Krishna Kowshik
Krishna Kowshik
దేశానికి వెన్నుముక రైతు అంటారు. కానీ రైతుకు మాత్రం కడ వరకు కండగండ్లే. పంట వేసిన దగ్గర నుండి చేతికి వచ్చేంత వరకు ఒక ఎత్తు అయితే.. ఆరుగాలం పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక చతికిల పడుతున్నారు. అప్పులు ఊబిలో కూరుకుపోయి.. ఉరి కొయ్యలకు వేళాడుతున్నాడు. ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నప్పటికీ.. అవి కంటి తుడుపు చర్యలే అవుతున్నాయి. ప్రకృతి విపత్తుతో పాటు దళారుల చేతిలో దగా పడుతున్నాడు అన్నదాత. అయినప్పటికీ వ్యవసాయాన్ని వదిలిపెట్టడం లేదు. రైతులు తమ మొర వినాలంటూ ప్రభుత్వాన్ని విన్నవించుకున్నాయి. దీంతో రైతు వేదికలు, గ్రామ సభల్లో తమ గోడును వినేందుకు అధికారులను ఏర్పాటు చేశారు. కాగా, తమిళనాడులో ఓ సభలో రైతుకు చేదు అనుభవం ఎదురైంది.
అధికారి అనే అహంకారంతో రైతును గుండెలపై తన్నాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని పిళ్లైయార్ కులం గ్రామంలో సోమవారం జరిగిన గ్రామ సభ జరిగింది. అవినీతి కేసులో అధికారుల నిర్లక్ష్యంతో పాటు గ్రామసభ నిర్వహిస్తున్న పద్ధతిపై అమ్మయ్యప్పన్ ప్రశ్నించగా.. పంచాయతీ కార్యదర్శి తంగపాండియన్ ఆ రైతు చాతీపై కాలితో తన్నాడు. కాగా, ఈ దాడి ఎమ్మెల్యే ఇఎం మన్ రాజ్, బ్లాక్ డెవలప్ మెంట్ అధికారి మీనాక్షి సమక్షంలో జరగడం గమనార్హం. గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన సర్య్కులర్ లో పేర్కొన్న విధంగా.. పలు గ్రామాల మధ్య రొటేషన్ పద్ధతిలో గ్రామ సభ నిర్వహించకపోవడంపై వేప్పంకులం గ్రామానికి చెందిన రైతు అమ్మయ్యప్పన్ ప్రశ్నలు సంధించారు.
ఒకే గ్రామంలో పలుమార్లు సభ నిర్వహించడం వల్ల ఇతర గ్రామాల ప్రజలు తమ సందేహాలను, సమస్యలను చెప్పుకోలేకపోతున్నారని, తమ గ్రామంలో కూడా గ్రామ సభలను నిర్వహించాలని అమ్మయ్యప్పన్ తెలిపారు. దీంతో కోపంతో ఊగిపోయిన తంగపాండియన్ లేచి రైతు చాతీపై తన్నాడు. అదేవిధంగా ఆయన మద్దతుదారులు అమ్మయ్యప్పన్‌ను చెప్పుతో కొట్టారు. తీవ్ర గందరగోళం జరగడంతో గ్రామ సభను రద్దు చేశారు. రైతు చేసిన ఫిర్యాదు మేరకు తంగపాండియన్ పై ఐపీసీలోని నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది.