Idream media
Idream media
మోడీపైన మనకు కోపం ఉండొచ్చు. ఉంటుంది కూడా. రాత్రికి రాత్రి నోట్లు రద్దు చేసి క్యూలో నిలబెట్టాడు. GST ని తెచ్చి నెత్తికి రుద్దాడు. ఎలాగో కోలుకుంటూ ఉంటే పౌరసత్వ బిల్లు అన్నాడు. మా ముత్తాత బర్త్ సర్టిఫికెట్ తెస్తే అదేదో పట్టిక తయారు చేస్తానన్నాడు. ఎందుకు పుట్టారో , ఎలా బతికారో తెలియకుండానే పోయిన పెద్దవాళ్లు వాళ్లంతా. ఎక్కడ పుట్టారో చెప్పమంటే ఏం చెప్పేది?
మోడీతో వంద విభేదాలు ఉండొచ్చు. అదంతా మన అంతర్గతం. ఇప్పుడు శత్రువు బయటి నుంచి వచ్చాడు. ఎందరో శత్రువులు మన మీదికి వచ్చారు. మొగలాయిలు గుర్రాల మీద వచ్చారు. ఇంగ్లీష్ వాళ్లు ఓడల్లో వచ్చారు. కానీ ఈ కరోనా గాలిలో వస్తోంది. దానికి వీసా, పాస్‌పోర్ట్ అక్కర్లేదు.
యుద్ధం ప్రారంభమైంది. ఆయుధాలు పనికిరావు. ఆదమరిస్తే మరణమే. మోడీ మాట విని గతంలో చెడిపోయాం. ఈ సారి వినకపోతే చెడిపోతాం. జనతా కర్ఫ్యూని గౌరవిద్దాం. ఇళ్లలో నుంచి బయటకు రాకుండా ఉందాం.
సాయంత్రం ఐదు గంటలకి కృతజ్ఞతలు చెబుదాం. చప్పట్లు కొట్టి మాత్రమే కాదు, చేతులు ఎత్తి నమస్కరించి కూడా.
ఇంత కాలం తెలిసిన డాక్టర్లు , వైద్య సిబ్బంది, పోలీసులు వేరు. ఇప్పుడు మనం చూస్తున్న వాళ్లు వేరు. ఒక సంక్షోభంలో వాళ్లు ప్రాణాలకు తెగించి మన ప్రాణాల కోసం పని చేస్తున్నారు. మనకంటే వాళ్లకే కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువ. అయినా లెక్క చేయడం లేదు. వాళ్లకి ఇంటి దగ్గర చిన్నపిల్లలుంటారు. ఎదురు చూసే తల్లి ఉంటుంది. ముసలి తండ్రి ఉంటాడు. అయినా వాళ్లు మన కోసం రోడ్డు మీద ఉన్నారు. మనం రోడ్డు మీదకి వెళ్లకుంటే చాలు.
వీళ్లే కాదు మురికిని శుభ్రం చేస్తున్న పారిశుధ్య కార్మికులు , రైళ్లు, బస్సులు శుభ్రం చేస్తున్న వాళ్లు. అధికారులు, రాజకీయాల్ని పక్కన పెట్టి ముప్పుని గుర్తిస్తున్న నాయకులు అందరినీ గౌరవిద్దాం.
కరోనా ఏం చేస్తుందిలే అనుకోవద్దు. దాని వల్ల మనం చచ్చిపోకపోవచ్చు. అది మన ఆఖరి కండరం నములుతున్నప్పుడు కూడా బతికే ఉంటాం. కానీ ఆర్థికంగా వందసార్లు చచ్చిపోతాం.