iDreamPost
android-app
ios-app

తిరుపతి బై పోల్ : నాడు ఒక్క శాత‌మే.. ఇప్పుడు బీజేపీ ప‌రిస్థితేంటో..!

తిరుపతి బై పోల్ : నాడు ఒక్క శాత‌మే.. ఇప్పుడు బీజేపీ ప‌రిస్థితేంటో..!

2014 ఎన్నికల్లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్పుడు, వైసీపీకి 67 ఎమ్మెల్యే సీట్లు వ‌చ్చాయి. 2019 ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి వైసీపీకి 151 సీట్లు ఇస్తే.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న టీడీపీ 23 మాత్ర‌మే వ‌చ్చాయి. ఓట‌మి చెందిన త‌ర్వాతి నుంచీ టీడీపీ గ్రాఫ్ క్ర‌మ‌క్ర‌మంగా దిగ‌జారిపోతోంది. ఇదే అదునుగా ఏపీలో పాగా వేసేందుకు బీజేపీ త‌న వాయిస్ పెంచింది. ఏపీలో తామే ప్రత్యామ్నాయం అంటూ కొత్త ప‌ల్ల‌వి అందుకుంది. సోము ఏపీ అధ్య‌క్షుడిగా నియ‌మితుల‌య్యాక ఆ ప్ర‌య‌త్నాలు మ‌రింత జోరందుకున్నాయి. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కోసం తెగ పోరాటాలు మొద‌లుపెట్టింది. ఇప్పుడు తిరుపతి లోక్ స‌భ‌ ఉప ఎన్నికల్లో కూడా గెల‌వ‌లేక‌పోయినా ద్వితీయ స్థానంలో అయినా నిల‌బ‌డాల‌ని జ‌న‌సేనాని స‌హ‌కారంతో పోటీ ప‌డుతోంది. కానీ గ‌తాన్ని ఓ సారి ప‌రిశీలిస్తే ఒక్క శాతం ఓట్ల‌నే ఆ పార్టీ సాధించింది. మ‌రి ఈసారి ప‌రిస్థితి ఏంటో చూడాలి.

వైసీపీ 2019 సాధారణ ఎన్నికల్లో తిరుపతి లోక్ సభ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలుచుకుంది. ఆ పార్టీ తరపున బరిలో దిగిన బల్లి దుర్గా ప్రసాద్ భారీ విజయం నమోదు చేశారు. అంతకుముందు 2014 ఎన్నికల్లో కూడా ఈ స్థానం వైసీపీదే. ఆ ఎన్నికల్లో వరప్రసాద్ గెలిచారు. కానీ, ఆయన 2019లో ఏపీ అసెంబ్లీ కి పోటీ చేయడంతో ఆయన స్థానంలో బల్లి దుర్గా ప్రసాద్ బరిలో దిగి గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో మొత్తం 16,50,453 ఓట్లకు గానూ బీజేపీకి కేవ‌లం 16,125 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. అంటే బీజేపీ అభ్యర్థి బి. శ్రీహరి రావుకు 1.22 శాతం వ‌చ్చాయ‌న్న‌ మాట‌. దీంతో ఆ పార్టీకి క‌నీసం డిపాజిట్ కూడా ద‌క్క‌లేదు. ఓ ర‌కంగా చూస్తే బీజేపీ కంటే నోటాకే 1.96 శాతం అంటే 25 వేల 781 ఓట్లు వ‌చ్చాయి. అలాగే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ద్ద‌తు ఇచ్చిన బీఎస్పీ అభ్యర్థి శ్రీహరి రావుకు 1.60 శాతం అంటే 20 వేల 971 ఓట్లు వ‌చ్చాయి. ఇలా ఎటు చూసినా నాటు బీజేపీ, జ‌న‌సేనకు క‌నీస ప్రాధాన్యం లేదు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా గెలిచిన వైసీపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు 47.84 శాతంతో 5 లక్షల 80 వేల 376 ఓట్లు సాధించి విజ‌యం సాధించారు. బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. కారుమంచి జయరామ్ బీజేపీ తరపున పోటీ చేసి 44.76 శాతం అంటే మొత్తం 5 లక్షల 42 వేల 951 ఓట్లు సాధించారు. 44 శాతం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ఒకే ఒక్క శాతానికి బీజేపీ దిగ‌జారిపోయింది. గ‌త కొంత కాలంగా దూకుడు మీదున్న బీజేపీకి కేంద్రం నిర్ణ‌యాలు శ‌రాఘాతంగా మారాయి. ఏపీకి ప్ర‌త్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ అంశాలు ఆ పార్టీపై తీవ్ర ప్ర‌భావాన్ని చూప‌నున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో పార్లమెంటులో నాటి ప్రధాని ఇచ్చిన హామీని తాము అధికారంలోకి వస్తే అమలుచేస్తామని 2014 ఎన్నికల ప్రచారంలో బీజేపీ చెప్పింది. ఈ విష‌యాన్ని తిరుప‌తి ఎన్నిక‌ల్లో పలు పార్టీలు పదే పదే ప్రస్తావిస్తున్నాయి. తామే ప్ర‌త్యామ్నాయం అంటున్న బీజేపీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ ఉప ఎన్నిక‌లో ఎంత వ‌ర‌కూ ప్ర‌భావం చూప‌గ‌ల‌దో చూడాలి మ‌రి..!