Idream media
Idream media
TNRతో నాకు పరిచయం లేదు. అయినా నాకు చాలా ఆప్తుడు. ఇద్దరం IDreamsలో చేసినా ఎదురు పడలేదు. అదే దురదృష్టం. ఆయన ఇంటర్వ్యూలు ఎన్నో చూశాను. సరదాగా , జోక్‌లు వేస్తూ హాయిగా మాట్లాడేవాడు. ఈ మధ్య Act చేసిన అన్ని సినిమాలు చూశాను. ఒక యాంకర్‌గానే కాదు, పల్లెటూరి అమాయకుడిగా కూడా భలే కుదురుతాడు. ఇంకా చాలా సినిమాల్లో చేస్తాడనుకున్నా. ఇంతలోనే Cut చెబుతాడని ఊహించలేదు.
Face Bookలో అప్పుడప్పుడు కూతురి ముచ్చట్లు చెప్పేవాడు. నాకు ఆడపిల్లలు లేరు. కూతుళ్ల గురించి వినాలంటే ఇష్టం. తండ్రులపైన కొంచెం అసూయ కూడా. రాగద్వేషాలకు అతీతంగా వెళ్లిపోయాడు TNR.
అందరికీ అన్ని జాగ్రత్తలు చెప్పేవాడివట! కొంచెం జాగ్రత్తగా ఉండకపోతివి కదా! ఇంటర్వ్యూలు , నవ్వులు, చమత్కారాలు అన్నీ మిగిలిపోయాయి. ఎవరు పూడుస్తారు లోటుని.
దేవుడు భలే దుర్మార్గుడు. ఆయన్ని ప్రచారం చేసే భక్తులు చాలా మంది ఉన్నారు కదా, ఇంటర్వ్యూ ఇవ్వడానికి నువ్వు కావలసి వచ్చావా? బిడ్డలకి నాన్నని లేకుండా చేశాడు కదా! ఎప్పుడైనా కనిపిస్తే అడగాలి ప్రపంచానికి పనికొచ్చే వాళ్లంటే నీకెందుకెంత పగ, తొందరగా తీసుకెళ్లి పోతావని.
Also Read:TNR – మీరు ఎప్పటికీ గుర్తుంటారు..
దుక్కం వస్తే కన్నీళ్లు రావడం లేదు. అనస్తీషియా అవసరం లేనంత మొద్దుబారిపోతున్నాం. వెలుతురిని ప్రేమించే వాళ్లం. చితి మంటల వెలుతురు చూసి భయపడుతున్నాం.
అయినా నువ్వెక్కడికి పోతావు. యూట్యూబ్ నొక్కితే నవ్వుతూ కనిపిస్తావు కదా. సెలవు మిత్రమా!
బకాసురుడు ఎవరింటికి వంతు చెబుతాడో తెలియదు. భీమసేనుడు ఇంకా పుట్టలేదు. ఆశయాలు, కోరికలు, ఆకాంక్షలు ఏమీ లేవు. బతికి ఉండడమే ఇపుడొక అద్భుతం!