iDreamPost
iDreamPost
పార్టీ క్యాడర్ ను ఉత్సాహపరచాలనో.. యువనేతలు జారిపోకుండా చూడటానికో.. వచ్చే ఎన్నికల్లో 40 శాతం టికెట్లు యువతకే ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్భాటంగా ప్రకటించారు. యువతకు అవకాశం అనగానే ఆ కోటాలో తమ వారసులను రంగంలోకి దించడానికి ఆ పార్టీలోని అనేకమంది సీనియర్, వృద్ధనేతలు ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. అయితే దానికి ముందు నుంచే తన వారసుడిని లైన్లో పెట్టి నానాపాట్లు పడుతున్న మాజీమంత్రి అయ్యన్నపాత్రుడుకు ఇంటిపోరు తలపోటుగా మారింది. తనతోపాటు పెద్ద కుమారుడికి కూడా 2024లో టికెట్ ఇప్పించుకోవాలని ప్రయత్నిస్తున్న అయ్యన్నకు ఆయన రెండో కుమారుడి నుంచి ఒత్తిడి మొదలైంది.
గత ఎన్నికలకు ముందువరకు అయ్యన్నపాత్రుడికి నర్సీపట్నం నియోజకవర్గం పెట్టనికోటలా ఉండేది. అక్కడి నుంచి పలుమార్లు ఎమ్మెల్యే అయిన ఆయన 2014లో చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా కూడా చేశారు. అయితే 2019లో జగన్ గాలిలో కొట్టుకుపోయారు. కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ఆయన ఇటీవలి కాలంలో చంద్రబాబు, లోకేష్ భజనలో తరిస్తున్నారు. అందులో భాగంగా వైఎస్సార్సీపీపైనా, సీఎం జగన్ పైనా తరచూ నోరు పారేసుకుంటూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. పార్టీకి, అధినేతకు వీరవిధేయుడినని చెప్పుకుంటున్నారు. అయితే దీని వెనుక ఆయనకు వేరే ప్రణాళిక ఉంది. తనతోపాటు పెద్ద కుమారుడు విజయ్ ని ఎలాగైనా ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని ఆయన తాపత్రయం. 2019 ఎన్నికల్లోనే నర్సీపట్నం టికెట్ తనకు బదులు కొడుకు విజయ్ కి ఇవ్వాలని కోరినా చంద్రబాబు అంగీకరించకపోవడంతో అయ్యన్నే మళ్లీ పోటీ చేయాల్సి వచ్చింది. ఈసారి వ్యూహం మార్చారు. తాను నర్సీపట్నం నుంచి పోటీ చేసి.. పుత్రరత్నాన్ని మాడుగుల నుంచి నిలబెట్టాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే విజయ్ కొన్నాళ్లుగా తరచూ మాడుగులకు వెళ్లి పార్టీ కార్యక్రమాల పేరుతో హడావుడి చేస్తున్నారు. ఎమ్మెల్యేగా కాకపోతే అనకాపల్లి నుంచి ఎంపీగా అయినా పోటీ చేయాలని విజయ్, అయ్యన్నల ప్లాన్. విజయ్ ఇప్పటికే లోకేష్ కోటరీలో ఉంటూ అధిష్టానం మనసు చూరగొనే ప్రయత్నాల్లో కూడా ఉన్నారు. ఈ తరుణంలో చిన్నపుత్రుడు రాజేష్ నాకేంటి.. అంటూ ఎదురొస్తున్నారు. ఇప్పటికే నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలరుగా ఉన్న ఆయన కూడా ఎమ్మెల్యే అవ్వాలని ఉబలాటపడుతున్నారు. అన్న విజయ్ తో పాటు తనకు టికెట్ ఇప్పించి పోటీ చేయించాలని తండ్రి అయ్యన్నపై రాజేష్ కొద్దిరోజులుగా ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. దాంతో ఇంట్లో అలకలు, వివాదాలు మొదలయ్యాయి. రెండు టికెట్లే సాధించడం కష్టమని అనుకుంటుంటే.. మూడో టికెట్ ఎలా వస్తుందని అయ్యన్న తలపట్టుకుంటున్నారు.
దశాబ్దాలుగా తన కుటుంబం మాత్రమే రాజకీయంగా ఎదగాలన్నట్లుగా అయ్యన్నపాత్రుడు వ్యవహరిస్తున్నారు. ఆయన ఎదుగుదలకు సొంత సోదరుడు సన్యాసిపాత్రుడి కృషి, శ్రమే కారణం. కానీ తమ్ముడి కుటుంబాన్ని కాదని గత ఎన్నికల్లో తన పెద్ద కుమారుడిని వారసుడిగా తెరపైకి తేవడంతో అసంతృప్తికి గురైన సన్యాసిపాత్రుడు వైఎస్సార్సీపీలో చేరిపోయారు. అతని సతీమణి అనిత ప్రస్తుతం విశాఖ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. సోదరుడు వైఎస్సార్సీపీలో చేరడంతో బలహీనపడిన అయ్యన్న నర్సీపట్నంలో మళ్లీ బలపడటం కోసం గత ఏడాది మున్సిపల్ ఎన్నికల్లో పట్టుబట్టి మరీ తన భార్య, రెండో కుమారుడు రాజేష్ లను కౌన్సిలర్లుగా గెలిపించుకున్నారు. అలాగే గత ఎన్నికల్లో వీలుకాకపోయినా వచ్చే ఎన్నికల్లోనైనా పెద్ద కుమారుడు విజయ్ కి అసెంబ్లీ టికెట్ ఇప్పించాలని తాపత్రయ పడుతుంటే చిన్న కొడుకు పోటీకి రావడం, పంతం పడుతుండటంతో మొదటికే మోసం వస్తుందేమోనని అయ్యన్న ఆందోళన చెందుతున్నారు.