Idream media
Idream media
తెలంగాణలో ఆదివారం జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల కౌంటింగ్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ (హైదరాబాద్) నియోజకవర్గంలో 93 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో బ్యాలెట్ భారీగా ఉంది. లెక్కింపు ప్రక్రియలో భాగంగా మొదటి రోజు పోలైన ఓట్లు, బ్యాలెట్ బాక్సుల్లో ఉన్న ఓట్లు సరిపోలాయా..? అన్నది చెక్ చేయడంతో పాటు 25 చొప్పున ఓట్లను బండిల్స్‌గా కట్టారు. బుధవారం ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు బండిల్స్ కట్టడానికే సమయం సరిపోయింది. మరోవైపు నల్లగొండ-ఖమ్మం-వరంగల్(నల్లగొండ) పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం ఓట్ల లెక్కింపు చురుకుగా సాగుతోంది.
మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గం ఎన్నికల కౌంటింగ్ సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో, నల్లగొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గ ఎన్నికల కౌంటింగ్ నల్లగొండ ఆర్జాలబావి సమీపంలోని పౌరసరఫరాల గోదాములో కౌంటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో పోటాపోటీ సాగుతోంది.
పరిశీలనకే అధిక సమయం
ఈసారి ఓటేయడానికి పట్టభద్రులు భారీగా తరలివచ్చారు. దీంతో పోలింగ్ ఎక్కువగా నమోదైంది. అభ్యర్థులు ఎక్కువ మంది ఉండడంతో భారీ బ్యాలెట్ పత్రాలను వినియోగించాల్సి వచ్చింది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైప్పటికీ కూడా వాటిని 25 వంతున కట్టలుగా కట్టేందుకే నల్లగొండలో సాయంత్రం వర కు సమయం తీసుకోగా, హైదరాబాద్‌లో దాదాపు రాత్రి 10 గంటలైంది. ప్రక్రియ తదుపరి మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. ఒక్కో బ్యాలెట్ పత్రాన్ని అభ్యర్థుల ఏజెంట్‌లకు ప్రదర్శించి, మొదటి ప్రాధాన్యత ఓటు పడిన అభ్యర్థుల ఒట్లను వారికి కేటాయించిన సెల్ఫ్‌లలో వేస్తున్నారు. కాగా, చెల్లని ఓట్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నట్లు సమాచారం. కౌంటింగ్ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినప్పటికీ బ్యాలెట్ పత్రాల పరిశీలనకు చాలా సమయం పడుతుందని చెబుతున్నారు. పోలైన ఓట్లలో చెల్లని ఓట్లను తొలగిస్తారు. చెల్లిన ఓట్లలో సగాని కంటే ఒక ఓటు ఎక్కువను విజయానికి కోటాగా నిర్ధారిస్తారు. కోటా ఓట్లను సాధించిన వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు.
తొలి రౌండ్ లో పల్లా ముందంజ
మొదటి రౌండ్‌లోనే కోటా ఓట్లు సాధిస్తే ఫలితాలు వెల్లడి తొందరగా ముగుస్తుంది. లేదంటే రెండవ, మూడవ, నాలగవ అంటూ రౌండ్‌లు కొనసాగుతూనే ఉంటాయి. ఈ లెక్కన గురువారం అయినా అధికారికంగా ఫలితాలు వెల్లడి అవుతాయా లేదా అనేది అనుమానంగానే ఉంది. ఈ రెండు చోట్లా బుధవారం రాత్రి 12 గంటల వరకూ ఒక్క రౌండ్ కూడా పూర్తి కాలేదు. చెల్లుబాటైన ఓట్లలో సగం కంటే ఒక ఓటు (మొదటి ప్రాధాన్యం) ఎక్కువగా వస్తే.. ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యంలో ఫలితం తేలని పక్షంలో రెండో ప్రాధాన్యం ఓట్లు లెక్కిస్తారు. తక్కువ మొదటి ప్రాధాన్యం ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తు.. వారికి వచ్చిన బ్యాలెట్ పత్రాల్లో రెండో ప్రాధాన్యంను ఆయా అభ్యర్థులకు కలుపుతారు. అలా కలిపే క్రమంలో సగం కంటే ఒకటి ఎక్కువగా ఓటు వచ్చిన అభ్యర్థిని విజేతగా బదులిస్తారు.
కడపటి వార్తలందేసరికి నల్లగొండలో తొలిరౌండ్ ముగియగా.. టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. మొత్తం 56 వేల ఓట్లలో ఆయనకు 15,990 ఓట్లు వచ్చాయి. అయితే స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న 12,567 ఓట్లతో ఆయనకు గట్టిపోటీ ఇస్తున్నారు. టీజేఎస్ అభ్యర్థి కోదండరాం 9 వేలకు పైగా ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. చెల్లని ఓట్లు 3వేల దాకా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీగా కొనసాగుతోంది.
భారీగా పోలింగ్, అందుకే ఆలస్యం
నల్లగొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గంలో మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక్కడ మొత్తం 5,05,565 ఓట్లు ఉన్నాయి. ఆదివారం జరిగిన పోలింగ్‌లో నల్లగొండలో పోలైన ఓట్లు 3,86,320. అంటే 76.41శాతం పోలింగ్ నమోదైంది. అలాగే హైదరాబాద్ నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులు 93 మంది. ఇక్కడ మొత్తం ఓట్లు 5,17,883 మంది ఓటర్లు ఉన్నారు. వాటిలో 3,57,354 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ శాతం 67.26గా నమోదైంది. గతంలో ఎప్పుడూ 40 శాతానికి మంచి పోలింగ్ జరగలేదు. భారీగా పెరిగిన పోలింగ్‌తో ఈసారి ఫలితాలు ఆలస్యం కానున్నాయి.