Idream media
Idream media
పశ్చిమ బెంగాల్ లో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య పొలిటికల్ దంగల్ కొనసాగుతూనే ఉంది. ఏదో ఒక అంశం చుట్టూ ఇరు పార్టీల నేతలు వాదోపవాదాలు చేసుకుంటూనే ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఎంసీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పై చేయి సాధించేందుకు పోటీపడుతున్నాయి. ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీల మధ్య వివాదం ఎప్పుడూ ముఖ్యాంశాల్లో కనిపిస్తూ ఉంటుంది. సీఎస్ వివాదం సద్దుమణగక ముందే తాజాగా మరో వివాదం బెంగాల్ లో రాజకీయ అగ్గి రాజేస్తోంది. టీకా సర్టిఫికెట్‌కు సంబంధించిన ఉదంతంలో దీదీ, మోదీ తలపడుతున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. టీకా వేసుకున్న ప్రతి ఒక్కరికీ టీకా సర్టిఫికేట్ అందజేస్తున్నారు. దానిపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో ఉంటోంది. అయితే ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో టీకా సర్టిఫికేట్‌పై పీఎం మోదీ ఫొటోను తొలగించి, ఆ స్థానంలో సీఎం మమతా బెనర్జీ ఫోటోను ప్రచురించడంపై వివాదం కొనసాగుతోంది. అయితే దీనిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీ నేతలు టీఎంసీ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోల్‌కతాలో టీకా ఆన్ వీల్స్ కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఒక బస్సును మొబైల్ కరోనా టీకా కేంద్రంగా మార్చారు. ఈ బస్సు ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు టీకాలు వేయనున్నారు.
ఈ సందర్భంగా బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీమ్ మాట్లాడుతూ టీకా సర్టిఫికేట్‌పై సీఎం సీఎం మమత ఫొటో ప్రచురించడంలో తప్పు లేదని అన్నారు. కాగా గతంలో తృణమూల్ కాంగ్రెస్… టీకా సర్టిఫికేట్‌లో ప్రధాని మోదీ ఫొటో ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఆ పార్టీ ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని బీజేపీ ఉల్లంఘించిందని ఆరోపించింది. కాగా ఈ ఉదంతంపై బీజేపీ రాష్ట్ర ప్రతినిధి సామిక్ భట్టాచార్య మాట్లాడుతూ మన పార్లమెంటరీ వ్యవస్థలో ప్రధానమంత్రికి ప్రత్యేక స్థానం ఉందని, దానిని ముఖ్యమంత్రి పరం చేయాలని టీఎంసీ భావిస్తున్నదని ఆరోపించారు. కాగా టీకా సర్టిఫికెట్‌పై బెంగాల్ మాత్రమే కాకుండా కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ప్రధాని మోదీ ఫొటోను తొలగించాయి.
ఇలా.. నిత్యం ఏదో ఒక్క ఇష్యూపై పశ్చిమ బెంగాల్ లో రాజకీయ వైర్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. అవి పాలనకు సంబంధించిన, ప్రజా కార్యక్రమాలకు చెందిన అంశాల్లో వాదోపవాదాలు, చర్చలు జరిగితే మంచిదే. కానీ, ఆ రెండు పార్టీలూ మేం చేసేది గొప్ప అంటే.. మేం చేసేది గొప్ప అనిపించుకునేందుకు పోటీ పడుతున్నాయి. పాలనపై దృష్టి పెట్టకుండా ఇలా ఇంకెన్నాళ్లు రాజకీయ తగాదాలకు దిగుతారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
Also Read : బెంగాల్ లో బీజేపీపై మమత పగ తీర్చుకోనున్నారా?