iDreamPost
android-app
ios-app

బడ్జెట్ సమావేశాలు లేనట్టేనా?

  • Published Mar 22, 2021 | 3:48 AM Updated Updated Mar 22, 2021 | 3:48 AM
బడ్జెట్ సమావేశాలు లేనట్టేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పూర్తి బడ్జెట్ వరుసగా మూడో ఏడాది కూడా ప్రవేశపెట్టే అవకాశం లేనట్టే కనిపిస్తోంది. 2019లో సాధారణ ఎన్నికలు రీత్యా 2019-20 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ను జగన్ ప్రభుత్వం ఈ ఏడాది జూన్ నెలలో జరిగిన సమావేశాల్లో ఆమోదించింది. ఆ తర్వాత గత ఏడాది బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేసి, సమావేశాలకు సన్నద్ధమవుతున్న వేళ కరోనా లాక్ డౌన్ తో మరోసారి పూర్తి బడ్జెట్ కి అవకాశం లేకుండా పోయింది. చివరకు జూలైల్ కరోనా నిబంధనల మధ్య నిర్వహించిన సమావేశంలో బడ్జెట్ ని ఆమోదించారు.

ఈ ఏడాది కూడా పూర్తి బడ్జెట్ సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆశించినప్పటికీ ఎన్నికల కోడ్ దానికి ఆటంకంగా మారుతోంది. ఇప్పటికే స్థానిక ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఈనెల 15వరకూ అది అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత తిరుపతి ఉప ఎన్నికల ప్రక్రియ కోసం కోడ్ అమలులోకి వచ్చింది. దాంతో పాటుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వ్యవహారం కోర్టులో విచారణ సాగుతోంది. కోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల నిర్వహణ చేయాల్సి ఉంటే సమావేశాలకు అవకాశం ఉండదు. దాంతో ఈసారి కూడా ప్రభుత్వం పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అవకాశం లేనట్టుగా కనిపిస్తోంది.

ఇప్పటికే పరిస్థితిని రాష్ట్ర గవర్నర్ దృష్టికి ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీసుకెళ్లారు. రెండు నెలల పాటు ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఆర్డినెన్స్ తీసుకురావడానికి అనుమతించాలని ఆయన కోరారు. మే చివరిలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అసెంబ్లీ సమావేశాలు జరుపుతామని శాసనసభ వ్యవహారాలకు కూడా మంత్రిగా ఉన్న బుగ్గన ప్రతిపాదించారు. అయితే దానిపై తుది నిర్ణయం వెలువడలేదు. కానీ మార్చి చివరి వారంలో ప్రవేశించిన నేపథ్యంలో బడ్జెట్ కి అవకాశాలు కనిపించడం లేదు. దాంతో వరుసగా మూడో ఏడాది కూడా జగన్ ప్రభుత్వం పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు వీలులేని వాతవరణం ఉంది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రాధాన్యతల రీత్యా రాబోయే రెండు లేదా మూడు నెలల కోసం ఆర్డినెన్స్ రూపంలో అమలులోకి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మే నెలాఖరులో నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ కి సభ ఆమోదం తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.