iDreamPost
android-app
ios-app

నేటితో 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న తిరుమల ఘాట్ రోడ్..

నేటితో 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న తిరుమల ఘాట్ రోడ్..

తిరుమల ప్రయాణం అనగానే మనకి మొదట గుర్తొచ్చేది ఆ దేవ దేవుని ఏడు కొండల మీద పచ్చిని చెట్లు, ప్రకృతి సోయగాలు మధ్య ఆహ్లాదభరిత వాతావరణంలో ఒంపులు తిరిగుండే ఘాట్ రోడ్ లో గుండా సాగే ప్రయాణమే. దారిపొడవునా అడుగడుగునా కలిగే ఆ ఆధ్యాత్మిక అనుభవమీ వేరు. తిరుమలను సందర్శించిన ప్రతి భక్తునికి ఆ ప్రయాణం ఒక మరపురాని తీపి గుర్తుగా మిగిలిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా ఘాట్ రోడ్లు చూసినప్పటికీ తిరుమల ఘాట్ రోడ్ కి వుండే ఆ ఆధ్యాత్మిక అనుభూతే వేరు.

ఎత్తైన కొండలు.. ఒంపులు తిరిగి ఉండే రోడ్లు.. పచ్చని బయళ్లు.. చెట్లు.. చిన్న చిన్నసెలయేళ్ళు అలా అడుగడుగునా ఆ దేవ దేవుని ఆనవాళ్లు కనిపిస్తాయి. మనం ఏడుకొండల వాడిని దర్శించుకోవాలంటే ప్రయాణించాల్సింది మొదటి ఘాట్ రోడ్ ద్వారనే. ఆ తిరుమలేశుని దర్శించుకొనేందుకు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం నిర్మించినదే ఈ మొదటి ఘాట్ రోడ్డు. అతి క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల్లో పాతకాలపు టెక్నాలజితోనే ఈ ఘాట్ రోడ్డును నిర్మించారు. విశిష్టమేమిటంటే స్వతంత్రానికి ముందు నిర్మించిన ఈ రోడ్డు నేటితో 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76 వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. దట్టమైన శేషాచలం అడవుల్లో ఘాట్ రోడ్ నిర్మించాలనే ప్రతిపాదన అప్పటి బ్రిటీష్ ప్రభుత్వానికి కలిగింది. నాటి మద్రాస్ గవర్నర్ ‘సర్. ఆర్ధర్ హోప్’ ఈ ఘాట్ రోడ్ ని నిర్మించడానికి ప్రతిపాదనలను సిద్ధం చేశారు.

ఈ ప్రతిపాదనను బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించిన వెంటనే ఘాట్ రోడ్ నిర్మాణ భాద్యతలను వారు ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య కు అప్పగించారు. ఈ బాధ్యతలు చేపట్టిన ఆయన ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం పెద్దగా అందుబాటులో లేని ఆ రోజుల్లోనే ఎత్తైన కొండలు, దట్టమైన అటవీ ప్రాంతంలో అత్యంత క్లిష్టమైన ఘాట్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ఘాట్ రోడ్ నిర్మాణం ఇప్పటికీ అనేకమంది ఇంజనీర్లకు స్ఫూర్తినిస్తుంది. అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రాజెక్ట్ ఖర్చుపై ఆంక్షలు విధించినప్పటికీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎక్కడా తన ఆత్మస్థైర్యం కోల్పోకుండా మొత్తం 57 మలుపులతో పటిష్టమైన ప్రణాళికను రూపొందించుకున్నారు. ఆయన వందలాది మంది కార్మికులను నియమించుకొని యుద్ధ ప్రాతిపదిక ను పనులు ప్రారంభించారు.

