దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమైన సీఏఏ,ఎన్నార్సి బిల్లును మొదటినుండి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తాజాగా కేంద్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిన NPR(నేషనల్ పాప్యులేషన్ రిజిస్టర్) ను కూడా తమ రాష్ట్రంలో అమలు చేయబోమని తేల్చిచెప్పారు.
కేంద్ర ప్రభుత్వం NPR కోసం రూ.3,900 కోట్ల బడ్జెట్ కేటాయిచింది. ఇప్పటికే సీఏఏ,ఎన్నార్సి బిల్లులను వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన పినరయి విజయన్ తాజాగా NPR ను తమ రాష్ట్రంలో అమలు చేసేది లేదని స్పష్టం చేసారు. ఇందులో భాగంగా NPR ను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవంగా కేరళ ప్రభుత్వం క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని జనాభా లెక్కల రిజిస్ట్రార్ జనరల్ కు వెల్లడించనున్నట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది.
2020లో జరగబోయే జనాభా లెక్కల్లో NPR ను చేర్చకూడదంటూ కేరళ అడ్మినిస్ట్రేట్ జనరల్ డిపార్ట్ మెంట్ కేరళలోని అన్నిజిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఏ విధంగా జనగణన చేసారో అవే నిబంధనల ఆధారంగా కేరళలో జనాభా లెక్కలు చేపడుతామని కేరళ ప్రభుత్వం తెలిపింది.
NPR అంటే..?
దేశంలో నివసిస్తున్న వారందరి జాబితానే NPR. ఇది దేశ పౌరుల లెక్క తేల్చే గణన కాదు. NPR లో భాగంగా దేశంలో ఎంత మంది నివసిస్తున్నారనేది లెక్కపెడతారు.. ఏదైనా ఒక ప్రాంతంలో ఆర్నెళ్ల నుంచి నివసిస్తున్నవారిని,లేదా రాబోయే ఆర్నెళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఏదైనా ప్రాంతంలో ఉండాలని నిర్ణయించుకున్నవారిని స్థానిక పౌరులుగా గుర్తించి ప్రతి ఇంటికి వెళ్లి ఆ వివరాలను సేకరించనున్నారు. మన దేశంలో గత 6 నెలలుగా నివసిస్తున్న విదేశీయుల వివరాలను కూడా ఇందులో నమోదు చేస్తారు.
పౌరసత్వ చట్టం-1955, పౌరసత్వం (పౌరుల నమోదు మరియ గుర్తింపు కార్డుల జారీ) నిబంధనలు -2003 ఆధారంగా NPRని రూపొందిస్తారు. దేశంలో ఉండే సాధారణ నివాసితులందరూ NPRలో తమ పేరును నమోదు చేయించుకోవాలి.