ఈరాత్రి “పలాస” సినిమా చూడాలి అని రెడీ అవుతున్నాను.
ఇప్పుడే తమ్మారెడ్డి భరద్వాజ గారి వీడియో,మహేష్ కత్తి పోస్టు చూశాను.
“ఇది దళితుల కోసం తీసిన సినిమా,దళితుల కోసం తీసిన సినిమా, దళితుల కోసం మాత్రమే తీసిన సినిమా..దళితులంతా కదలి వచ్చి ఈ సినిమా చూడాలి, మీరే చూడకపోతే ఇంకెవరు చూస్తారు?” అని అందులో ప్రచారం చేస్తున్నారు.
బహుశా దళితులే ఈ సినిమా చూడాలేమో,మాబోటి వాళ్ళు చూడకూడదేమో అని సినిమాకు వెళ్ళకుండా ఆగిపోయాను.
మన సమస్యని మనమే పరిష్కారం చేసుకుందాం అని పిలుపునియ్యడానికి ఇదేమన్నా ఆర్.టీ.సి సమ్మెనా,లేక గాంధీ హాస్పిటల్ లో జూనియర్ డాక్టర్ల బాయ్ కాటా…?
దయచేసి కళలని కులాలతో ముడిపెట్టకండి….
సినిమాలు అందరివి…అన్ని వర్గాలు ఆదరించాల్సినవి.
ఎవడో ఒకడి వర్గం మాత్రమే ఆదరిస్తే విజయాలు సాధించే ఇండస్ట్రీ కాదిది.
అసలు కులాలను మతాలను ఏమాత్రం పట్టించుకోని, జీవితం లో అలాంటి వాటికి ఏమాత్రం
ప్రాముఖ్యత ఇవ్వని,కేవలం మనుషులకు మానవత్వానికి మాత్రమే విలువ ఇచ్చే నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళ ప్రసంగాలు, పోస్టులు చూసి బాధపడే అవకాశం ఉంది.
వాళ్ళ వాళ్ళ కులాలకి మాత్రమే విలువ ఇచ్చుకునే చాలా మందికి వాళ్ళ అహం దెబ్బతిని ఓహో ఆ సినిమాని వాళ్ళ కులం వాళ్ళు,వాళ్ళ వర్గం వాళ్ళే చూసుకుంటారులే మనమెందుకు వెళ్ళడం అని ఈ సినిమాకి రాకుండా ఆగిపోయే అవకాశం ఉంది…
సినిమాకి తెగాల్సిన టికెట్స్ కూడా తెగకపోయే ప్రమాదం ఉంది…
సినిమాలని ఉద్యమాలుగా ప్రొజెక్ట్ చెయ్యకండి.
పైగా మీరు ఇలా “మన సినిమా మనమే చూడకపోతే..మన సినిమా మనమే చూడకపోతే” అని పదే పదే అంటూ అంటుంటే ఆ సినిమాకి ఎవరూ రావట్లేదేమో అనే అనుమానం మీకు మీరుగా ప్రేక్షకులకు కలిగించినవారవుతారు.
సినిమాకు వద్దామని రెడీ అయి చెప్పులేసుకున్నవాడి ఉత్సాహాన్ని నీరుగార్చి చెప్పులిప్పేసేలా చేసినవారవుతారు.
ఫైనల్ గా సినిమా అంటే ఎంటర్టెయిన్మెంట్,ఎంటర్టెయిన్మెంట్,ఎంటర్టెయిన్మెంట్.
సినిమాలు చూసి కేవలం ఆ మూడుగంటలు మాత్రమే ప్రేక్షకులు ఉద్రేకపడతారు,ఆవేశపడతారు,ఆలోచిస్తారు…అంతేగాని మన సినిమాలతో మారిపోతారు అనుకోవడం మూర్ఖత్వం.
కులం కోసమో,మతం కోసమో,దేశం కోసమో పరిగెత్తుకుంటూ వచ్చి ఎవడూ సినిమా చూడడు.
సినిమా తీసేవాళ్ళ మనస్సాక్షికి కూడా బాగా తెలుసు..మనం చేసేది ప్రజల ఎమోషన్స్ తో బిజినెసే తప్ప బాధ్యత కాదూ అని.
