iDreamPost
android-app
ios-app

Three Capitals, High Court – మూడు రాజధానులు.. మళ్లీ చర్చలోకి.. ఏం జరగబోతోంది..?

Three Capitals, High Court – మూడు రాజధానులు.. మళ్లీ చర్చలోకి.. ఏం జరగబోతోంది..?

కరోనా వైరస్‌ వ్యాప్తి, హైకోర్టు కార్యకలాపాలకు అంతరాయం, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొంత కాలంగా చర్చలో లేని మూడు రాజధానుల అంశంపై మళ్లీ అన్ని వర్గాలు చర్చించుకుంటున్నాయి. సీఆర్‌డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో రోజు వారీ విచారణ తిరిగి ప్రారంభం అవడం, మరో వైపు అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ కొంత మంది పాదయాత్ర చేయడం, అదే సమయంలో శ్రీభాగ్‌ ఒప్పందం అమలు చేయాలంటూ రాయలసీమలో ప్రజా సంఘాలు ధర్నాలు చేయడం, వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికై కార్యనిర్వాహఖ రాజధానిని త్వరగా ఏర్పాటు చేయాలంటూ అక్కడ పౌర సమాజం ఆందోళనకు సిద్ధమవుతుండడంతో మూడు రాజధానుల అంశంపై మరోసారి ప్రజల్లో చర్చకు తెరలేసినట్లయింది.

మాటల మంటలు..

పౌరసమాజానికి తోడు మరో వైపు మూడు రాజధానుల అంశం వేదికగా.. ప్రతిపక్ష టీడీపీ, అధికార పార్టీ వైసీపీ నేతల మధ్య సవాళ్ల పర్వం మొదలవడంతో రాజకీయ వేడి రాజుకుంది. మూడు రాజధానులపై రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. ఇంకా మూడు జన్మలెత్తిన వైఎస్‌ జగన్, మంత్రులు మూడు రాజధానులను కట్టలేరంటూ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేష్‌ ఎద్దేవా చేశారు. ఒకే రాష్ట్రం – ఒకే రాజధానిగా అమరావతి ఉంటుందని లోకేష్‌ ధీమా వ్యక్తం చేశారు. ఆ వెంటనే మంత్రి బొత్స సత్యనారాయణ అందుకున్నారు. నారా లోకేష్‌ ఎన్ని జన్మలెత్తి అయినా ఎమ్మెల్యేగా గెలవగలరా..? అంటూ చురకలు అంటించారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. మరో మంత్రి కురసాల కన్నబాబు కూడా మూడు రాజధానులపై స్పందించారు. రాష్ట్రానికి మూడు రాజధానులను తేవడం మా తరమో కాదో మీరే చూస్తారంటూ పేరు ప్రస్తావించకుండా నారా లోకేష్‌ను ఉద్దేశించి అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి కోసమే మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నామని కన్నబాబు పునరుద్ఘాటించారు.

రెండు పడవలపై బీజేపీ..

ప్రతిపక్ష టీడీపీ, అధికార పార్టీ వైసీపీలు రాజధాని అంశంపై తమ విధానం ప్రకారం రాజకీయాలు చేస్తున్నాయి. అయితే ఈ విషయంలో బీజేపీ స్పష్టమైన వైఖరిని తీసుకోవడం లేదు. ఒక సారి మూడు రాజధానులు ఏర్పాటుకు మద్ధతని, కర్నూలులో హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తుంది. మరో సమయంలో అమరావతి రైతుల ఉద్యమానికి మద్ధతు ఇస్తున్నామని భిన్నమైన ప్రకటనలను ఏపీ బీజేపీ నేతలు చేస్తున్నారు. రాజధాని విషయంలో ఇలా రెండు పడవలపై కాళ్లు పెట్టి బీజేపీ రాజకీయాలు చేస్తోంది.

రోజు వారీ విచారణ షురూ..

మరో వైపు హైకోర్టులో సీఆర్‌డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులపై రోజు వారీ విచారణ ప్రారంభమైంది. ఈ వివాదాల వల్ల రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయినట్లు కనిపిస్తోందని, వీలైనంత త్వరగా పిటిషన్లను పరిష్కరిస్తామని హైకోర్టు పేర్కొనడంతో.. కొత్త ఏడాది ప్రారంభంలో ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

Also Read : ABN Andhra Jyothi, Amit Shah, AP BJP – నాపై దాడి చేసిన వారికి సన్మానం చేయలేదా ?