Idream media
Idream media
హామీ ఏదైనా హామీనే. పెద్దదా..? చిన్నదా..? ఎన్నికల్లో ఇచ్చామా..? మరో సమయంలో ఇచ్చామా..? అన్నది ముఖ్యం కాదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఈ తరహా వ్యవహారశైలితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. ప్రజల మనసులను గెలుచుకుంటున్నారు. విశ్వసనీయతకు పర్యాయపదంగా నిలుస్తున్నారు. తాజాగా జరిగిన ఓ ఘటన.. సీఎం వైఎస్ జగన్.. తాను ఇచ్చిన మాటకు ఎంతటి విలువ ఇస్తారో తెలియజేస్తోంది.
ఈ నెల 3వ తేదీన వరద బాధితులను పరామర్శించేందుకు సీఎం వైఎస్ జగన్ తిరుపతిలో పర్యటించారు. నగరంలోని సరస్వతి నగర్‌లో బాధితుల కష్ట,నష్టాలను తెలుసుకున్నారు. ఈ సమయంలో పిల్లలు, పెద్దలు సీఎం జగన్‌పై సెల్ఫీ దిగేందుకు ఆసక్తి చూపారు. సీఎం జగన్ కూడా అడిగిన వారందరితో సెల్ఫీలు దిగారు. స్థానికంగా ఉండే మహిళ తూకివాకం విజయ సెల్ఫీ కోసం ముందుకు దూసుకువచ్చారు. ఆ క్రమంలో ఆమె సెల్ ఫోన్ చేతిలో నుంచి జారి కాలువలో పడిపోయింది. అది గమనించిన సీఎం వైఎస్ జగన్.. ‘‘ పెద్దమ్మా.. మీకు కొత్త ఫోన్ పంపించే బాధత్య నాది.. బాధపడవద్దు’’ అని ఆమెకు హామీ ఇచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారం.. సీఎం వైఎస్ జగన్ ఈ రోజు విజయకు కొత్త ఫోన్ పంపారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో తిరుపతి కమిషనర్ పీఎస్ గిరీష.. కొత్త ఫోన్‌ను సిబ్బంది ద్వారా విజయకు పంపారు. నగరపాలక సంస్థ ప్రజా వైద్య విభాగం డాక్టర్ రవికాంత్ సదరు మహిళకు కొత్త ఫోన్ అందించారు. సీఎం జగన్ పర్యటన జరిగి వారం రోజులు అవుతోంది. ఆ రోజు సెల్ ఫోన్ పంపిస్తానని సీఎం చెప్పిన మాటలను విజయ పెద్దగా పట్టించుకోలేదు. తనను ఓదార్చేందుకు ఈ మాట చెప్పి ఉంటారేమోనని అనుకుంది. అయితే ఈ రోజు అధికారులు ఫోన్ తీసుకువచ్చి ఇవ్వగా.. ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ‘‘ నన్ను ఓదార్చడానికి జగన్‌బాబు అలా చెప్పారనుకున్నా.. నిజంగా సెల్ ఫోన్ పంపిస్తారని అనుకోలేదు’ అంటూ విజయ సంతోషంతో ఉబ్బితబ్బిబైంది.
Also Read : కుప్పం సైకిల్ కి రిపేర్లు.. చంద్రబాబు కీలక నిర్ణయం..