iDreamPost
android-app
ios-app

Apcm ys Jagan,3 capitals – సీఎంల సదస్సులో మూడు రాజధానుల అంశం, విశాఖ, కర్నూలు అభివృద్ధికి జగన్ ప్రయత్నాలు

  • Published Nov 12, 2021 | 5:21 AM Updated Updated Mar 11, 2022 | 10:35 PM
Apcm ys Jagan,3 capitals – సీఎంల సదస్సులో మూడు రాజధానుల అంశం, విశాఖ, కర్నూలు అభివృద్ధికి జగన్ ప్రయత్నాలు

ఆంధ్రప్రదేశ్ లో పాలనా వికేంద్రీకరణ ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే దానికి అనుగుణంగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. చట్టం అమలుకి కొన్ని అడ్డంకులున్నప్పటికీ చట్టప్రకారం అంతా సానుకూలంగా ఉండడంతో ముందుకు సాగాలనే సంకల్పంతో కనిపిస్తున్నారు. ప్రస్తుతం హైకోర్టులో విచారణ సాగుతుండడంతో అది పూర్తి కాగానే కార్యనిర్వాహక రాజధానితో పాటుగా , న్యాయ రాజధాని వైపు వేగంగా అడుగులు వేసే అవకాశం ఉంది. ఇప్పటికే కర్నూలు కేంద్రంగా లోకాయుక్త సహా పలు కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. కార్యకలాపాలు సాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్రం కూడా మూడు రాజధానులకు అనుకూలంగా ఉండడంతో దానిని అవకాశంగా మలచుకునే లక్ష్యంతో జగన్ ఉన్నారు. అమరావతి ని శాసన రాజధానిగా కొనసాగిస్తూ పాలనకు అనుగుణంగా అటు విశాఖ, ఇటు కర్నూలు అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తున్నారు. విశాఖలో భోగాపురం ఎయిర్ పోర్ట్ సహా పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కాబోతున్నాయి. వాటితో పాటుగా అదనపు నిధులు కూడా సమీకరించి మూడు రాజధానులు అభివృద్థి పథంలో ముందుకెళ్ళేందుకు తగ్గట్టుగా యత్నిస్తున్నారు.

ఈ క్రమంలోనే తిరుపతి కేంద్రంగా జరగబోతున్న దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా మూడు రాజధానుల అంశం ఎజెండాలో చేరింది. మూడు రాజధానుల అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. ఆ విషయాన్ని ఎజెండాలో కూడా చేర్చారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్ర రాజధాని అభివృద్ధికి కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉంది. గతంలో అమరావతి పేరుతో కొంత మేరకు నిధులు కేటాయించినప్పటికీ వాటిని సద్వినియోగం చేయలేదని కేంద్రం పెద్దలే పేర్కొన్నారు. దాంతో ఇప్పుడు మూడు రాజధానుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందిస్తే వాటిని ఉపయోగించి ఏపీ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. వాటితో పాటుగా రాష్ట్రానికి చెందిన వివిధ సమస్యలను ఈ సమావేశం దృష్టికి తెచ్చేందుకు 7 అంశాలను ఎజెండాలో చేర్చారు.

అదే సమయంలో అమరావతి పాదయాత్ర పేరుతో రాష్ట్రమంతా రాజకీయంగా అలజడి సృష్టించాలనే యత్నంలో టీడీపీ ఉంటే దానికి చెక్ పెట్టే దిశలో ఉత్తరాంద్ర పాదయాత్ర మొదలుకాబోతోంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అనుగుణంగా విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయడం చంద్రబాబు కి ఇష్టం లేదని ఆప్రాంత నేతలు చెబుతున్నారు. దానినే ప్రజలందరికీ తెలియజేసి టీడీపీ అడ్డుకుంటున్న తీరుని చాటాలని నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చి మూడు రాజధానులను కార్యరూపంలోకి తీసుకురావాలని డిమాండ్ చేయబోతున్నట్టు ఉత్తరాంధ్ర నేతలు చెబుతున్నారు. ఓవైపు అమరావతి పాదయాత్ర, మరోవైపు మూడు రాజధానులకు అనుగుణంగా మహా పాదయాత్ర సాగితే రాష్ట్రంలో రాజధానుల అంశం చుట్టూ రాజకీయ చర్చ కూడా సాగుతుంది. అదే సమయంలో సీఎంల సదస్సులో ఈ విషయాన్ని ప్రస్తావించడం ద్వారా ఏపీ ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఈస్ట్రన్ నావల్ డాక్ కమాండ్ ఆధ్వర్యంలో ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతో ఐఎన్ఎస్ విశాఖపట్నం వార్ షిప్ కూడా సిద్ధమయ్యింది ఇవన్నీ కలిసి మూడు రాజధానుల చుట్టూ కదలిక ఖాయంగా కనిపిస్తోంది.