగ్స్ దందాకు తెర లేపిన టోనీ. ముంబైలోని అంధేరీ ఈస్ట్, చాందీవాలీలలో మిలాన్ కాంప్లెక్స్ లో టోనీ నివసిస్తూ.. ముంబై నుండి షిప్స్ ద్వారా డ్రగ్స్‌ను భారత్‌కు దిగుమతి చేసేవాడు.. అలా డ్రగ్స్ పెడ్లర్‌గా, డ్రగ్స్ డాన్‌గా ఎదిగాడు. వీసా గడువు ముగిసినా కూడా అక్రమంగా ఇండియాలోనే ఉంటూ డ్రగ్స్ బిజినెస్ కొనసాగిస్తున్న టోనీ.. గత 9 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. ముంబై లో టోని కోసం భారీగా ఇన్ఫార్మర్లను పోలీసులు ఏర్పాటు చేయగా, చివరకు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతన్ని ముంబైలో అరెస్ట్ చేశారు.
తెలంగాణలో డ్రగ్స్ కలకలం నేపథ్యంలో నియంత్రణకు సర్కారు తీవ్ర నిర్ణయాలను తీసుకుంటోంది. పంజాబ్, హర్యానా తరహాలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు డ్రగ్స్ కట్టడికి స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పేరుతో ప్రత్యేక విభాగాలను 2017లో ఏర్పాటు చేశాయి. అవి మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటి పనితీరును తెలుసుకునేందుకు తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులు అక్కడి పోలీసు శాఖలను సంప్రదించారు. అక్కడి స్పెషల్ టాస్క్‌ఫోర్స్ డీజీపీ పరిధిలో పనిచేస్తుంది. దానికి అదనపు డీజీపీ ర్యాంకు అధికారి నేతృత్వం వహిస్తున్నారు. స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌లో ఇద్దరు ఎస్పీ ర్యాంకు అధికారులు, ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు, ఇతర సిబ్బంది ఉన్నారు. తెలంగాణలో అదే మాదిరిగా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేేసందుకు ఉన్నతాధికారులు ప్రతిపాదనలను సిద్థం చేస్తున్నారు.
డ్రగ్స్ నియంత్రణలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలో ఎంపీ స్థాయి నుంచి గ్రామస్థాయిలో సర్పంచ్ వరకు డ్రగ్స్ నియంత్రణ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోనున్నారు. ఇటీవల జరిగిన సమీక్ష లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో ఆ మేరకు ప్రతిపాదనలను ఉన్నతాధికారులు రూపొందిస్తున్నారు. డ్రగ్స్ నియంత్రణకు సంబంధించిన ప్రత్యేక విభాగ ఏర్పాటు విధివిధానాలతో కూడిన నివేదికను వారంలోగా సీఎం కేసీఆర్‌కు అందజేయనున్నారు. ప్రస్తుతం విధివిధానాల ప్రతిపాదనలను ఉన్నతాధికారులు రూపొందిస్తున్నారు. పంజాబ్, హర్యానా తో పాటు ఇతర రాష్ట్రాల్లో డ్రగ్స్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, ప్రత్యేక విభాగ పనితీరు తదితర వివరాలను అందులో పొందుపరుస్తున్నారు.
Also Read : మద్యం కావాలా?కిరాణా షాపులో దొరుకుతుంది చూడండి