Idream media
Idream media
తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా ఉప ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. ఏపీలో లోక్ సభ కు, తెలంగాణలో శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 15 సాయంత్రంతో ప్రచార పర్వం ముగిసింది. రెండు చోట్లా కూడా 17న ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ లో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం, ఏపీలో తిరుపతి లోక్ సభ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీ ప్రచారం నిర్వహించాయి. నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచీ నిన్న ప్రచారం ముగిసే వరకూ ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో కత్తులు దూసుకున్నారు. ఇక ఈరోజు సైలెంట్ గా ఎవరి పని వారు కొనసాగిస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ కొనసాగగా, ఏపీలో ఆది నుంచీ అధికార పార్టీ హవా కనిపించింది. చివరి రెండు రోజుల్లో ఏదో ఒక హడావిడి చేసి టీడీపీ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక బీజేపీ – జనసేన కూటమి ప్రచారంలో ఎదురీదింది.
ఏపీలోని తిరుపతి లోక్ సభ సెగ్మెంట్ ను గత రెండు పర్యాయాలూ కూడా వైసీపీనే గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టడంతో పాటు అత్యధిక మెజార్టీ దిశగా అధికార పార్టీ వ్యూహాత్మకంగా ప్రచారాన్ని రక్తి కట్టించింది. ఎటువంటి మరకలూ లేని గురుమూర్తిని అభ్యర్థిగా తెరపైకి తెచ్చి వైసీపీ నాయకత్వం సరైన నిర్ణయం తీసుకుందన్న వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లుగానే వైద్యుడైన గురుమూర్తి పార్లమెంట్ సెగ్మెంట్ లో వైసీపీ చేసిన అభివృద్ధి, పెండింగ్ లో ఉన్న సమస్యలను పూర్తిగా ఆకలింపు చేసుకుని ప్రచారం సాగించారు. తనను గెలిపిస్తే ఏం చేస్తానో చెబుతూ ఓట్లను అభ్యర్థించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు గురుమూర్తి గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా వైసీపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు సుమారు 50 వేల మెజార్టీతో గెలుపొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లో బల్లి దుర్గా ప్రసాద్ రావు 2 లక్షలా 28 వేల 376 ఓట్ల మెజారిటీ సాధించారు. ప్రస్తుతం వైసీపీ గెలుపు సునాయాసంగానే కనిపిస్తోంది. దీంతో ఆ పార్టీ యంత్రాంగం మొత్తం అత్యధిక మెజార్టీపైనే దృష్టి సారించి ప్రచారం చేశారు. ఈ నెల 14న సీఎం జగన్ సైతం ప్రచారానికి వచ్చేందుకు సిద్ధమవ్వగా కరోనా ఉధృతి నేపథ్యంలో విరమించుకున్నారు. ప్రజలకు లేఖలు రాసి వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టారు.
ఇక తెలుగుదేశం అభ్యర్థి పనబాక లక్ష్మి గెలుపుకో చంద్రబాబు నాయుడు సహా లోకేశ్, అచ్చెన్నాయుడు సహా పలువురు టీడీపీ ప్రచారం నిర్వహించారు. ఓ రాయి చేత్తోపట్టుకుని చంద్రబాబు సానుభూతి పొందే ప్రయత్నం చేయగా, అదే రోజు సాయంత్రం విడుదలైన ఓ వీడియో టీడీపీలో కుంపట్లు రేపింది.
బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ బరిలో ఉన్నారు. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా విజయం సాధిస్తామని జనసేన-బీజేపీ కూటమి మొదట్లో ధీమా వ్యక్తం చేసినా, రాను రాను ఆ పార్టీలో ఉత్సాహం తగ్గుతూ వచ్చింది. పవన్ కల్యాణ్ సభ అనంతరం కాస్త జోష్ పెరిగింది. మరోసారి పవన్ తో ప్రచారం చేయించాలని ప్రయత్నించినా కరోనా వారి ఆశలను నీరు గార్చింది. జేపీ నడ్డా ప్రచారం కూడా పార్టీలో పెద్దగా ఊపు తేలేకపోయింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు బీజేపీ స్పీడుకు బ్రేకులు వేశాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా చింతా మోహన్ బరిలో ఉన్నారు.
ఇక తెలంగాణలోని నాగార్జున సాగర్ లో ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో టీఆర్ఎస్ ప్రచారం చేపట్టింది. సీఎం కేసీఆర్ ఏకంగా రెండు సార్లు సభలో పాల్గొన్నారు. దుబ్బాక లో ఓటమి తర్వాత జీహెచ్ ఎంసి ఎన్నికల్లో మేయర్ పీఠం అందుకున్నా కూడా బీజేపీ అక్కడ బాగా పుంజుకుంది. ఇక సాగర్ లో కూడా బీజేపీ, కాంగ్రెస్ గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుండటంతో సాగర్ గెలిచి టీఆర్ఎస్ కు తిరుగులేదు అని నిరూపించాలని తహతహలాడుతోంది. దీనితోనే ఇప్పటికే టిఆర్ ఎస్ బడా నేతలందరూ సాగర్ లో ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ కూడా ప్రచార పర్వంలో ఫైనల్ టచ్ ఇచ్చారు. ఈ సభలో సీఎం కేసీఆర్ నియోజకవర్గం పై వరాల జల్లు కురిపిస్తూనే బీజేపీ కాంగ్రెస్ ను టార్గెట్ చేసుకొని విమర్శలు కురిపిస్తూ టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ ను భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి, బీజేపీ అభ్యర్థి రవికుమార్ కూడా సాగర్ లో విజయం కోసం శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ప్రచారపర్వం ముగియడంతో ఎవరికి వారు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తమ్మీద అటు ఏపీలోను, ఇటు తెలంగాణలోను ఉప ఎన్నికల ప్రచారం ముగిసి రేపు జరగబోయే పోలింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.