తెలంగాణాలో మాల్స్ సినిమాలు బంద్ : కరోనా ఎఫెక్ట్

అనుకున్నంతా అయ్యింది. ఇప్పటిదాకా కర్ణాటక, కేరళ, ఢిల్లీ రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన సర్వం బంద్ ఇప్పుడు తెలంగాణకు వచ్చేసింది. ఇవాళ అర్ధరాత్రి నుంచి షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్, స్కూల్స్ అన్నింటిని మార్చ్ 31 దాకా నిరవధికంగా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. గత రెండు మూడు రోజులుగా సినిమా విడుదలలు వాయిదా పడతాయని జరుగుతున్న ప్రచారానికి తగ్గట్టు ఇవాళ ఉదయం నాని వి పోస్ట్ పోన్ ని అధికారికంగా ప్రకటించేశారు. ఇక మిగిలిన అనౌన్స్ మెంట్లు వస్తాయని అనుకుంటుండగానే ఏకంగా సర్కార్ మెగా బాంబుని పేల్చింది.

అసలే తక్కువ కలెక్షన్ల తో, ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాలతో లబోదిబోమంటున్న ఎగ్జిబిటర్లకు ఇది శరాఘాతమనే చెప్పాలి. రెండు వారాల పాటు ఇంత భారీ సంఖ్యలో మల్టీ ప్లెక్సులు సినిమా హాళ్లు ఒకేసారి బంద్ చేయడం గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ జరగలేదు. మహా అయితే రెండు మూడు రోజులకె పరిమితం అయ్యే ఇలాంటి మూసివేతలు ఇప్పుడు ఏకంగా 17 రోజులు పాటు గడ్డు పరిస్థితిని ఎదురుకోనున్నాయి. దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతోందన్నది ఖాయం. వాయిదా పడిన సినిమాలతో పాటు వచ్చే నెల షెడ్యూల్ చేసిన వాటిని మళ్ళీ రీ ప్లానింగ్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా పరిశ్రమ పెద్దలకు పెద్ద తలనెప్పిగా మారుతుంది.

సరే దీన్ని ఎలాగోలా సర్దినా ఇప్పుడు మూసివేయడం వల్ల వచ్చే నిర్వహణ ఖర్చులను తర్వాత మేనేజ్ చేసుకోవడం అంత సులభం కాదు. ఉద్యోగుల జీతాలతో పాటు చాలా వ్యయాలను సదరు మాల్స్ యాజమాన్యాలు పైసా ఆదాయం లేకపోయినా భరించాల్సి ఉంటుంది. దీని పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి విపరీతమైన రద్దీతో కళకళలాడే మాల్స్ కు హాలిడే ఇచ్చేసారు కాబట్టి ఆ రోడ్లన్నీ ఖాళీగా ఉండబోతున్నాయి. మూవీ లవర్స్ ఇంట్లో డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ తో సర్దుకుపోక తప్పదు. పెద్ద స్క్రీన్లకు ఇచ్చిన హాలిడేస్ ని ఈ విధంగా ఎంజాయ్ చేయడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి.

Show comments