iDreamPost
iDreamPost
బాలీవుడ్ లో జరుగుతున్న అనూహ్య పరిణామాలు రకరకాల మార్పులకు దారి చూపుతున్నాయి. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ కంటెంట్ విషయంలో మరీ కఠినంగా ఉంటూ థియేటర్లకు రావడానికి మొండికేయడంతో లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్, లైగర్ లు ఎంత దారుణంగా బోల్తా కొట్టాయో చూస్తున్నాం. బడ్జెట్ లు కూడా చేయి దాటిపోవడం నిర్మాతల నష్టాలను మరింత తీవ్రతరం చేస్తోంది. అందుకే ఫలానా ప్రాజెక్ట్ ప్రకటించినంత మాత్రాన అది సెట్స్ కు వెళ్లే తీరుతుందనే గ్యారెంటీ లేదు. అలాంటిదే ఇది కూడా. కొన్ని నెలల క్రితం టైగర్ శ్రోఫ్ రష్మిక మందన్న కాంబోలో స్క్రూ డీలా టైటిల్ తో భారీ బడ్జెట్ వేసుకుని ఓ సినిమా ప్లాన్ చేసుకున్నారు నిర్మాత కరణ్ జోహార్.
కానీ ఇప్పుడది ఆగిపోయిందని లేటెస్ట్ అప్ డేట్. దానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. టైగర్ శ్రోఫ్ దీనికి ముందుగా 35 కోట్ల పారితోషికం డిమాండ్ చేశాడట. అంత మొత్తమైతే బరువవుతుందని భావించిన ప్రొడ్యూసర్ కరణ్ దాన్ని 20 కోట్లకు తగ్గించుకోమని అడిగాడట. అయితే మార్కెట్ ఉంది కాబట్టి ఇవ్వాల్సిందేనని టైగర్ పట్టుబట్టడంతో తప్పని పరిస్థితిలో స్క్రూ డీలాని ఆపేశారని వినికిడి. కొద్దిరోజుల క్రితం ఇది నిజం కాదని త్వరలోనే క్లారిటీ ఇస్తామని ప్రొడక్షన్ హౌస్ ప్రకటించింది కానీ ఖచ్చితంగా ఉండే తీరుతుందని చెప్పలేదు. సో రష్మిక మందన్న చేతిలో ఒక బాలీవుడ్ మూవీ పోయినట్టే. టైగర్ శ్రోఫ్ కు మాస్ లో ఇమేజ్ గుర్తించే రష్మిక తొలుత ఒప్పుకుంది.
ఇలా జరగడం వల్ల రష్మికకు వచ్చిన నష్టమేమీ లేదు. ఆల్రెడీ తన బాలీవుడ్ డెబ్యూ అయిపోయింది. సిద్దార్థ్ మల్హోత్రతో చేస్తున్న మిషన్ మజ్ను కీలక దశలో ఉంది. అమితాబ్ బచ్చన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న గుడ్ బై పోస్ట్ ప్రొడక్షన్ మొదలుపెట్టేసుకుంది. సందీప్ రెడ్డి వంగా రన్బీర్ కపూర్ ల కాంబో మూవీ అనిమల్ రెగ్యులర్ షూట్ బ్రహ్మాస్త్ర రిలీజ్ కాగానే స్టార్ట్ చేస్తారు. విజయ్ సరసన నటించిన వారసుడు జనవరికి వచ్చే అవకాశాలున్నాయి. ఎలాగూ పుష్ప 2 ది రూల్ చేతిలో ఉండనే ఉంది. సో టైగర్ శ్రోఫ్ ఒకటి పోయినంత మాత్రాన వచ్చే డ్యామేజ్ ఏమీ లేదు. ఇటీవలే సీతారామంలో చేసిన ప్రత్యేక ముస్లిం క్యారెక్టర్ తనకు మంచి పేరు తీసుకొచ్చింది