దాదాపు 20 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత రేణు దేశాయ్ మళ్ళీ తెరమీదకి వస్తోంది. అదో స్పెషల్ టచ్ టైగర్ నాగేశ్వరరావు సినిమాకి. సరే. పేరు మోసిన స్టువర్ట్ పురం గజదొంగ….మానవతా సంబంధాలను జీవితమంతా కొనసాగించిన వ్యక్తిగా బీదాబిక్కి గుండెల్లో గుడికట్టుకున్నవాడు.. అతని జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాగా టైగర్ నాగేశ్వరరావు సినిమాకి అట్రాక్షన్ వచ్చింది. అదో స్పెషల్ టచ్. కాగా.. ఇటువంటి పాత్రను మాస్ మహరాజ్ రవితేజ చేయడం అన్నది మరో అడిషనల్ స్పెషల్ టచ్. ఇన్ని స్పెషల్ టచ్ ల సంగమంతో టైగర్.. ఎల్లుండి ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా లెవెల్లో భారీగానే వస్తోంది. కాకపోతే దర్శకుడు వంశీ ఏ విధంగా సినిమాని రూపొందించాడన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ క్వశ్చన్.
నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. వచ్చీరాని తెలుగులో చాలా బిగ్గరగా మాట్లాడుతున్నారు. చాలా కాన్ఫిడెన్స్ ఎగజిమ్ముతున్నారు. రవితేజ పెరఫారమెన్స్ ఇరగదీశేశాడు అని బల్లగుద్ది చెబుతుంటే.. సినిమా మీద అమాంతం అంచనాలు పెరిగిపోయాయి. అయినా పర్వాలేదన్నట్టుగానే అగర్వాల్ భయ్యా సూపర్ ఎనర్జీతో మాట్లాడుతున్నారు. గజదొంగ మీద బయోపిక్ ఏమిటి? నిర్మాతగా మీ ఫీలింగ్ ఏమిటి? అన్న ప్రశ్నలకి అభిషేక్ చాలా ఆసక్తికరమైన సమాధానం చెఫ్పారు. టైగర్ నాగేశ్వరరావు చనిపోయినప్పుడు బాడీని చూడడానికి దాదాపు 2 లక్షలకు పై చిలుకే ప్రజావాహిని ఉప్పొంగింది, అంటే అతను ఎటువంటి గొప్పవాడు అయి ఉంటాడు, అటువంటి వాడిమీద బయోపిక్ ఎందకు తీయకూడదు అని ఉత్సాహంగా ఎదురు ప్రశ్నించారు. ఆటగాళ్ళమీద, ధేశనాయకులమీద, ఎన్నో ఇతర రంగాలకు చెందినవారిమీద బయోపిక్స్ వచ్చాయి, నేను గజదొంగ మీద తీశాను, ఇది కూడా అంతే గొప్పగా ఉంటుందని నిర్మాణాత్మకంగా చెప్పడానికి ఏ మాత్రం వెనుతిరగలేదు అభిషేక్.
నిజమే. సినిమా ఆద్యంతం ఆడియన్స్ ని మెప్పించగలిగితే అది ఎవరి మీద తీసినా జనం చూస్తారు. బ్రహ్మరథం పడతారు. అటువంటి ఉదాహరణలు కూడా గతంలో కోకొల్లలున్నాయి. ఇప్పుడు తాజాగా టైగర్ నాగేశ్వరరావు. రవితేజ చేస్తున్నాడు కాబట్టి.. ఈ రాబిన్ హుడ్ క్యారెక్టర్ తప్పనిసరిగా పండే ఉంటుంది. ఇప్పుడంతా, రేణుదేశాయ్ చేసిన హేమలతా లవణం క్యారెక్టర్ ఎలా వచ్చిందా అన్నదే అందరి డౌటు. హేమలతగారిది నిజజీవితంలో చాలా గొప్ప వ్యక్తిత్వం. గూగుల్ లో సెర్చ్ కొడితే పీజీలకు పేజీలు సమాచారం దొరుకుతుంది. అంత గొప్ప పాత్రని రేణు దేశాయ్ చెయ్యడం అసక్తికరంగా మారింది. ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో దేశాయ్ మేడమ్ తన జీవితంలో కష్టసుఖాలను, దాచుకోలేని బాధలను ఏకరువు పెట్టారు. అవన్నీ ఆమెలోని మెచ్యూరిటీని, నిర్మొహమాటంగా ఏదీ దాచుకోకుండా చెప్పే తెగువని బహిరంగపరిచాయి. ఇటువంటి మెచ్యూరిటీని ప్రదర్శించిన దేశాయ్ హేమలతగారి పాత్రను కూడా ధీటుగా చేసి ఉంటారని ఓ అంచనా. కాకపోతే షూటింగ్లో దర్శకుడు వంశీ మేడమ్ ని డైరెక్ట్ చేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడని ఆ మధ్య మాట్లాడుకున్నారు. ఎందుకు ఇబ్బంది పడ్డాడూ.. అంటే ఆమె పాత్రను అర్ధం చేసుకున్న విధానం, ఆ పాత్రను ఆమె హేండిల్ చేయడంలో ఆమె తీసుకున్న జాగ్రత్తలు వంటివి వంశీకి కొంత ఇబ్బంది పెట్టాయని గట్టి సమాచారం.
షూటింగ్ టైమ్లో డైరెక్టర్ గానీ, ఇతర నటీనటులు గానీ ఎంత ఇబ్బంది పడినా చివరికి అవుట్ పుట్ కరెక్టుగా వస్తే అదే పదివేలు. చివరికి రేణు మేడమ్ క్యారెక్టర్ని బాగానే పండించారని అందరూ పండగ చేసుకున్నారట. అదే నిజమైనప్పుడు.. సినిమాలో అంత కీలకమైన పాత్ర గనుక నిజంగా తెరమీద బాగా పండితే సినిమా విజయానికి అది చాలా పెద్ద ప్లస్ అయితీరుతుంది. అయిందంటున్నారు. అందుకేనేమో అగర్వాల్ బాస్ నిర్భయంగా తన సినిమా గురించి చూసి మాట్లాడండి అని ఫర్మానాలు జారీ చేస్తున్నారు. ఎంతగా ఆయన ఎక్సైట్ అయ్యారంటే రవితేజతో, ఎవ్వరూ తనమీద కంప్లైంట్ చేయకపోతే, ప్రతీ సినిమా రవితేజతో తనే చేయాలన్నంత ఇష్టం ఏర్పడింది రవితేజ అంటే అని ముక్తాయింపు ఇచ్చారు అగర్వాల్ సాబ్. రవితేజ కూడా మాంచి ఫామ్లో ఉన్నాడన్నది ట్రేడ్ అంతటికీ గొప్ప నమ్మకంగా ఉంది. అదే గనుక నిజమైతే రవితేజ నిజంగానే బాక్సాఫీసు టైగర్ అవుతాడు. డౌటే లేదు.
ఇదీ చదవండి: ప్రముఖ నటిని బెదిరించి.. రూ.3.5 లక్షలు, నగలు చోరీ!