క్వారంటైన్ కథ – క్రీస్తు పూర్వం నుంచి క్రీ.శ 2020 వరకు

ఇప్పుడంటే కరోనా వలన క్వారంటైన్ అన్నది అందరి నోళ్ళలో నానుతున్న  పదం అయింది కానీ, ఈ ప్రక్రియ మాత్రం క్రీస్తు పూర్వమే మొదలైంది. జబ్బులు ఎలా కలుగుతాయో తెలియకపోయినా, కంటికి కనిపించని జీవం ఉంటుందన్నది ఊహకు కూడా అందని విషయం అయినా, కొన్ని జబ్బులు ఒకరినుంచి మరొకరికి అంటుకుంటాయి అన్న విషయం గమనించడం ఆ జబ్బు ఉన్న వ్యక్తి దగ్గరకు పోకుండా ఉంటే జబ్బు రాకుండా ఉంటుంది అని తెలుసుకోవడానికి మొదటి మెట్టు అయితే, ఆ జబ్బు బారిన పడిన వ్యక్తినే దూరంగా పెడితే మిగిలిన అందరినీ కాపాడవచ్చు అని తెలుసుకోవడం క్వారంటైన్ అన్న ప్రక్రియకు నాంది.

క్రీ. పూ. ఏడవ శతాబ్ధానికి చెందిన బైబిల్ పాత నిబంధనలో భగవంతుడు మోషేకి చెప్పినట్లు ఏ జబ్బు లక్షణాలు ఉన్న వ్యక్తులను దూరంగా పెట్టాలి, ఎంత కాలం దూరంగా పెట్టాలో చెప్పారు. ఇస్లామిక్ చరిత్రలో మహ్మద్ ప్రవక్త కొన్ని రకాల జబ్బుల బారిన పడిన వ్యక్తులను ఆరోగ్యంగా ఉన్న వారి నుంచి దూరంగా ఉంచాలని చెప్పారు. పర్షియాకి చెందిన గొప్ప వైద్యుడు అవిసెన్నా కూడా క్షయ లాంటి వ్యాధుల బారిన పడిన రోగులని ఎంత కాలం మిగతా సమాజం నుంచి దూరంగా ఉంచాలో గ్రంధస్థం చేశాడు.

అయితే ఇలా రోగులను క్వారంటైన్ చేయడం కోసమే ప్రత్యేక ఆసుపత్రులు నిర్మించిన నగరం డెమాస్కస్. కుష్టు రోగులను సాధారణ ప్రజానీకం నుంచి వేరు చేయడానికి ఎనిమిదవ శతాబ్దంలో ప్రత్యేక ఆసుపత్రులు నిర్మించారు.

మధ్య యుగం యూరోప్
అయితే క్వారంటైన్ అన్న పేరు కానీ, దాని విధి విధానాలు కానీ పుట్టింది పద్నాలుగో శతాబ్దంలో యూరోప్ ఖండంలో. 1348-1359 మధ్య ప్లేగు వ్యాధి యూరోపులో దాదాపు మూడవ వంతు జనాభాను ఆసియా ఖండంలో చాలా మందిని తుడిచి పెట్టింది. ప్లేగ్ వ్యాధిని అదుపుచేసే మందులేవీ లేని ఆ రోజుల్లో ఆ జబ్బుతో పోరాటం చేయడానికి ప్లేగు రోగులని దూరంగా ఉంచడం ఏకైక మార్గం అని గుర్తించారు.

బాగా రద్దీగా ఉండే ఓడరేవులు ఉన్న నగరాల్లో ప్లేగ్ వ్యాధి తీవ్రంగా ఉండడంతో ఇటలీ లోని వెనిస్, మిలన్ లాంటి నగరాలు సమీపంలో ఉన్న ద్వీపాలకు ఆ రోగులను తరలించి అక్కడ ముప్పై రోజులు ఉంచి, వారు మరణిస్తే అక్కడే దహనం చేయడం, కోలుకుంటే వెనక్కి రప్పించడం చేసే వారు. వెనిస్ నగరంలో మాట్లాడే ఇటాలియన్ భాషలో ముప్పైని ట్రెంటైన్ అంటారు. అందుకే ఈ ప్రక్రియను ట్రెంటైన్ అని పిలిచేవారు. ఆ తర్వాత ఈ కాలపరిమితిని నలభై రోజులకు పెంచాక ఇది క్వారంటైన్ అయింది.

అలాగే ఓడరేవులోకి వచ్చే ఓడలను కూడా రేవు నుంచి దూరంగా నలభై రోజుల పాటు నిలిపిఉంచి ఆ తరువాతే రేవులోకి రప్పించేవారు. క్వారంటైన్లో ఉన్న ఓడల మీద ఆ విషయం అందరికీ తెలిసేలా పసుపురంగు జెండా ఎగరేసేవారు. ప్లేగ్ ఒక్కటే కాకుండా లెప్రసీ, సిఫిలిస్, ఎల్లో ఫీవర్ లాంటి వ్యాధులను కూడా ఇరవైవ శతాబ్దం ప్రధమార్దం వరకూ క్వారంటైన్ తోనే మేనేజ్ చేశారు వైద్యులు.

