iDreamPost
android-app
ios-app

అదిరె అదిరె.. ప్రత్యర్థుల గుండెలు అదిరె!!

అదిరె అదిరె.. ప్రత్యర్థుల గుండెలు అదిరె!!

ఇప్పటి వరకూ ఏ సీఎంకైనా ఇంతలా జనం కదిలివచ్చారా..? అని నివ్వెరపోయేలా జన కడలి. నిజంగా జన నేతే. అందుకే ఇంతలా ప్రేమాభిమానాలు కురిపించారంటూ చర్చలు. ఆ పార్టీకి, ఆ నేతకు ఈ స్థాయిలో మద్దతు ఉన్నప్పుడు ఉప ఎన్నికలో మన స్థానం ఏంటి..? పోటీలో ఉండాలా..? వద్దా..? అని ప్రతిపక్షాల్లో కలవరం.. తిరుపతిలో సోమవారం జరిగిన సీఎం జగన్‌ జన్మదిన వేడుక కోలాహలంతో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. వైసీపీ ర్యాలీ చిత్రాలు, జగన్‌ జన్మదిన నినాదాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల నేపథ్యంలో భారీగా జన సమీకరణ చేశారా..? పుట్టినరోజు వేడుకలకు ఇలా తరలివచ్చారా..? అని ప్రతిపక్షాల్లో ఆందోళన మొదలైంది. ఏదేమైనా ఓ నేత పుట్టినరోజు వేడుకకు ఇంతలా జనం రావడం అంటే గ్రేటే అని ప్రతిపక్షనేతలు సైతం అంటున్నారు.

హద్దుల్లేని ఆనందం..

ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి పుట్టినరోజు వేడుకల సంబరాలు సరిహద్దులు దాటిన విషయం తెలిసిందే. సోమవారం ఏపీలోనే కాకుండా పక్క రాష్ట్రాలు, విదేశాలలోనూ జగన్‌ జన్మదిన వేడుకలు జరిగాయి. ఇదంతా ఒక ఎత్తయితే తిరుపతిలో జన్మదినం జాతరను తలపించింది. వేలాది మంది జగన్‌కు శుభాకాంక్షలు చెబుతూ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి నగరంలోని 50 డివిజన్ల నుంచీ జనం తరలివచ్చారు. ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో కృష్ణాపురం ఠాణా నుంచి తుడా సర్కిల్‌ దాకా వేలాది మందితో ర్యాలీ నిర్వహించారు. దీంతో నగర ప్రధాన వీధుల్లో కోలామలం కనిపించింది. జగన్‌ అందిస్తున్న సంక్షేమ పథకాలకు కృతజ్ఞతగా చంటిబిడ్డలను చంకనెత్తుకొని తల్లులు సైతం ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కురబలకోట, చిత్తూరు, మదనపల్లె, పుంగనూరు, చంద్రగిరి, సత్యవేడు, పలమనేరు, సదుం, చౌడేపల్లె, నిమ్మనపల్లె, పాలసముద్రం, నాగలాపురం, పెనుమూరు, రామసముద్రం, నిమ్మనపల్లె, గుర్రంకొండ తదితర ప్రాంతాల్లో వేడుకలు జరిగాయి. ఈ ర్యాలీ దృశ్యాలు, ఆ జన సందోహాంకు ప్రతిపక్షాల గుండెలదిరాయి. త్వరలో తిరుపతి పార్లమెంట్‌ లోక్‌సభ ఉప ఎన్నిక జరగనున్న తరుణంలో జగన్‌ బర్త్‌ డే వేడుకలు భారీ స్థాయిలో జరగడం చర్చనీయాంశంగా మారింది.