Idream media
Idream media
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల సందర్భంగా విపక్షాలు చేసిన హడావిడి, ఆందోళనలు, ఆరోపణలు గుర్తు ఉన్నాయా? ఓటమి నుంచి పరువు దక్కించుకోవడం కోసం ముందస్తుగా వ్యూహం రచించారు. దొంగ ఓట్లు, బెదిరింపులు అంటూ హడావిడి చేశారు. ఎల్లో మీడియా కూడా ఓటింగ్ సరళిని చూపించకుండా, పదే పదే వారి ఆరోపణలను, సంబంధిత కొన్ని వీడియోలనే హైలెట్ చేస్తూ వచ్చింది. చివరకు బంపర్ మెజార్టీతో అధికార పార్టీ వైసీపీ విజయం సాధించాక అందుకే ఓడిపోయామంటూ స్టేట్ మెంట్లు ఇచ్చి ఓటమి నుంచి పరువు దక్కించుకునే ప్రయత్నాలు చేశారు. ఎన్నికల కమిషన్ ను, న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు. ఈరోజు రాష్ట్రంలో కొన్ని చోట్ల జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే సీన్ కనిపిస్తోంది.
రాష్ట్రంలో వేర్వేరు కారణాలతో మిగిలిపోయిన 12 మున్సిపాలిటీలు, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కోసం పోలింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. వీటిలో అందరి దృష్టి మాత్రం కుప్పంపైనే నిలిచింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. ప్రస్తుతం జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికలు కాదు. పార్లమెంట్ కాదు. అలాగని రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్థానిక ఎన్నికలు జరగడం లేదు. కేవలం 13 చోట్ల స్థానిక పోలింగ్ జరుగుతుంటే.. అందులో అవకతవకలు జరుగుతున్నాయని ఏకంగా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు లైవ్ లోకి వచ్చి మాట్లాడాల్సి వచ్చిందంటే తెలుగుదేశం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కుప్పంలో కూడా వైసీపీ గెలిస్తే.. పరువు దక్కించుకునేందుకు ముందస్తుగానే లైవ్ లోకి వచ్చి అధికారపార్టీపై ఆరోపణలకు శ్రీకారం చుడుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
చిన్న మునిసిపాలిటీ అయిన కుప్పానికి తాను వెళ్లాల్సిన పరిస్థితి తెచ్చారంటూ స్వయంగా చంద్రబాబే చెప్పుకోవడంలో అంతరార్దం ఏంటో ఆయనకే తెలియాలి. ఇంకో గమ్మత్తయిన విషయమేంటంటే.. గెలిచేది టీడీపీ అభ్యర్థులే అయినా.. వైసీపీ గెలిచినట్లుగా ప్రకటిస్తారని ముందే ప్రచారం చేస్తుండడం బాబులో కనిపిస్తున్న ఓటమి చాయలకు నిదర్శనంగా చెప్పుకోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. యధావిధిగా పోలీసులపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఉద్యోగులు అందరూ కూడా మారిపోయారట. ఉద్యోగం కోసం తప్పా.. రాజ్యాంగబద్ధంగా పని చేయాలన్న స్పృహ లేదని పేర్కొన్నారు. కుప్పంలో గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ సర్వశక్తులు ఒడ్డింది. ప్రస్తుతం అక్కడ జోరుగా పోలింగ్ జరుగుతోంది. జరుగుతుండగానే చంద్రబాబు మీడియా సమావేశాలు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. కారణాలు ఏం వివరించినా వైసీపీ గెలుపును ముందే ఊహించినట్లుగా బాబు వ్యాఖ్యలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.
Also Read : TDP Chandrababu, Kuppam Elections – కుప్పంలో టీడీపీ ఓడిపోతోందా..? చంద్రబాబు ఎందుకలా మాట్లాడారు..?