Idream media
Idream media
ఓ నియోజకవర్గం ఉప ఎన్నిక ఇంత చర్చనీయాంశంగా మారడం బహుశా అది ఏపీలోనే కావొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో వైసీపీ తప్పా ఎవరూ గెలిచే అవకాశాలు లేకపోయినా రాజకీయంగా తప్పదుకాబట్టి ఆ పార్టీలు పోటీ చేశాయి. ఓడిపోతామని తెలిసినా కొత్త కొత్త దారులు వెదికాయి. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినా దాని చుట్టూ విపక్షాలన్నీ తిరుగుతున్నాయి. ఎన్నికలకు వచ్చేసరికి ఒక పార్టీపై మరొకటి కత్తులు దూసుకున్న టీడీపీ, బీజేపీ.. పోలింగ్ తర్వాత మాత్రం ఓ అంశంపై ఒక్కటి కావడం గమనార్హం. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక అత్యంత విపత్కర పరిస్థితిలో జరిగిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ ఎన్నిక తర్వాత ప్రచారంలో పాల్గొన్న వారిలో చాలా మంది కరోనా బారిన పడ్డారు.పడుతున్నారు కూడా.. ఎలాగోలా ఎన్నిక పూర్తయింది కాబట్టి ఫలితం కోసం ఎదురుచూడకుండా, ఆ ఎన్నికనే రద్దు చేయాలని విపక్షాలు కోరడం ఇప్పుడు చర్చనీయాంశం. ఆ కోరిక ఎందుకు కోరుతున్నాయి..? అక్కడ భారీ స్థాయిలో అల్లర్లు జరిగాయా? పోలింగ్ రోజు విధ్వంసం జరిగిందా..? అంటే ఏదీ లేదాయే.
తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలని తొలుత తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. రీ పోలింగ్ పెట్టాలని గట్టిగానే చెప్పింది. అయితే, పది సార్లు పెట్టినా తాము రెడీ అంటూ వైసీపీ నేతలు కూడా సవాల్ విసిరారు. అనంతరం ప్రకటనలు మాని లేఖల ద్వారా చంద్రబాబు రాజకీయాలు మొదలు పెట్టారు. అనంతరం బీజేపీ కూడా తెలుగుదేశం రూటులో నడవడం ప్రారంభించింది. ఉప ఎన్నికను రద్దు చేయాలని ప్రకటనలు చేయడమే కాదు, హై కోర్టును కూడా ఆశ్రయించారు. తిరుపతిలో బీజేపీ తరఫున పోటీ చేసిన రత్నప్రభే ఈ పిటిషన్ ను దాఖలు చేయడం గమనార్హం. ఈ విషయంలో సీఈసీని, ఇతర అభ్యర్థులను ప్రతివాదులుగా చేర్చారామె. ఈ పిటిషన్ విచారణకు వస్తే వ్యవహారం ఆసక్తిదాయకంగా మారే అవకాశం ఉంది.
నోటిఫికేషన్ ప్రకారం.. ఇప్పుడప్పుడే తిరుపతి లోక్ సభ సీటు ఉప ఎన్నిక ఫలితాలు రావు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో.. దానికి సమయం ఉంది. ఆ లోపు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.గమనించాల్సిన అంశం ఏమిటంటే.. ముందుగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మాత్రమే రిగ్గింగ్ జరిగిందన్నట్టుగా బీజేపీ, టీడీపీలు ఆరోపించాయి. మొత్తం ఏడు అసెంబ్లీ నియోకవర్గాల్లో ఆరు నియోజకవర్గాలపై వీళ్లకు అప్పుడు అభ్యంతరాలు లేవు. ఆరు నియోజకవర్గాలపై కంప్లైంట్లు చేయకుండా, ఇప్పుడు మొత్తం ఉప ఎన్నికనే రద్దు చేసేయాలనే డిమాండ్ విడ్డూరమైనది. అందులోనూ ఈ అంశంపై ఇప్పటికే సీఈసీకి కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఉన్నారు. మొదట తిరుపతి అసెంబ్లీ నియోకవర్గంలో అక్రమాలని ఆరోపించి, ఇప్పుడు రెండు లక్షల దొంగ ఓట్లు పడ్డాయంటూ చంద్రబాబు కొత్త ఆరోపణ చేశారు.
ఈ విషయంలో వైసీపీ మాత్రం దేనికైనా రెడీ అంటోంది. ఎటూ గెలుపు తమదేనన్న ధీమా ఆ పార్టీ నేతల్లో బాగా కనిపిస్తోంది. కానీ, విపక్షాల ఆరోపణలు, అధికార పక్షం సమాధానలు ఎలాగున్నా మళ్లీ ఎన్నిక అనే కాన్సెప్టే ప్రస్తుత పరిస్థితులో అందరనీ కలవరపాటుకు గురి చేస్తోంది. రాజకీయంగా తమ వాయిస్ వినిపించుకునేందుకు ఇలా రద్దు జపం చేస్తున్నారే తప్పా, మళ్లీ ఎన్నిక పెట్టినా ఓటమి తప్పదన్న విషయం ఆ పార్టీలకు తెలియదంటారా..? మరి విపక్షాల పోరాటం ఫలిస్తుందా లేదా వారి పిటషన్లపై ఎటువంటి చర్చ జరుగుతుందో చూడాలి.