iDreamPost
android-app
ios-app

నీ కొండ‌ను నువ్వే కాపాడుకో

నీ కొండ‌ను నువ్వే కాపాడుకో

మ‌నుషుల వ‌ల్ల దేవుడు బ‌తుకుతాడు. దేవుడి వ‌ల్ల మ‌నుషులు బ‌తుకుతారు. క‌రోనాని దేవుడు సృష్టించాడో లేదో తెలియ‌దు కానీ, అది దేవున్ని కూడా భ‌య‌పెడుతూ ఉంది. ఆయ‌న కూడా మాస్క్ వేసుకోవాల్సిన స్థితి ఏర్ప‌డింది.

తిరుమ‌ల‌కు దారులు మూసేశారంటే , ఒక ర‌కంగా గుడిని మూసేసిన‌ట్టే. పూజ‌లు య‌ధావిధిగా జ‌రుగుతాయ‌ని అంటున్నారు. అయితే గోవిందా అని ఒక‌ర్నొక‌రు తోసుకుంటూ అరుస్తూ సిబ్బందితో నెట్టించుకుంటూ భ‌క్తులు వెళ్తూ ఉంటేనే దేవుడికి కూడా ఇగో సంతృప్తి చెందుతుంది. దేవుడు కూడా అహాన్ని జ‌యించ‌లేడు.

ద‌ర్శ‌న సిఫార్సుల కోసం , సేవా టికెట్ల కోసం అధికారుల చుట్టూ తిరిగే వాళ్లు లేరు. రూమ్‌ల కోసం ఫోన్లు చేసేవాళ్లు లేరు. త‌మ ద‌ర్శ‌నం కోసం ప‌డిగాపులు కాసేవాళ్లు లేక‌పోతే దేవుడికే కాదు, అధికారుల‌కి కూడా నిద్ర‌ప‌ట్ట‌దు. ఇప్పుడు సుప్ర‌భాత సేవ అవ‌స‌రమే లేదు, స్వామి క‌ళ్లు తెరుచుకుని ఎదురు చూసినా దండాలు పెట్టే భ‌క్తులు లేరు. దేవుడికి కూడా ప‌రీక్షా కాలం వ‌చ్చింది.

నిజానికి ఈ మ‌ధ్య జ‌రిగిన‌ట్టు టైంస్లాట్‌లో సామాన్యుల‌కి హాయిగా ద‌ర్శ‌నం చేయించి పంపించ‌వ‌చ్చు. కానీ భ‌క్తుల్ని క‌ష్ట‌పెట్టి, ఆ షెడ్ల‌లో గంట‌ల త‌ర‌బ‌డి కుక్కి “దేవుడా” అని అరిచేట్టు చేస్తేనే అధికారుల‌కి తృప్తి. దేవుడి ముందు రోజూ నిల‌బ‌డినా వారికి ఆయ‌న జ్ఞానాన్ని ప్ర‌సాదించ‌లేక పోతున్నాడు.

ప్ర‌పంచానికి ఆర్థిక మాంద్యం భ‌యం పుట్టిన‌ట్టు, దేవుడికి కూడా భ‌క్తులు ఇక వ‌స్తారా అనే భ‌యం ప‌ట్టుకుంటుంది. ఐసోలేష‌న్ దేవుడికి కూడా ద‌శాబ్దాలుగా భ‌క్తుల్ని చూసి చూసి అల‌వాటు ప‌డి ఉన్నాడు. గుడి ఖాళీగా ఉంటే భ‌యం వేయ‌దా? కోరిక‌లు కోరే వాడే లేక‌పోతే దేవుడిగా ఉండి ప్ర‌యోజ‌నం ఏంటి?

నేను తిరుప‌తిలో 20 ఏళ్లు ఉన్నాను. నా బాధ దేవుడి గురించి కాదు. ఆయ‌న‌కేం? గొప్పోళ్ల అండ‌తో ఎలాగో బ‌తికేస్తాడు. ఆయ‌న్ని న‌మ్ముకుని చీమ‌లు లాంటి స‌న్న జ‌నం కొన్ని వేల మంది ఉన్నారు. తిరుమ‌ల‌లో దేవుడు ఉచితంగా అన్నం పెట్ట‌డ‌మే కాదు, తిరుప‌తిలో కూడా ఆయ‌న వ‌ల్ల క‌డుపు నిండా అన్నం తినేవాళ్లు ఉన్నారు.

బ‌స్సు దిగ‌గానే క‌నిపించే ఆటోవాలా, శ్రీ‌నివాసం ద‌గ్గ‌ర ఐస్‌క్రీం అమ్ముకునే కుర్రాడు, బండిమీద దోశ‌లు పోసుకునే అవ్వ వీళ్లంతా ఏం కావాలి?