సినిమా కేవలం పెట్టుబడి పెట్టేవాళ్ళకూ ప్రేక్షకులకు మధ్య నడిచే వ్యాపారం మాత్రమే.
మీరు మాకేమిచ్చారూ…మేము మీకేమిస్తాం…. అంతే ఇక్కడ లెక్క .
సినిమాలో నిజంగా విషయముంటే, ఆ విషయాన్ని ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసే విధంగా ప్రమోట్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు మైకుల్లల్లో ఏం చెప్పకపోయినా వచ్చేస్తారు.
గతంలో తమ్మారెడ్డి భరద్వాజ్ గారు తాను తీసిన “పోతేపోనీ” సినిమాని జనాలు ఆదరించనప్పుడు కూడా ఇలాగే స్పందించారు..
“మంచి సినిమాలు రావంటారు, తీస్తే ఎవరూ చూడరెందుకు?” అని అప్పుడు ఆవేశపడ్డారు.
మంచి సినిమాలు చేస్తే చూడరు అని మీరెలా డిసైడ్ అవుతారు సర్…?
ప్రేక్షకులని థియేటర్ కి రప్పించడం లో మీరు ఫెయిల్ అయ్యారని ఎందుకనుకోరు…?
చిన్న సినిమాలుగా రిలీజ్ అయిన “c/o కంచెరపాలెం”ని ఆదరించలేదా…”అర్జున్ రెడ్డి”ని ఆదరించలేదా…? “ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ”ని ఆదరించలేదా…?
లోపం మనదగ్గరే ఎక్కడో జరుగుతుంది,మనం ప్రమోట్ చేసే విధానం లోనే జరుగుతుందేమో అని ఎందుకు గుర్తించరు..?
ప్రేక్షకులకు ఎవరూ శత్రువులు కాదూ, ఎవరూ మిత్రులు కాదూ..
బాగుంటే ఎవరి సినిమానైనా ఆదరిస్తారూ…బాలేకపోతే ఎంత పెద్దోడి సినిమానయినా తోసిపుచ్చుతారు.
ఈ చిన్న నిజం మీకు తెలియనిదా..?
నా క్లోజ్ ఫ్రెండ్ ఒక దళితుడు…ఏరా ఏరా అనుకునే ప్రాణ స్నేహితుడు.
మంచి చెడు అన్నిట్లో ఉంటాయి…
మీరు చెప్పే మాటలు కులాల్ని మతాల్ని కలిపే విధంగా ఉండాలిగానీ,కలిసి వున్న వాళ్ళలో కూడా విషపు ఆలోచనలు పుట్టే విధంగా ఉండకూడదు.
మన అని విభజించడం ఎందులోనూ కరెక్ట్ కాదు…సినిమాల్లో అస్సలు కరెక్ట్ కాదు.
This is not the right way of promoting a new small budget movie..
ఈ విషయాలు మీకు తెలియక కాదూ..ఎంతో అనుభవమున్న మీకు చెప్పేంత గొప్పోన్నీ కాదు.
కొన్ని వేల సినిమాలు చూసిన ఒక మామూలు ప్రేక్షకుడిగా ఈ ఇండస్ట్రీలో నా పెట్టుబడి కూడా ఉందీ,నాకూ ఈ సినిమా ఇండస్ట్రీ మీద ఒక హక్కు ఉంది అని భావించి ఒక బాధ్యతతో మాత్రమే ఈ పోస్ట్ పెట్టాను.
అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
అన్ని విషయాలల్లో మీ ఇద్దరికి ఉన్న అపారమైన నాలెడ్జ్ ని ఎప్పటికీ గౌరవించే,ఇష్టపడే మీ స్నేహితుడు – TNR
—————————————–
[ నేను చెప్పింది మీకు నిజమనిపిస్తే…మీకు వీలవుతే కులాన్ని వర్గాన్ని మెన్షన్ చేస్తూ పెట్టిన మీ పోస్టులు,వీడియోలు ఎవరి మనోభావాలని దెబ్బతీయకముందే మీ సినిమాకి ఇంకా నష్టం కలిగించక ముందే డిలిట్ చేయగలరని ప్రార్థన.
సినిమాని సినిమాగానే ప్రేమిద్దాం…
love you both of you .. ❤️🙏]