Idream media
Idream media
వారి పెదవుల కింద విష సర్పమున్నది – బైబిల్
కొండ చిలువ అంటే నాకిష్టం. ఎందుకంటే అది కౌగిలించుకుని చంపేస్తుంది. ధృతరాష్ట్రుడు కూడా కొండచిలువే. కొడుకుని ఎప్పుడూ చూడని, కళ్లు లేని వాడికే కొడుకుపై అంత ప్రేమ వుంటే, కళ్లున్న వాళ్లకి గుడ్డి ప్రేమ వుండడం న్యాయమే.
కొండ చిలువ తన పిల్లని ఏమని పిలుస్తుంది? బంగారు కొండ అంటుందా? జంతువులు, పక్షులు పిల్లలకి తిండి ఎలా పెడతాయో మనకి తెలుసు. మరి సర్పాలు ఎలా? పాములు ఆడించే వాడు ముంగిసకి, పాముకి ఫైట్ పెడతానని మూలికలమ్మి బుట్టలు సర్దుకుంటాడు. చిన్నప్పుడు ఆ ఫైట్ చూడాలని చాలా ఏళ్లు ఎదురు చూశాను. జనధన్ ఖాతాలో లక్షలు పడతాయని జనం ఎదురు చూసినట్టు.
పాము పుట్టలో పాలు పోస్తారు. కనబడితే కర్ర తీసుకుంటారు. నోము అనే సినిమా చూసి , ఒక పాముతో స్నేహం చేయాలనుకున్నా. దొరకలేదు. ఇంకో సినిమా చూసి పొట్టేలుతో ఫ్రెండ్‌షిప్ అనుకున్నా. దాంతో స్నేహం చేస్తే ఆదివారం మధ్యాహ్నం మటన్ బిర్యానీ ఎక్కడి నుంచి వస్తుంది? అని బాషా కళ్లు తెరిపించాడు. బాషా ప్రత్యేకత ఏమంటే రెండు పెగ్గులు బిగిస్తే తనని తాను షోలేలోని ధర్మేంద్ర అనుకునేవాడు. బసంతిని వెతికేవాడు. ధర్మేంద్రతో పాటు ముసలాడై పోయాడు.
దేవర్ అనే నిర్మాత అన్ని జంతువుల సినిమాలు తీసేవాడు. చాలా సూపర్‌హిట్స్ ఉన్నాయి. జంతువులతో సౌలభ్యం ఏమంటే టైంకి వస్తాయి. డైలాగుల్లో వేలు పెట్టవు. ఎడిటింగ్‌లో ఇతరుల సీన్స్ కట్ చేయించవు.
కొండచిలువ స్పెషాలిటీ ఏమంటే నమలదు, కొరకదు. గుటుక్కున మింగుతుంది. పులిలా , సింహంలా హడావుడి చేయదు. నిశ్శబ్దంగా వుంటుంది. దగ్గరికి వస్తే తింటుంది. గుడ్ పొలిటీషియన్.
నగరాల్లో పాములు లేవని అనుకుంటాం కానీ , వుండేదే పాములు.
దీపావళి టపాసుల్లో పాము బిల్ల అని వుంటుంది. కాలిస్తే ఒకటే కంపు.
వెన్నెముక లేకపోవడంతో పాము నేలమీద పాకుతుంది. వెన్నెముక ఉన్నా మనుషులు పాకడానికే ఇష్టపడతారు. నిటారుగా నిలబడడం మరిచి పాకడం సాధన చేస్తున్నారు. తిరుపతి దగ్గర పాకాల అనే వూరు వుంది. ప్రైవేట్ బస్సుల కాలంలో తిరుపతి సత్రాల దగ్గర పాకాలా పాకాలా అని అరిచేవాళ్లు. బస్సు ఎక్కితే ఒప్పుకోరు. పాకుతూ రావాల్సిందే అని నవ్వుకునేవాళ్లం.
పూర్వకాలంలో పరుపులు కుట్టే వాళ్లు లేరు కాబట్టి విష్ణువు ఆదిశేషుడి మీద నిద్రపోయాడు. దేవుని మోస్తున్నందుకు శిక్ష ఏమంటే కదలకూడదు. నిద్రాభంగం కదా!
విష్ణువు గుడ్ మేనేజర్. ఇద్దరు బద్ధ శత్రువుల్ని దగ్గర పెట్టుకున్నాడు. ఇంట్లో శేషుడు, బయట గరుడుడు.
శేషుడు బయటికి పోడు, గరుడుడు లోపలికి రాడు.