న‌డ‌క దారిలో మొద‌టి మెట్టు పూజ కోసం కొబ్బ‌ర కాయ అమ్ముకునే పేద‌రాలు, ఆఖ‌రి మెట్టు ద‌గ్గ‌ర క‌ర్పూరం అమ్ముకునే తాత దిగులు ముఖాల‌తో క‌నిపిస్తారు.

న‌డిచి న‌డిచి అల‌సిపోతే శంఖు చ‌క్రాల ద‌గ్గ‌ర కూల్ డ్రింక్స్ అమ్మేవాళ్లు, మంచాల మీద కూర్చుంటే వేడి వేడి ఇడ్లీలు ఇచ్చేవాళ్లు వీళ్లంతా ఈ పాటికి కొండ దిగే ఉంటారు.

భ‌క్తులే రాక‌పోతే జింక‌ల పార్కు ద‌గ్గ‌ర క్యారెట్ ముక్క‌లు జింక‌ల‌కి ఎవ‌రు అందిస్తారు? నిలువెత్తు ఆంజ‌నేయ‌స్వామికి దండాలు ఎవ‌రు పెడ‌తారు?

24 గంట‌లూ గోవింద నామం వినిపించే కొండ కూడా నిశ్శ‌బ్దం అయిపోతుందా? ప‌ట్టు వ‌స్త్రాలు, గంధ‌పు సువాస‌న‌లు, పిల్ల‌ల ఆట వ‌స్తువుల శ‌బ్దాలు, టీ కొట్ల‌లో అరుపులు, త‌ప్పి పోయిన వాళ్ల కోసం మైకులో అనౌన్స్‌మెంట్లు, టాక్సీ వాళ్ల కేక‌లు, ద‌ర్శ‌నానికి ఎటు పోవాలో తెలియ‌ని అనేక భాష‌ల అర్థింపులు…ఇదంతా నిజ‌మేనా? కొండ కూడా మౌనం వ‌హిస్తుందా?

డ‌బ్బుల కోసం , మెహ‌ర్భానీ కోసం ఆయ‌న ముందు దొంగ‌ల్ని దుర్మార్గుల్ని నిల‌బెట్టి , హార‌తులు ఇచ్చి పైసాపైసా కూడ‌బెట్టి హుండీలో వేసే పేద‌వాళ్ల‌ని మెడ‌బ‌ట్టి తోసేస్తూ ఉంటే ఆయ‌న‌కి కోపం వ‌చ్చి విశ్రాంతి కోరుకున్నాడా?

జ‌నం కోరే దురాశ‌ల్ని తీర్చ‌లేక త‌న‌కు తానే ఏకాంత శిక్ష‌ని విధించుకుంటున్నాడా? అయినా మంచీచెడు తెలియ‌కుండా దేవుడ‌వుతాడా?

పూజ‌లెన్ని చేసినా , కీర్త‌న‌లు ఎన్ని పాడినా , ఒక క‌ష్ట జీవి గోవింద నామ స్మ‌ర‌ణ‌తో స‌మాన‌మ‌వుతుందా?

నెల‌ల బిడ్డ‌కి దేవున్ని చూపిస్తున్న త‌ల్లి క‌ళ్ల‌లోని ఆనందం , కొత్త‌గా పెళ్లి అయి , ఇంకా క‌ష్టాల రంగు పులుముకోని ప‌సుపు తాడుతో వ‌చ్చిన అమ్మాయి క‌ళ్ల‌లోని జీవ‌న సంతోషం, అంతా నువ్వే న‌డిపిస్తున్నావ‌నే భ్ర‌మ నుంచి సామాన్యుల్ని దూరం చేయ‌కు.

తిరుమ‌ల మాఢ‌వీధుల్లో గ‌జ‌రాజులు ముందు న‌డుస్తూ ఉండ‌గా కిక్కిరిసిన జ‌నం భ‌క్తితో ఊగుతుంటే నీ వాహ‌నంలో మ‌ళ్లీ నువ్వు సంచ‌రించే రోజులు తెచ్చుకో.

జ‌నం నీ కోసం ఎగ‌బ‌డితేనే నీకు విలువ‌.

కాశీదారాలు అమ్ముకునే పేద‌వాడు, నీ రూపంలో ఉన్న ఉంగ‌రాలు అమ్ముకునే దీనురాలు వీళ్లంద‌రి క‌ళ్ల‌లో వెలుగు లేక‌పోతే నీకెన్ని హార‌తులు ఇచ్చినా వృథానే.

ఈ దేశ ప్ర‌జ‌లు చెట్టుపుట్ట‌లో కూడా దేవున్ని చూసే అమాయ‌కులు. వాళ్ల పొట్ట‌మీద కొట్టొద్దు.

మ‌నుషుల్ని ప్రేమించ‌డ‌మే దైవ‌త్వం.