ఆ కాలంలో నిర్మాణ సమయంలో కూలీలకు మగవారికి రోజుకు 6 అణాలు, ఆడవారికి 4 అణాలు చొప్పున కూలి ఇచ్చేవారు. 1943 నాటికే పనులన్నీ ఈ పూర్తయ్యాయి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య మొదటి సారి తన కారులో ట్రయల్ రన్ నిర్వహించి ఎంతో ఆనందపడ్డారు. ఈ ఘాట్ రోడ్డు నిర్మాణం తనకెంతో సంతృప్తినిచ్చిందని మోక్షగుండం విశ్వేశ్వరయ్య తన సన్నిహితులకు చెప్పేవారంట!! బ్రిటిష్ ప్రభుత్వం నిర్మాణానికి ఎంత ఖర్చు పెట్టినప్పటికీ దానిని నిర్మించిన ఘనత మాత్రం మోక్షగుండం విశ్వేశ్వరయ్యకే దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

1944లో అప్పటి మద్రాస్ రాష్ట్ర గవర్నర్ సర్. ఆర్ధర్ హోప్ ఆ ఘాట్ రోడ్డును లాంఛనంగా ప్రారంభించారు. ఈ రోడ్డులో మొత్తం 57 మలుపులు, 36 హెయిర్ పిన్ బెండ్స్ (క్లిష్టమైన సన్నని మలుపులు) ఉన్నాయి. దీనికి కారణం అలిపిరి దగ్గర సముద్రమట్టానికి కేవలం 150 మీటర్ల ఎత్తు ఉండగా శిఖరం పైకి పొయ్యేటప్పటికీ షుమారు 976 మీటర్ల ఎత్తువుంది. దీని నిర్మాణం పూర్తయిన నాటినుండి దాదాపు 30 ఎళ్ల పాటు తిరుమలకు రాకపోకలు ఈ ఘాట్ ద్వారా మాత్రమే జరిగాయి. మొదట్లో భక్తులు ఎక్కువగా ఎడ్ల బండ్లు ఉపయోగించారు. అప్పట్లో బస్సులు ప్రయివేట్ వాహనాలు చాలా తక్కువ.

ఏటా రద్దీ పెరుగుతుండడం, తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో 1961లో టిటిడి రెండవ ఘాట్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య ఈ రోడ్డును శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణం పన్నెండేళ్ల పాటు సాగింది. 1973లో అప్పటి టిటిడి చైర్మన్ గోకరాజు గంగరాజు రెండవ ఘాట్ రోడ్డును ప్రారంభించగా 1974 సెప్టెంబర్ 3 న కొత్త టిటిడి చైర్మన్ చెలికాని అన్నారావు చేతులమీదుగా భక్తులను అనుమతించారు.

తిరుమల మొదటి ఘాట్ రోడ్డు నిర్మించి 75 సంవత్సరాలు గడచినా కానీ, ఇప్పటికి కూడా ఆ రోడ్డు నాణ్యత దెబ్బతినలేదని, కొండచరియలు విరిగిపడలేదని ఇది చాలా అరుదైన విషయమని ఇంజనీర్లు చెప్తున్నారు. అయితే రెండవ ఘాట్ రోడ్ లో మాత్రం 11 వ కిలోమీటర్ నుండి 17 వ కిలోమీటర్ మధ్య హెయిర్ పిన్ స్లొప్స్ ఎక్కువగా ఉండడం, అక్కడ రాక్ కంపోజిషన్ గట్టిగా లేకపోవడం వల్ల అప్పుడప్పుడు చిన్నచిన్న ప్రమాదాలు జరగడంతో పాటు కొండచరియలు విరిగిపడుతున్నాయని, అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎప్పటికప్పుడు చిన్నచిన్న మరమత్తులు చేయిస్తున్నారని అధికారులు తెలిపారు. రానురాను ఏ ఏటికి ఆ ఏడు పెరుగుతున్న భక్తులను దృష్టిలో పెట్టుకొని వాహనాల రద్దీని తగ్గించి కొనపై కాలుష్యాన్ని నియంత్రించడానికి టిటిడి ఎలక్ట్రిక్ బస్సులతో పాటు మోనో రైలును ప్రవేశపెట్టే యోచనలో ఉంది.