హైదరాబాద్ మహానగరంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో నేరాలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా మిస్సింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. నగరంలోని ఏదో ఒక ప్రాంతంలో ఆడపిల్లలు, మహిళలు, బాలురు ,చిన్న పిల్లలు మిస్సింగ్ అయ్యారని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి. ఇలా అదృశ్యమైన వారు ఏమయ్యారో అని.. వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నగరంలో ఇద్దరు యువతులు అదృశ్యమయ్యారు. వారి ఫోన్లకు డయల్ చేయగా స్వీచ్చాఫ్ అని వస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామానికి చెందిన తుమ్మ యాదగిరి ఆర్టీసీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఆయనకు శ్రావ్య(21)అనే కుమార్తె ఉంది. ఆమెకు ఇటీవలే వివాహం జరిపించారు. ఆ నవ దంపతులు హైదరాబాద్ లోని నల్లకుంట ప్రాంతంలో కాపురం పెట్టారు. హైదరాబాద్‌కు వచ్చిన ఆమె ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చుదువుతూ నల్లకుంట శంకర మఠం సమీపంలోని వసతి గృహంలో ఉంటుంది. ఇటీవలే ఇంటికి వెళ్లిన ఆ యువతి ..తిరిగి జూన్ 15న హాస్టల్ కు వచ్చింది. ఈ క్రమంలో జూన్17న సాయంత్రం శ్రావ్య తండ్రి యాదగిరి.. ఆమెను చూసేందుకు హైదరాబాద్‌కు వచ్చాడు. శ్రావ్య ఉండే హాస్టల్ నిర్వాహకులను విచారించగా ఆమె ఈ నెల 16న సాయంత్రం 8 గంటలకు వెళ్లిపోయిందని తెలిపారు. కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన వారిని విచారించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. యాదగిరి నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అలానే నగరంలోని మరో ప్రాంతమైన ఫిల్మ్ నగర్ లో కూడా ఓ యువతి అదృశ్యమైంది. ఫిల్మ్ నగర్ పరిధిలోని మహాత్మాగాంధీ నగర్ బస్తీకి చెందిన అంకిత(19) డెంటల్ ఆస్పత్రిలో పని చేస్తున్నది. రోజూ ఇంటి నుంచే ఆస్పత్రికి వెళ్లి వస్తుండేది. ఎప్పటిలాగే ఆదివారం కూడా విధులకు వెళ్లి సాయంత్రం ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని వచ్చింది. దీంతో ఆమె తండ్రి ఊషన్న.. తమ బంధువులను, తెలిసిన వారిని సంప్రదించాడు. అంతేకాక వారి పరిసర ప్రాంతాల్లో గాలించిన ఫలితం లేకుండా పోయింది. చివరకు తన కూతురు కనిపించడంలేదు అని ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టారు. మరి.. ఇలా నగరంలో అదృశ్య కేసులు పెరుగుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.