iDreamPost
android-app
ios-app

హెల్త్ ఎమర్జెన్సీలో కార్పొరేటు ఆస్పత్రులను అదుపు చేయలేరా..?

హెల్త్ ఎమర్జెన్సీలో కార్పొరేటు ఆస్పత్రులను అదుపు చేయలేరా..?

కరోనా సంక్షోభంలో కోట్లు దండుకుంటున్నాయి ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రులు. ట్రీట్ మెంట్ కోసం వస్తున్న పేషెంట్ల నుంచి లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీంతో జనం దాచుకున్న డబ్బంతా ఆస్పత్రులకే ధారపోస్తున్నారు. ఎంతో మంది ఉన్న ఆస్తులను అమ్ముకుంటున్నారు. అప్పులపాలు అవుతున్నారు. అంత ఖర్చు పెట్టినా ప్రాణాలు దక్కక రోడ్డున పడుతున్న కుటుంబాలు ఎన్నో.

ప్రస్తుతం దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రులను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని.. ప్రజలందరికీ వైద్యం అందించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. నిజానికి కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఇది సాధ్యమే. ఇలా చేయడం వల్ల వైరస్ సోకినా మంచి వైద్యం దక్కుతుందన్న భరోసా ప్రజలకు దక్కుతుంది. ప్రైవేటు దోపిడీ నుంచి జనాలు బయటపడుతారు.

క్యాష్ కడితేనే చేర్చుకుంటారు..

ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లు లేక చాలా మంది కరోనా పేషెంట్లు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. కానీ పెద్దపెద్ద ఆస్పత్రులు బెడ్లన్నింటినీ బ్లాక్ చేసి పెడుతున్నాయి. ఎవరు ఎక్కువ కడితే వారికే పడకలను ఇస్తున్నాయి. చాలా చోట్ల రూ.3 లక్షలు అడ్వాన్స్ చెల్లించనిదే బెడ్ ఇవ్వడం లేదు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరిన ఒక్కో పేషెంట్ నుంచి రోజుకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల దాకా చార్జీల రూపంలో వసూలు చేస్తున్నారు. చిన్న ఆస్పత్రుల్లో కూడా తక్కువేం గుంజడం లేదు. రోజుకు కనీసం రూ.40 వేల నుంచి రూ.లక్ష దాకా వసూలు చేస్తున్నారు. ఇలా రోజూ వందల కోట్లను ప్రైవేటు ఆస్పత్రులు దండుకుంటున్నాయి. లక్షల్లో వస్తున్న హాస్పిటల్ బిల్లులు కట్టేందుకు మధ్య తరగతి ప్రజలు పడుతున్న ఇక్కట్లు వర్ణనాతీతం.

మరోవైపు ముందుగా నగదు కడితేనే ఆస్పత్రులు చేర్చుకుంటున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డులను అంగీకరించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. క్యాష్ లేకుంటే గేటు దాటి లోపలికి రానివ్వడం లేదని చాలామంది చెబుతున్నారు.. పైగా చాలా చోట్ల కట్టించుకున్న డబ్బులకు రసీదులు ఇవ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇన్సూరెన్స్ చేయించుకున్న వారికి క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ చేయడం లేదు. కొన్ని చోట్ల ఇన్సూరెన్స్ ఉన్న వారిని చేర్చుకుంటున్నా.. ముందు ఫీజు కట్టి జాయిన్ అవ్వాలని, తర్వాత రీయింబర్స్ మెంట్ చేసుకోవాలని తేల్చి చెబుతున్నాయి. ఇలా ప్రైవేటు దందా మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా సాగిపోతోంది. కానీ మధ్యలో బలవుతోంది మాత్రం ప్రజలే.

Also Read : లాక్ డౌన్ ప్రకటనలు.. అంత రహస్యమెందుకు..?

