iDreamPost
android-app
ios-app

వీడియో: పట్టపగలే ఏటీఎం గార్డును చంపి.. రూ.39 లక్షలతో పరార్..

వీడియో: పట్టపగలే  ఏటీఎం గార్డును చంపి.. రూ.39 లక్షలతో పరార్..

నేటికాలంలో అక్రమంగా డబ్బులు సంపాదించాలని అనుకునే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. అందుకే కష్టపడి సంపాదించి.. ధనం కూడ పెట్టుకున్న వారి ఇళ్లలో చోరీలు చేసి.. అందినకాడికి దోచుకెళ్తున్నారు. ఇంకా కొందరు దుండగలు బరి తెగించి ప్రవర్తిస్తున్నారు. ధనం కోసం మనిషి ప్రాణం తీసేందుకు కూడా వెనుకాడటం లేదు.  తాజాగా ఓ  ప్రాంతంలో దోపిడీ దొంగలు పట్టపగలే బీభత్సం సృష్టించారు. ఏటీఎంలో డబ్బులు నింపడానికి వచ్చిన వ్యాన్ గార్డును కాల్చి చంపారు. అనంతరం రూ.39 లక్షలు తీసుకుని పరారయ్యారు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మీర్జాపుర్‌ పట్టణంలోని కత్రా కొత్వాలి ప్రాంతంలోని బెల్టార్‌లో యాక్సిస్‌ బ్యాంకు పక్కనే ఏటీఎం ఉంది. మంగళవారం ఆ ఏటీఎంలో డబ్బులు నింపేందుకు ఇద్దరు క్యాషియర్లు, ఓ గార్డు వ్యాన్‌లో వచ్చారు. వారు దిగి.. ఏటీఎంలో డబ్బులు నింపే పనిలో నిమగ్నమయ్యారు. ఇదే సమయంలో అక్కడ.. తొలుత హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి  అనుమానస్పదంగా తిరుగుతూ కనిపించాడు. ఇక ఏటీఎం సిబ్బంది వ్యాన్ తలుపు తెరవగానే హెల్మెట్ ధరించిన మరో వ్యక్తి అక్కడి వచ్చాడు. తన చేతిలో ఉన్న తుపాకీతో గార్డును కాల్చాడు. దీంతో తీవ్రంగా గాయపడిన గార్డు.. అక్కడే కుప్పకూలిపోయాడు. ఇంతలో తెల్ల చొక్కా ధరించి వచ్చిన మరో దుండగుడు వ్యాన్‌ వద్దకు వెళ్లి.. అందులోని రూ.39 లక్షలతో పరాయ్యాడు.

ఇదే సమయంలో ఓ  బ్యాంకు ఉద్యోగి అక్కడి నుంచి పారిపోగా.. మరో ఉద్యోగి..తన బ్యాగు తీసుకుని వ్యాన్ లో లాక్ చేసుకుని కూర్చున్నాడు. మొత్తం నలుగురు వ్యక్తులు ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ముఖాలు కన్పించకుండా జాగ్రత్త పడిన ఆ ముఠా.. బైక్‌లపై పరారైనట్లు సమాచారం. దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన గార్డును ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ సమాచారం తెలిసి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఈ ఘటనలో రూ.39 లక్షలో పోయినట్లు టాక్ వినిపిస్తున్నా.. ఎంత నగదు పోయిందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని ఎస్పీ తెలిపారు.  మరి.. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.