అమెరికాలో

అమెరికా ఖండాన్ని కనుగొన్నాక యూరప్ నుంచి అనేకమంది సరికొత్త అవకాశాలను వెతుక్కుంటూ అమెరికా బాట పట్టారు. ఇలా యూరప్ నుంచి వచ్చే ఓడలు అధికభాగం న్యూయార్క్ హార్బర్ చేరేవి. యూరోప్ నుంచి వ్యాధులు తమ దేశంలో ప్రవేశించకుండా ప్రతి వ్యక్తిని వైద్య పరీక్షలు జరిపిన తరువాతే తమ దేశంలో అడుగు పెట్టనిచ్చేవారు. అనుమానం కలిగితే వారిని సమీపంలోని బెడ్లో ద్వీపంలో ఉన్న క్వారంటైన్ సదుపాయంలో ఉంచేవారు. ఈ ద్వీపంలో ఆ తరువాత కాలంలో లిబర్టీ విగ్రహం పెట్టాక అది లిబర్టీ ద్వీపం అయింది.

టైఫాయిడ్ మేరీ

క్వారంటైన్ గురించి ప్రస్తావించినప్పుడు తప్పకుండా చెప్పుకోవలసిన పేరు మేరీ మాలోన్. తను టైఫాయిడ్ తో బాధ పడకుండా ఇరవయ్యవ శతాబ్దం మొదట్లో న్యూయార్క్ నగరం చుట్టుపక్కల వంటగత్తెగా పనిచేసి యాభై ఒక్క మందికి టైఫాయిడ్ అంటించి, ముగ్గురి మరణానికి కారణమైన ఈమె, తన శరీరంలో నుంచి టైఫాయిడ్ బాక్టీరియాని నిర్మూలించే గాల్ బ్లాడర్ తొలగించే ఆపరేషన్ చేయించుకోవడానికి అంగీకరించ పోవడంతో 1907 నుంచి 1910 వరకూ ఒకసారి, 1915 నుంచి 1938లో మరణించే వరకూ మరోసారి క్వారంటైన్లో ఉంచారు.

భారతదేశంలో

18వ శతాబ్దం ద్వితీయార్ధంలో ప్రపంచం మొత్తం మరణమృదంగం మోగించిన ప్లేగ్ మహమ్మారి హాంకాంగ్ నుంచి భారతదేశంలో ప్రవేశించి ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ భారతదేశంలో లక్షలాదిమందిని పొట్టన పెట్టుకుంది. బొంబాయి రాష్ట్రంలో మూడవ వంతు మందిని తుడిచి పెట్టేసింది. ప్లేగ్ వచ్చేసరికి బొంబాయి రాష్ట్రంలో మశూచి, కలరా మహమ్మారులు విలయతాండవం చేస్తున్నా వేగంగా వ్యాపించే స్వభావం వల్ల ప్లేగ్ ఎక్కువ మంది మరణానికి కారణమైంది.

అప్పుడు అధికారంలో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం క్వారంటైన్ పద్ధతిని కఠినంగా అమలు చేసింది. ప్లేగ్ ఇన్స్పెక్టర్లను నియమించి ప్లేగ్ సోకిన వారందరినీ క్వారంటైనుకు తరలించడం, ప్లేగు రోగులు ఉన్న ఇళ్ళమీద అందరికీ తెలిసేలా గుర్తులు వేయడం, ప్రజలు ఎక్కువ మంది గుమికూడే కార్యక్రమాలు నిషేధించడం లాంటి చర్యలతో ప్లేగు వ్యాప్తిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

అయితే క్వారంటైన్ కేంద్రాల్లో వివక్ష పాటించకుండా అన్ని కులాల, మతాల రోగులను ఒకే చోట ఉంచడం, గుళ్ళలో, మసీదులలో ప్రార్ధనా కార్యక్రమాలు నిషేధించడం, అప్పుడే కొత్తగా కనుక్కొన్న ప్లేగ్ వాక్సీన్ అందరికీ తప్పనిసరి చేయడం, ఆ వాక్సీన్ మీద హిందువులు, ముస్లింలలో అపోహలు కలగడం లాంటి కారణాలతో క్వారంటైన్ మీద ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. 1897లో పూనా నగరంలో ప్లేగ్ కమీషనర్ రాండ్, ఆయన సహాయకులను చప్కేకర్ సోదరులు కాల్చి చంపడం ఈ వ్యతిరేకతకు పరాకాష్ఠ. క్వారంటైన్ తప్పించుకోవడానికి చాలా మంది నగరాల నుంచి గ్రామాలకు వలసలు పోయారు.

వ్యోమగాముల క్వారంటైన్

1969లో చంద్రుడి మీద విజయవంతంగా కాలు మోపి తిరిగి వచ్చిన వ్యోమగాములు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, మైఖేల్ కొలీన్స్, బజ్ ఆల్డ్రిన్ లు కూడా ఇరవై ఒక్క రోజులు క్వారంటైన్లో గడిపాకే బయటకొచ్చారు. చంద్రుడి మీద సూక్ష్మజీవులు ఏమైనా వారితోపాటు భూమి మీదకు వస్తాయేమో అన్న భయం వల్ల వారాని ఇలా క్వారంటైన్లో పెట్టారు.

Show comments