Idream media
Idream media
ఎన్నికలు అంటే సవాళ్లు, ప్రతి సవాళ్లు ఉంటాయి. గెలుపులపై, మెజారిటీలపై పోటా పోటీ సవాళ్లు నడుస్తాయి. కానీ తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఇలాంటి సవాళ్లు మచ్చుకు కూడా కానరావడం లేదు. అధికార వైసీపీ నేతల నోటి నుంచి గెలుపు అనే మాట ఆది నుంచీ వినిపించడం లేదు. వారి దృష్టి అంతా మెజారిటీపైనే ఉంది. మెజారిటీ మూడు లక్షలా..? నాలుగు లక్షలా..? ఐదు లక్షలా…? అనే లెక్కలు అధికార పార్టీ నేతలు వేసుకుంటున్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు నుంచీ ఆ పార్టీ నేతలు మూడు లక్షల మెజారిటీ వస్తుందనే వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించిన తర్వాత.. ఆ పార్టీ నేతలు మెజారిటీ మార్క్ మూడు, మూడున్నర లక్షలు దాటుదుందనే ప్రకటనలు చేశారు. ఆ తర్వాత ఇది నాలుగు, ఐదు లక్షలకు చేరింది. ఇటీవల వెల్లడైన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అధికార పార్టీ నేతలకు ఓటర నాడి తెలిసిపోయినట్లుంది. అందుకే మెజారిటీపై ధీమాగా ఉన్నారు.
వైసీపీ నేతల మాటలకు టీడీపీ, బీజేపీ నేతల నుంచి కౌంటర్లు కరువయ్యాయి. మాకు ఇంత మెజారిటీ వస్తుందని వైసీపీ నేతలు అంటున్నా.. ఇటు వైపు నుంచి రెస్పాన్స్ లేదు. పథకాలు కట్ చేస్తామని ఓటర్లను వైసీపీ భయపెడుతోందని టీడీపీ నేతలు అంటుంటే.. వైసీపీకి, మాకు మధ్యనే పోటీ ఉంటుందని బీజేపీ నేతలు ప్రకటిస్తున్నారు. బీజేపీ నేతలు ఇలాంటి ప్రకటనలు చేయడంతోనే వారి లక్ష్యం ఏమిటో అర్థం అవుతుంది. తిరుపతి ఉప ఎన్నికల్లో రెండో స్థానం సంపాదించడమే బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. టీడీపీ పని అయిపోయింది.. ఇక వైసీపీకి తామే ప్రత్యామ్నాయని ఫలితాల తర్వాత బీజేపీ నేతలు చెప్పుకుంటారు.
బీజేపీ నేతలు ఆశిస్తున్నట్లుగా తిరుపతి ఉప ఎన్నికల్లో రెండో స్థానం వస్తే.. ఇక టీడీపీ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. 2019 ఎన్నికల ఫలితాలతోనే ఆ పార్టీ ఢీలా పడింది. వైఎస్ జగన్‌పరిపాలనతో ఇక టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమనే భావన ఆ పార్టీ కార్యకర్తల్లో నెలకొంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో భవిష్యత్‌పై క్లారిటీ వచ్చింది. చంద్రబాబు, లోకేష్‌ల నాయకత్వంపై తమ్ముళ్లకు నమ్మకాలు సన్నగిల్లాయి. జూనియర్ ఎన్టీఆర్ రావాలంటున్నారు. ఉప ఎన్నిక ఫలితాల తర్వాత.. బీజేపీ, టీడీపీ భవిష్యత్ ఏమిటో తేలిపోతుంది.
Also Read : గోరంట్ల నోటా జూనియర్ ఎన్టీఆర్ మాటే !