iDreamPost
android-app
ios-app

పోలీస్ స్టేషన్‌కు తాళం వేసిన మహిళ.. కళ్లు తిరిగి పడిపోయిన సీఐ

పోలీస్ స్టేషన్‌కు తాళం వేసిన మహిళ.. కళ్లు తిరిగి పడిపోయిన సీఐ

తమకు న్యాయం చేయాలంటూ జనాలు ముందుగా ఆశ్రయించేది పోలీసులనే. వారికి తమ సమస్యను మొరపెట్టుకుంటే.. పరిష్కరిస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉంది. శాంతి భద్రలను కాపాడుతూ.. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన రక్షక భటులు.. కొన్ని చర్యల వల్ల వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కొంత మంది చేసే పనుల వల్ల పోలీస్ వ్యవస్థ మొత్తానికి మరకలు అంటుతున్నాయి. ఫిర్యాదులు సరిగా పట్టించుకోవడం లేదని, పని చెప్పాలంటే ముడుపులు చెల్లించాల్సి వస్తుందని, చిన్న సమస్యను పరిష్కరించాలంటే పది సార్లు స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుందన్న అపవాదును మూటగట్టుకుంటున్నారు. ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్న ఓ మహిళ.. ఏకంగా పోలీసులకే బుద్ధి చెప్పాలని వింత చర్యకు దిగింది.

ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఏకంగా పోలీస్ స్టేషన్‍కే తాళం వేసేసిందో మహిళ. ఈ ఘటన విశాఖపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెందుర్తి పోలీస్ స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. ఇంటి వివాదంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. సరిగా స్పందించకపోవడంతో ఆవేదన చెందిన మహిళ ఈ చర్యకు దిగింది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఎన్ఏడీ పై వంతెన సమీపంలోని బాజీ జంక్షన్ ప్రాంతానికి చెందిన తెరపల్లి గౌతమి పార్వతి.. భర్తతో వేరుగా ఉంటుంది. కృష్ణ రాయపురంలో కుమారుడు, కుమార్తెతో కలిసి ఆమె అద్దెకు ఉంటుంది. రెండేళ్ల క్రితం తాను ఉంటున్న అపార్ట్ మెంట్‌లోని ఓ ఫ్లాట్ అమ్మకానికి రావడంతో.. తానే తీసుకుంటానని చెప్పి.. 12.5 లక్షల రూపాయల ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, ఈ ఏడాది మేలో రూ. 5 లక్షలు అడ్వాన్స్ చెల్లించి.. ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యింది.

అయితే ఆ యజమాని కొడుకు, కోడలు.. ఆ ఫ్లాట్ రేట్ పెరిగిందని, ఇప్పుడు అమ్మడం లేదని, ప్లాట్ ఖాళీ చేసి వెళ్లిపోవాలని గౌతమికి చెప్పారు. దీనిపై ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గౌతమి ఆ ఫ్లాట్ ఖాళీ చేసేందుకు ససేమీరా అనడంతో యజమాని కుటుంబం దౌర్జన్యానికి దిగింది. సామాన్లు బయటకు విసిరేసి వెళ్లిపోవాలంటూ రచ్చ రచ్చ చేశాడు యాజమాని కొడుకు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు కేసు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని చెప్పి గౌతమిని పంపించేశారు.  ఇటీవల పని మీద బయటకు వెళ్లిన గౌతమి.. ఇంటికి తిరిగి వచ్చే సరికి.. కూతుర్ని బయటకు నెట్టి.. ఇంటికి తాళాలు వేసేశారు ఓనర్ కొడుకు. కూతుర్ని టాయిలెట్ కు కూడా వెళ్లకుండా బయటే ఉండిపోవడంతో ఆవేదన వ్యక్తం చేసింది తల్లి. అపార్ట్ మెంట్ వాసులు సైతం వారికే మద్దతు తెలుపుతుండటంతో.. తనకు న్యాయం చేయాలంటూ కోరగా.. పోలీసులు స్పందించలేదు.

దీంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆమె పెందుర్తి పోలీస్ స్టేషన్ గేటుకు తాళం వేశారు. దీంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు పోలీసులు. సీఐ మరడాన శ్రీనివాసరావు, ఎస్సై అసిరి తాత.. న్యాయం చేస్తామని చెప్పడంతో తాళాలు తీయగా.. ఆమె ఇంటికి వెళ్లారు. ఇంటి యజమాని, కుటుంబ సభ్యులతో మాట్లాడి.. గౌతమి సామాన్లు ఇంట్లో చేర్చి.. తాళాలు ఆమెకు అప్పగించాలని ఆదేశించారు. అయితే ఇంటి యజమానులు మాత్రం.. ఆమె తప్పుడు పత్రాలతో ఒప్పందం కుదుర్చుకుందని, ఇల్లు ఖాళీ చేయాలని కొన్ని నెలలుగా చెబుతున్నా.. తమపై తప్పుడు ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా.. సర్దిచెప్పేందుకు ప్రయత్నించే క్రమంలో సీఐ శ్రీనివాసరావు అస్వస్థతకు గురయ్యారు. పోలీసు వాహనం వద్ద నీళ్లు తాగుతూ.. కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే ఆయన్ను ఓ ప్రైవేటు ఆసుప్రతికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించడంతో ఆయన కోలుకున్నారు.