iDreamPost
iDreamPost
ఆర్ఆర్ఆర్ విడుదల ప్లాన్ చేసుకున్న రెండు తేదీల్లో ఒకటి ఏప్రిల్ 28. ఆల్రెడీ దీన్ని ఎఫ్3 లాక్ చేసుకున్నప్పటికీ ఎప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతాయో ఎవరూ ఊహించలేరు కాబట్టి ఇప్పటికిప్పుడు ఖరారుగా ఏమీ చెప్పలేం. అయితే ఈ డేట్ కి మాత్రం చాలా ప్రత్యేకత ఉంది. అదేంటో చూద్దాం. తెలుగు మాస్ సినిమాకు కొత్త గ్రామర్ నేర్పించిన ఎన్టీఆర్ ‘అడవిరాముడు’ 1977లో రిలీజయింది ఈ డేట్ కే. ఏడాది పాటు ఆడేసి కోట్ల రూపాయల కనకవర్షాన్ని థియేటర్ల వద్ద కురిపించడం ఎవరూ మర్చిపోలేదు. మహేష్ బాబు కెరీర్ బెస్ట్ లో ఒకటిగా నిలిచే ‘పోకిరి’ 2006లో వచ్చింది ఈనాడే. అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని మాస్ బొమ్మ ఇది.
కమెడియన్ ఆలీని హీరోగా పెట్టి సినిమా తీయడం ఏమిటాని నవ్వినవాళ్లకు ఎస్వి కృష్ణారెడ్డి బ్లాక్ బస్టర్ రూపంలో ‘యమలీల’తో సమాధానం ఇచ్చింది కూడా ఏప్రిల్ 28నే. ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే రాజమౌళి ‘బాహుబలి 2’ వచ్చింది 2017లో ఇదే తేదీకన్న సంగతి మర్చిపోకూడదు. టాలీవుడ్ స్థాయిని వేల కోట్లలోకి మార్చిన ఘనత దీనికే దక్కుతుంది. ఇవే కాదు ఏఎన్ఆర్ సినీ ప్రయాణంలో మైలురాయి లాంటి అనార్కలి(1955), సెక్రటరీ(1976) వచ్చింది కూడా ఈ రోజే. అశ్వినీదత్ నిర్మాణంలో రాఘవేంద్రరావు తీసిన కృష్ణ-కృష్ణంరాజుల భారీ మల్టీ స్టారర్ ‘అడవి సింహాలు’ 1983లో ఇదే డేట్ కి వచ్చింది. కమర్షియల్ గా పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇవి కాకుండా కమల్ హాసన్ నటించిన తెలుగు స్ట్రెయిట్ సినిమా ‘శుభసంకల్పం'(1995)కూడా ఏప్రిల్ 28నే పలకరించింది. రికార్డులు సృష్టించకపోయినా ఒక క్లాసిక్ గా మిగిలిపోయి కీరవాణికి దర్శకులు విశ్వనాథ్ గారికి ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి ఇవి ప్రత్యేకంగా ప్రస్తావించదగినవి. ఏడాదికోసారి ఏప్రిల్ 28 వస్తుంది కానీ ఎప్పుడూ అది శుక్రవారం కాదు కాబట్టి ఇలా అరుదైన ల్యాండ్ మార్క్ గా మిగిలిపోయింది. పైకి మార్చ్ 18 అనే ఆప్షన్ పెట్టుకున్నారు కానీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఆర్ఆర్ఆర్ వచ్చేది ఏప్రిల్ 28నే అని ఇన్ సైడ్ టాక్. అంటే బాహుబలి సెంటిమెంట్ ని జక్కన్న రిపీట్ చేస్తాడన్న మాట
Also Read : Raja Deluxe : ప్రభాస్ ఒప్పుకుంది రిస్కీ కాంబినేషనా