iDreamPost
android-app
ios-app

నిర్భయ నిందితుడి ఆత్మహత్యాయత్నం

నిర్భయ నిందితుడి ఆత్మహత్యాయత్నం

2012 లో దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున కదులుతున్న బస్సులో నిర్భయపై జరిగిన కీచక అత్యాచారపర్వంతో దేశంలో అత్యాచారాల నివారణకు నిర్భయ పేరుతోనే కఠిన చట్టం రూపొందించారు. చట్టమైతే రూపొందించారు కానీ ఇంతవరకూ నిర్భయకు న్యాయం జరగలేదు. ఉరి శిక్ష ఖరారయ్యి ఏళ్ళు గడుస్తున్నా న్యాయవ్యవస్థలో ఉన్న లొసుగులు ఉపయోగించుకుని వివిధ రకాల పిటిషన్లను వేస్తూ నిర్భయ దోషులు శిక్ష అమలు కాకుండా జాప్యం చేస్తున్నారు.

ఇప్పటికే రెండుసార్లు ఉరి శిక్ష అమలులో జాప్యం జరిగింది.. ఇప్పుడు తాజాగా నిర్భయ దోషి వినయ్ శర్మ ఆత్మహత్య ప్రయత్నం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే వినయ్ శర్మ ఈ నెల 16 న తలను జైలు గోడకు బాదుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసిన విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. తన చెయ్యిని జైలు ఊచల మధ్య ఉంచి విరగ్గొట్టుకోవడానికి ప్రయత్నం చేసాడని సమాచారం. అయితే సకాలంలో జైలు సిబ్బంది గమనించి అతన్ని అడ్డుకుని హాస్పిటల్ కు తరలించారు..

ఈ ఘటనలో వినయ్ శర్మ కు స్వల్ప గాయాలయ్యాయని తనకి చికిత్స అందించిన అనంతరం డిశ్చార్జ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. వినయ్ శర్మ మానసిక స్థితి సరిగా లేదని వినయ్ శర్మ తరపు న్యాయవాది ఏపీ సింగ్ చెబుతున్నారు.. కానీ న్యాయవాది వాదనలు జైలు అధికారులు తోసిపుచ్చి తన మానసిక స్థితి సరిగానే ఉందని వివరణ ఇచ్చారు. సైకోమెట్రీ పరీక్షల్లో కూడా అతని మానసిక స్థితి సరిగానే ఉందని జైలు అధికారులు తెలిపారు.

కాగా ఇప్పటికే రెండుసార్లు ఉరిశిక్ష వాయిదా పడిన నేపథ్యంలో మార్చ్ 3 న ఉదయం 6 గంటలకు,నిర్భయ దోషులను ఉరి తీయాలని పాటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. ఈ శిక్షను ఎలాగైనా వాయిదా పడేలా చేయాలని నిర్భయ దోషులు ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త డెత్ వారెంట్ జారీ అయిన నేపథ్యంలో సరిగా తినకుండా జైలు అధికారులతో దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దీంతో నిర్భయ నిందితులను సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిఘా పెట్టారు. నిర్భయ దోషుల కదలికలను అనుక్షణం జైలు అధికారులు గమనిస్తున్నారు. మార్చ్ 3 న నిందితులు కొత్త ఎత్తులు వేయకుండా ఉంటేనే ఉరి శిక్ష అమలవుతుంది. అలా కాకుండా నిందితులు పిటిషన్లను వేయడమో లేక శిక్ష వాయిదా వేయడానికి శరీరాన్ని గాయపరచుకోవడమో చేస్తే మరోసారి ఉరిశిక్ష అమలులో జాప్యం జరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.