iDreamPost
android-app
ios-app

విప‌క్షాల‌కు తిరుప‌తి టెన్ష‌న్‌..!

విప‌క్షాల‌కు తిరుప‌తి టెన్ష‌న్‌..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప‌ల్లెల‌న్నీ వైసీపీవైపే. ప‌ట్ట‌ణాలు కూడా వైసీపీవైపే. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాలు ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి. విప‌క్ష పార్టీలు ఎక్క‌డ కూడా ప్ర‌భావం చూప‌లేక‌పోయాయి. ఇప్పుడు ఆయా పార్టీల‌కు మ‌రో టెన్ష‌న్ ప‌ట్టుకుంది.

త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక‌లో ఎలా గ‌ట్టెక్కాలో తెలియ‌క స‌త‌మ‌తం అవుతున్నాయి. అస‌లు పోటీలో నిల‌బ‌డాలా లేక సెంటిమెంట్ ను అవ‌కాశంగా చేసుకుని పోటీ నుంచి త‌ప్పుకుంటే బెట‌రేమో ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఎన్నిక‌లు జ‌ర‌గ‌క ముందు ఆ స్థానంలో మాదేన‌ని కొంద‌రు, గ‌ట్టి పోటీ ఇస్తామ‌ని మ‌రి కొంద‌రు ప్ర‌క‌టించారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో వారి మైండ్ బ్లాక్ అయింది. ఈ ప‌రిస్థితుల్లో పోటీలో లేక‌పోవ‌డ‌మే మంచిద‌నే చ‌ర్చ‌ ప్ర‌ధానంగా తెలుగుదేశంలో మొద‌లైంది. మ‌రోవైపు బీజేపీ కూడా ఈ స్థానంపై ఎప్ప‌టి నుంచో ఫోక‌స్ పెట్టింది. గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తే గెలుపు అవ‌కాశాలు ఉన్నాయ‌ని భావించింది. సీన్ క‌ట్ చేస్తే.. ఇప్పుడు పున‌రాలోచ‌న‌లో ప‌డిన‌ట్లు క‌నిపిస్తోంది. మ‌రోవైపు జ‌న‌సేన క‌లిసి వ‌స్తుందో, పోటీ ఇస్తుందో తెలియ‌ని ప‌రిస్థితి.

త్వ‌ర‌లోనే తిరుప‌తి లోక్ స‌భ సీటు ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తిరుప‌తి కార్పొరేష‌న్, తిరుప‌తి లోక్ స‌భ ప‌రిధిలోని మున్సిపాలిటీల్లో వ‌చ్చిన ఫ‌లితాలను బేరీజు వేసుకుంటూ విప‌క్షాలు ఉప ఎన్నిక‌లో పోటీపై స‌మాలోచ‌న‌లు చేస్తున్నాయి. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీకి వ‌చ్చిన సీట్లు, ఓట్ల‌ను ప‌రిశీలిస్తే ప్ర‌తిప‌క్షాలు ద‌రిదాపుల్లోకి కూడా రాలేదు. ప్ర‌త్యేకించి తిరుప‌తి కార్పొరేష‌న్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. 22 డివిజ‌న్లు ఏక‌గ్రీవం అయ్యాయంటే ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు. అక్క‌డ తెలుగుదేశం పార్టీ, బీజేపీ-జ‌న‌సేన‌లు క‌నీసం అభ్య‌ర్థుల‌ను పెట్టుకోలేక‌పోయాయి. ఈ రెండు కూట‌ముల‌కు తోడు క‌మ్యూనిస్టులు కూడా ఉన్నారు. వీరెవ‌రూ అభ్య‌ర్థులు పెట్టుకోలేనంత స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భంజ‌నం క‌నిపించింది.

పోలింగ్ జ‌రిగిన డివిజ‌న్ల ను ప‌రిశీలిస్తే.. 27 డివిజ‌న్ల ప‌రిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ‌చ్చిన ఓట్ల సంఖ్య 47,745 కాగా, ఇవే డివిజ‌న్ల ప‌రిధిలో టీడీపీ అభ్య‌ర్థుల‌కు మొత్తం 18,712 ఓట్లు ద‌క్కాయి. బీజేపీకి సుమారు 2,546 ఓట్లు రాగా, జ‌న‌సేన అభ్య‌ర్థుల‌కు ద‌క్కిన ఓట్లు 231. సీపీఐ, సీపీఎంలు రెండూ క‌లిపి రెండు వేల ఓట్ల‌ను తెచ్చుకుంటే, బీజేపీ – జ‌న‌సేన‌లు వాటితో పోటీ ప‌డ్డాయి. బ‌లిజ‌లు గ‌ణ‌నీయంగా క‌లిగిన తిరుప‌తి కార్పొరేష‌న్ ప‌రిధిలో జ‌న‌సేన 231 ఓట్ల‌కు ప‌రిమిత‌మైంది. ఇక సూళ్లూరు పేట‌, నాయుడుపేట‌, వెంక‌ట‌గిరి మున్సిపాలిటీల్లో కూడా ఇదే క‌థ‌.

తిరుపతి లోకసభ పరిధిలో మొత్తం 125 వార్డులుఉండగా టీడీపీ మూడు,జనసేన ఒకటి మాత్రమే గెలిచాయి. వైసీపీ ఎవరికీ అందనంత దూరంలో ఏకంగా 121 వార్డులు గెలిచింది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు సాధించిన ఓట్ల‌లో స‌గం స్థాయిలో కూడా తెలుగుదేశం అభ్య‌ర్థులు ఓట్ల‌ను పొంద‌లేక‌పోయారు. బీజేపీ-జ‌న‌సేన‌లు వందల ఓట్ల స్థాయికే ప‌రిమితం అయ్యాయి.ప‌ట్ట‌ణాల్లోనే ప్ర‌త్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అంతంత‌మాత్ర‌పు మెజారిటీతో బ‌య‌ట‌ప‌డ్డ తిరుప‌తి కార్పొరేష‌న్లోనే ఇప్పుడు ఇలాంటి ఫ‌లితాలు అంటే.. ప‌ల్లెలు కూడా ఓటేసే తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక‌లో తెలుగుదేశం పార్టీతో స‌హా బీజేపీ-జ‌న‌సేన‌ల కూట‌మి కూడా డిపాజిట్ల‌ను పొంద‌డం కూడా క‌ష్ట‌మ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ ప‌రిణామాలు, లెక్క‌ల‌న్నీ విప‌క్షాల‌కు నిద్ర లేకుండా చేస్తున్నాయి.