ఎలాంటి చర్యలు లేవు

ఒక పక్క ప్రైవేటు దోపిడీ విచ్చలవిడిగా సాగుతున్నా.. ఆయా ఆస్పత్రులపై చర్యలు తీసుకునే దిక్కులేదు. ప్రభుత్వాలు బెడ్లు, ట్రీట్ మెంట్.. తదితరాలపై నిర్ణయించిన ఫీజులు ఎక్కడా అమలు కావడం లేదు. కార్పొరేటు ఆస్పత్రులు తాము నిర్ణయించుకున్న ఫీజులనే వసూలు చేస్తున్నాయి. అయితే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని మొన్న చెప్పిన తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్.. వాటిపై తీసుకున్న చర్యలేంటో చెప్పలేదు. కనీసం చర్యలు తీసుకుంటామన్న భరోసా కూడా ఇవ్వలేదు. చాలా రాష్ట్రాల్లో ఇలానే ఉంది పరిస్థితి. చెకప్ ల కోసం ఓ కార్పొరేటు ఆస్పత్రికి వెళ్లిన సీఎం కేసీఆర్.. పరోక్షంగా ప్రైవేటు ఆస్పత్రులను సపోర్టు చేసినట్లే అయింది.

మహారాష్ట్రలో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో సీఎం ఉద్ధవ్ థాక్రే గతంలో సీరియస్ అయ్యారు. చెప్పిన ధరల ప్రకారం బిల్లులు వేయాలని, లేదంటే మొత్తం ఆస్పత్రులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు. ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ గతంలో ఇలానే రియాక్ట్ అయ్యారు. శవాల మీద పేలాలు ఏరుకోవడం ఆపాలంటూ ప్రైవేటు ఆస్పత్రులపై ఈటల రాజేందర్ ఘాటు విమర్శలు చేశారు. కానీ దున్నపోతు మీద వాన కురిస్తే ఏమవుతుంది. ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రుల తీరు కూడా ఇంతే. తమ దందా మాత్రం ఆపడం లేదు.

గట్టి చర్యలు కావాలి

దేశంలో ఇంత జరుగుతున్నా.. ఆరోగ్య సంక్షోభాన్ని నివారించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. వ్యాక్సిన్ ధరలను తగ్గించాలంటూ ప్రైవేటు సంస్థలను అడుక్కోవాల్సిన దుస్థితి. మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో కేంద్రానికి, రాష్ట్రాల‌కు వేర్వేరు ధ‌ర‌ల‌కు వ్యాక్సిన్లు ఇవ్వ‌డ‌మేంట‌ని సుప్రీంకోర్టు ఇటీవల నిల‌దీసింది. నేష‌న‌ల్ ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో దీనిపై కేంద్రానికి పూర్తి నియంత్ర‌ణ ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది. కానీ అత్యున్నత న్యాయస్థానం చెప్పినా కేంద్ర సర్కారు తీరు మారలేదు.

ఇప్పటికైనా మించి పోయింది లేదు. మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించి.. ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వ అధీనంలోకి తీసుకురావాలి. కరోనా సంక్షోభం ముగిసే దాకా వాటిపై నియంత్రణ విధించాలి. ప్రజలందరికీ వైద్యం అందుబాటులో ఉండేలా చూడాలి. కరోనా వచ్చిందనే భయం కంటే.. ట్రీట్ మెంట్ పొందడం ఎలా అనే ఆందోళన ప్రజల్లో రాకుండా చూసుకోవాలి. నిజానికి ఇలా పానిక్ అవ్వడం వల్లే చాలా మంది చనిపోతున్నారు. అందుకే ప్రభుత్వాలు ప్రజల్లో భయాలను తొలగించి మేమున్నామనే భరోసా ఇవ్వాలి. జాగ్రత్తగా ఉండాలని చెబుతూనే.. ఇన్ఫెక్ట్ అయిన వారిని కాపాడుకోవాలి.

130 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో అరకొర వసతులతో ఉన్న కొన్ని ప్రభుత్వ బెడ్లు సరిపోవు. ప్రైవేటు ఆస్పత్రుల పరిధి ఎక్కువ. వాటిలో ఉన్న సౌకర్యాలు ఎక్కువ. వాటి రీచ్ ఎక్కువ. ఇలాంటి సమయంలో గట్టి చర్యలు తీసుకోకపోతే.. మరింత ప్రమాదకరంగా పరిస్థితులు మారిపోతాయి.

భారత్ వెలిగిపోవాలి.. రంగురంగుల దీపాల వెలుగుల్లో.. ప్రజల నవ్వుల్లో.. అంతేకానీ.. చింతమంటల్లో కాదు.

Also Read : మోడీ భ్రమల నుంచి భారత్ బయటపడుతోందా.. ?!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి