iDreamPost
iDreamPost
జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఏడాదిన్నర గడుస్తుంది. ఈ ఏడాదిన్నరలో జగన్ ప్రభుత్వం అమలు చేసినన్ని సంక్షేమ పథకాలు ఈ దేశంలో మరో ముఖ్యమంత్రి అమలు చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఆఖరికి దేశం అంతా లాక్ డౌన్ తో సంక్షోభంలో కూరుకుపోయినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి జగన్ అమలు చేసే సంక్షేమ పథకాలకు బ్రేకులు వేయలేదు. ఇలా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న జగన్ పై ప్రతిపక్షాలు నిత్యం ఏదోఒక నిరాధారమైన ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా వాటిని ప్రచారం చేస్తు జగన్ పై ప్రజల్లో లేని వ్యతిరేకతను ఉందని చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా గడచిన ఈ ఏడాదిన్నరలో జగన్ పై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలలో అధిక భాగం మతాలను రెచ్చగొట్టేవే ఉండటం గమనార్హం.
జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే జగన్ ను హైందవ సమాజానికి దూరం చేయాలని లేని పోని అభూతకల్పనలను సృష్టించి, పనికట్టుకుని చేసిన విషప్రచారం చూస్తే ప్రతిపక్షాలు రాజకీయం కోసం ఎంత మతోన్మాదం సృష్టించటానికి కూడా వెనకాడటంలేదనే విషయం అర్ధం అవుతుంది. ఇప్పటికే తిరుమలపై అనేక అవాస్తవాలను ప్రచారం చేస్తూ వచ్చిన ప్రతిపక్షాలు అందులో భాగంగా ఏకంగా తిరుమల బోర్డ్ చైర్మన్ గా ఎన్నికైన వైవి సుబ్బారెడ్డి మతంపై కూడా విషప్రచారం చేసింది.. ఆయన క్రైస్తవుడని అలాంటి వ్యక్తికి తిరుమల బోర్డు చైర్మన్ పదవి ఎలా ఇస్తారంటు రాద్దాంతం చేసింది. కానీ నిజానికి ఇప్పటికే తన మతంపై చేస్తున్న ప్రచారాలన్ని అవాస్తవం అని, తాను హిందు సాంప్రదాయం పాటించే వ్యక్తినని ఆయన అనేక సందర్భాల్లో వివరణ ఇచ్చుకున్నారు. అలాగే రాజ్యసభ సభ్యులైన సుబ్రహ్మణ్య స్వామి సైతం జాతీయ వేదికలపై వైవీ సుబ్బారెడ్డిపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన సందర్భాలు ఉన్నాయి.
వైవి సుబ్బారెడ్డి మతంపై ప్రతిపక్షాలు పదే పదే పని కట్టుకుని చేస్తున్న విషప్రచారాన్ని ఇప్పటికే అనేక సార్లు వివిధ సందర్భాల్లో ఖండించినా వారి వైఖరి మారినట్టు కనిపించడం లేదు. వాస్తవాలతో పనిలేకుండా రాజకీయ స్వలాభమే పరమావధిగా ఇంకా అదే ప్రచారాన్ని వారు ముమ్మరం చేసినట్టు కనిపిస్తుంది. తాజాగా ప్రముఖ జాతీయ చానల్ టైమ్స్ నౌ లో రాష్ట్రంలో హిందు ఆలయాలపై జరుగుతున్న దాడులకు సంబంధించి జరిగిన చర్చలో భాగంగా జగన్ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలను ప్రచారం చేస్తూ తిరుమల ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా జగన్ తన దగ్గరి బంధువైన, క్రిష్టియన్ మతానికి చెందిన వైవి సుబ్బారెడ్డిని అపాయింట్ చేసినట్టు టెలికాస్ట్ చేశారు. అయితే వాస్తవాలు తెలుసుకున్న సదరు టైమ్స్ నౌ సంస్థ, తాము ప్రచారం చేసిన సత్య దూరమైన వార్తకు తాము చింతిస్తున్నట్టు, కొంతమంది హిందు సంస్థలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైరిపక్ష నాయకులు అందించిన సమాచారం మేరకు తాము ఆ వార్త ప్రచారం చేసినట్టు. కానీ వైవి సుబ్బారెడ్డి హిందు మతానికే చెందిన వ్యక్తిగా తెలుకున్నామని ,, తాము సుబ్బారెడ్డి మనోభావాలు దెబ్బతిసే విధంగా వార్త ప్రచారం చేసినందుకు చింతిస్తున్నామని సదరు సంస్థ ప్రకటించింది. ఏది ఏమైనా రాజకీయంగా జగన్ ను ఏదుర్కోలేక ఈ విధంగా ప్రతిపక్షాలు రాష్ట్రంలో ఎన్నడులేని విధంగా మత విద్వేషాలను రెచ్చకోట్టే ప్రయత్నం చేయడం అత్యంత శోచనీయం.